మత్తులో జోగుతున్నదెవరు?
గంజాయి దమ్ము కొడితేనో; నల్లమందు, హెరాయిన్, కొకైన్ లాంటివి సేవిస్తేనో మాత్రమే ఎవరైనా మత్తులో కూరుకుపోతారని అమాయకంగా తలపోసేవారికి కనువిప్పు కలిగించే చేదునిజాలివి. ఒకటి కాదు, రెండు కాదు... కొత్తరకం మత్తుకారకాల విస్తృతి, వైవిధ్యం గమనిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆ జాబితాలో ఎన్నదగ్గ ఉదాహరణ ‘ఫెన్సిడిల్’. కావడానికి అది దగ్గుమందేగాని, మత్తు కలిగించడంలో చురుకైంది. వైద్యుల సిఫార్సు లేనిదే ఔషధ దుకాణాల నిర్వాహకులు ఫెన్సిడిల్‌ను విక్రయించకూడదు. ఆ మందు తయారీకి అవసరమైన ప్రధాన మూలకం కోడీన్ ఫాస్ఫేట్ మాదకద్రవ్యాల కేంద్ర విభాగం (సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్) అనుమతి లేనిదే ఎవరికీ లభించరాదని నిబంధనలు సెలవిస్తున్నాయి. ఆ జాగ్రత్తల్ని గాలికొదిలేసి ఉత్పత్తి, విక్రయాలు విచ్చలవిడిగా రెచ్చిపోవడం నడుస్తున్న చరిత్ర.
ఆమధ్య భారీయెత్తున ఫెన్సిడిల్ సీసాల్ని తరలిస్తున్న లారీనొకదాన్ని బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. తీగ లాగితే డొంకంతా కదిలింది. దగ్గుమందు భూరి నిల్వల తరలింపులో తెలుగు రాష్ట్రాల పేర్లు బయటపడ్డాయి. గుంటూరు, భీమవరం, నర్సరావుపేట, విజయవాడ, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, కరీంనగర్‌లకు వాటిని సరఫరా చేస్తున్నట్లు దొంగబిల్లులు సృష్టించిన బాగోతం వెల్లడైంది. ఆ నకిలీ బిల్లుల్లో పేర్కొన్న మేరకు, మొత్తం సరకు విలువ దాదాపు రూ.300కోట్లు. గుట్టుచప్పుడు కాకుండా అటువంటి లారీలు ఇప్పటికెన్ని నిర్దేశిత లక్ష్యాలకు నిక్షేపంగా చేరిపోయాయో ఎవరికెరుక? పొరపాటునో గ్రహపాటునో దొరికిపోయిన కేటుగాళ్ల లోగుట్టుమట్ల కూపీలాగే బాధ్యతను ఔషధ నియంత్రణ సంస్థ రెండేళ్లక్రితం సీఐడీకి దఖలుపరచినా, ఇప్పటిదాకా విచారణ వేగం పుంజుకోలేదు. సీఐడీ చేతులెత్తేసిన కేసును కేదస(సీబీఐ)కి అప్పగించాలంటూ ఔషధ నియంత్రణ సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసిందంటున్నారు. చతికిలపడ్డ పరిశోధన ఎప్పటికి తిరిగి మొదలై ఒక కొలిక్కి వస్తుందో తెలీదు!
దేశంలో ఏటా ఆరున్నర కోట్లకు పైగా ఫెన్సిడిల్ దగ్గుమందు సీసాలు తయారవుతున్నాయి. గణాంకాల ప్రకారం, అందులో తెలుగురాష్ట్రాలకు చేరుతున్నవి సుమారు 66లక్షల సీసాలు. ఇదంతా బిల్లుల మాయాజాలమే. అసలు ధర దాదాపు రూ.70 అయినా అంతకు నాలుగు నుంచి పదింతల వరకు ధర పలుకుతున్న ఇతర రాష్ట్రాలకు, పొరుగుదేశాలకు సింహభాగం సరకును తరలించేస్తున్నారు. దగ్గుమందుకు ఎందుకింత గిరాకీ అనే ప్రశ్నకు వచ్చే జవాబు ఎవరినైనా దిమ్మెరపరచక మానదు. మద్యనిషేధం ప్రకటించిన బిహార్ మీదుగా బంగ్లాదేశ్‌కు సరఫరాలు జోరెత్తుతున్నాయి. మద్యానికి ప్రత్యామ్నాయంగా దగ్గుమందు వాడకం ఇంతలంతలయ్యేకొద్దీ అక్రమ రవాణాదారులకు లాభాల పంట విపరీతమవుతోంది. పొడిదగ్గు వూపిరి సలపనివ్వ కుండా ప్రాణాలు తోడేస్తున్న ప్పుడు వైద్యుల పర్యవేక్షణలో రెండు లేదా మూడు రోజులకన్నా ఎక్కువ వాడ కూడని మందు ఫెన్సిడిల్! మోతాదు మించి వినియోగిస్తే మగతలో జోగుతారు. దానికి అలవాటు పడ్డారా- రోగ నిరోధక శక్తి క్షీణించి, కాలేయ సంబంధ వ్యాధులు కోరచాస్తాయి. అటువంటి ‘మందు’ ఒక్క బిహార్‌లోనే ఏటా కోటి సీసాలకుపైగా అమ్ముడవు తోంది. ఈశాన్య భారతంలో పాన్‌బడ్డీలు, పచారీ కొట్లలోనూ ఫెన్సిడిల్ విక్రయాలు అడ్డూఆపూ లేకుండా సాగుతున్నాయి. నేపాల్, మియన్మార్, బంగ్లాదేశ్‌లకు ఇదమిత్థంగా తరలుతున్న సరకెంతో ఎవరూ నిక్కచ్చిగా చెప్పగల పరిస్థితి లేదు. రాజస్థాన్, దిల్లీ, హైదరాబాదులతో పాటు ఇతర నగరాలు, పట్టణాల పేర్లూ వినిపిస్తున్న దృష్ట్యా- చూస్తూ వూరుకుంటే మేస్తూ పోయిన సామెతను నిజం చేయడంలో మత్తు మాఫియా ప్రావీణ్యం ఎనలేనిదని అంగీకరించక తప్పదు.
ఫెన్సిడిల్ ఒక్కటేనా? వూపిరి, ఛాతీ సమస్యల నుంచి తాత్కాలిక ఉపశమనానికి ఉపకరించే ఎఫిడ్రిన్ సైతం కోట్ల రూపాయల మత్తు వ్యాపారానికి అనువైన సాధనమవు తోంది. మత్తుకు అలవాటుపడి చౌక ప్రత్యామ్నాయాలకు వెంపర్లాడుతున్నవారికి మరిన్ని సులువైన పరిష్కారాలు ఇట్టే లభిస్తున్నాయి. టైపింగ్ పొరపాట్లు సరిదిద్దేందుకు ఉపయోగించే వైటెనర్లు, గోళ్ల రంగు తొలగించడానికి వాడే నెయిల్ పాలిష్ రిమూవర్లు సైతం ‘విశేష ఆదరణ’ పొందుతున్నాయి. నిన్న కాక మొన్న మెదక్ జిల్లా ఖాజీపేటలో రూ.25 లక్షల విలువైన అల్ఫ్రాజోలం పట్టుబడింది. అది కల్తీకల్లులో కలిపే మత్తుమందు! పొలంలో పాడిగేదెల పెంపకం కోసమంటూ వేసిన షెడ్డులో గప్‌చుప్‌గా అల్ఫ్రాజోలం తయారీ యంత్రాలు అమర్చి అక్కడ లక్షల రూపాయల సరకు తయారు చేస్తున్నట్లు యాదృచ్ఛికంగా వెల్లడైంది. నిఘా యంత్రాంగం నిష్ఠగా జోగడం అయాచిత వరమై, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకెన్ని చోట్ల ఆ తరహా ‘కుటీర పరిశ్రమలు’ వర్ధిల్లుతున్నాయో ఏమో!
నిఘా, నియంత్రణ వ్యవస్థలు జావగారిన దశలో నిషేధాస్త్ర ప్రయోగం నిష్ప్రయోజకం కాకుండా ఉంటుందా? దేశంలో విరివిగా ఉపయోగించే రెండు దగ్గుమందులు ఫెన్సిడిల్, కోరెక్స్ సహా 350 రకాల ఔషధాల ఉత్పత్తి, విక్రయాలపై పదహారు నెలల క్రితం విధించిన నిషేధమే అందుకు దాఖలా. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా మందుల నాణ్యత అంతంతమాత్రమేనని, నకిలీ రకాలకూ కొదవ లేదని నిగ్గుతేల్చిన కేంద్ర ఆరోగ్య శాఖ అధ్యయనం- ఎక్కడికక్కడ వేళ్లూనుకున్న అవ్యవస్థనే కళ్లకు కడుతోంది. అసలు ఉపయోగించరానివి, దీర్ఘకాలం వాడితే ప్రమాదకరమయ్యే ఔషధాల్ని ఏళ్ల తరబడి జనం నెత్తిన రుద్దిన పాపం, నిషేధాంక్షల అమలులో విఫలమైన నేరం- నియంత్రణ సంస్థల ఖాతాలోనే జమపడతాయి. కోడీన్ ఫాస్ఫేట్ వితరణ గాడి తప్పడంలో స్వీయబాధ్యతను కేంద్ర మాదక ద్రవ్య నిరోధక మండలి దులపరించుకోజాలదు. నిషేధాన్ని తుంగలో తొక్కి వందల కోట్ల రూపాయల వ్యాపారం యథేచ్ఛగా సాగించుకునేలా అక్రమ ముఠాలకు వెసులుబాటు కల్పించడంలో, భారత ఔషధ ప్రధాన నియంత్రణాధికారి (డీసీజీఐ) పాత్రా తక్కువేమీ కాదు. ఈ బహుముఖ వైఫల్యాలే- నిషేధిత ఔషధాలు, హానికారక పదార్థాల ఉత్పత్తి, సరఫరాల రూపేణా సంఘవిద్రోహ శక్తులకు ఎడాపెడా లాభాల పంట పండిస్తున్నాయి. యువత పెద్దయెత్తున మత్తుకు బానిసలయ్యేందుకు శాయశక్తులా పుణ్యం కట్టుకుంటున్నాయి.
మోతాదుకు మించిన మత్తు పదార్థం కలిపినట్లు పరీక్షల్లో వెల్లడైతే ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టెన్సెస్) చట్టం ప్రకారం ఆ సంస్థపై బెయిలుకు వీల్లేని కేసు నమోదు చేయగల అవకాశముంది. అటువంటి నిబంధనలూ చెల్లని కాసులవుతున్నాయంటే, అధికార సిబ్బంది పనితీరును అవినీతితోపాటు భిన్నాంశాలు ప్రభావితం చేస్తున్నాయనడంలో తప్పేముంది?
మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరాలపై ‘సిట్’ విచారణ కేసుల దగ్గరే ఆగిపోదని, శాశ్వత ప్రాతిపదికన నిఘా నియంత్రణ వ్యవస్థ నెలకొల్పుతామని తెలంగాణ ఎక్సైజ్ శాఖ చెబుతోంది. మాదక మహమ్మారి అణచివేతను లక్షించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఎక్సైజ్ అధికారులతో కూడిన కార్యదళం (టాస్క్‌ఫోర్స్) అవతరింప జేస్తామని ఆంధ్రప్రదేశ్ సర్కారు అంటోంది. వ్యవస్థాగతమైన కంతల్ని పూడ్చి, చౌక ప్రత్యామ్నాయాల లభ్యతనూ కట్టడి చేసే విస్తృత వ్యూహం జాతీయస్థాయిలో పదును తేలితేనేగాని- జాతి మూలగను జుర్రేస్తున్న మత్తు విపత్తుకు విరగడ ప్రక్రియ వేగం పుంజుకోదు. ఏమంటారు?
- బాలు

No comments:
Post a Comment