Friday, 14 July 2017

బెంగాల్ టైగర్ స్పెషల్ రిపోర్ట్



ఆమె దేశంలో ఇప్పుడో ధిక్కారస్వరం... ఆమె ఇప్పుడో సంచలనం. తూర్పుతీరంలో కేంద్ర ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారుతోందీ స్వరం... ఐదడుగుల బుల్లెట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్రమోదీ సర్కారుపై ఎక్కుపెట్టిన అస్త్రం ఆమె. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకిస్తారు... తాను వ్యతిరేకించడమే కాదు... నలుగురు తన దారిలో నడవాలంటారు... అందుకు లాజిక్కులు సైతం విడమర్చి చెబుతారు బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ. 2019 ఎన్నికల్లో మోదీ సర్కారును అరేబియా సముద్రంలో కలిపేస్తానంటూ ప్రతినబూనారు. మొన్న ఎర్రబుగ్గలపై ధిక్కార స్వరం విన్పించిన మమత... నిన్న పశువథపైనా...  నేడు దేశ వ్యాప్తంగా ఒకటే పన్ను జీఎస్టీని అడ్డుకోవడంలోనూ ముందు వరసులో నిలుస్తున్నారు. మోదీ సర్కారుతో అమీతుమీకి సిద్ధమంటోంది మమత. దేశవ్యాప్తంగా బీజేపీని ఓ పట్టుపడతానంటోంది. అయితే అందుకు తగిన సందర్భం ఇప్పుడు ఉందా... కేంద్రంలో మోదీ సర్కారును ఢీకొట్టే సత్తా దీదీలో ఉందా? మోదీతో పోరులో మమతకు లభిస్తున్న మద్దతెంత? మమత కోపం మోదీపైనా... కేంద్రం జులుంపైనా? లెట్స్ వాచ్     ద స్పెషల్ రిపోర్ట్...
మమత బెనర్జీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఓ విప్లవం. కమ్యూనిస్టుల కంచుకోటల్ని బద్ధలు కొట్టి బెంగాల్ లో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది. పేద ప్రజల అవసరాలే ప్రభుత్వ ఎజెండాగా ముందుకు సాగుతోంది. నాడు బీజేపీకి మిత్రపక్షం... నేడు మోదీకి శత్రుపక్షం. దేశ రాజకీయాల్లో ఆమెదో విలక్షణ శైలి... కేంద్రంపై తిరుగుబావుటా ఎగురేసిన మమత బెనర్జీ అసలు ఉద్దేశమేంటి?
మమత బెనర్జీ.. అతిపెద్ద రాష్ట్రానికి సూపర్ డూపర్ సీఎంగా రెండోసారి తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు. మోదీ మేనియా దేశమంతటా ఉన్నా... బెంగాల్ ఎన్నికల్లో మమత మంత్రం అఖండ విజయాన్ని సొంత చేసుకున్నారు. అటు అసెంబ్లీ స్థానాల్లోనూ, ఇటు పార్లమెంట్ స్థానాల్లోనూ బీజేపీని క్లీన్ బౌల్డ్ చేశారు. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లోనూ విజయదుంధుబి మోగిస్తున్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు బెంగాల్ నేలపై ఇక చెల్లవంటూ దీదీగిరి మొదలుపెట్టిన మమత పాతికేళ్ల కామ్రేడ్ పాలనను అంతమొందించారు...  బెంగాల్ లో తిరిగులేని నాయకురాలిగా నిలిచారు. అదే సమయంలో అంతకు ముందున్న యూపీఏ సర్కారులో భాగస్వామ్యపక్షంగా వ్యవహరించిన మమత...   బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకు వైరి పక్షంగా వ్యవహరిస్తున్నారు.
నాటి ప్రధాన మంత్రి అటల్ బీహార్ వాజ్ పేయి, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీతో అన్యోన్యంగా సాగిన తృణముల్ బంధం మోదీ అధికారంలోకి వచ్చాక విచ్చిన్నమైంది. ఆది నుంచి మోదీని వ్యతిరేకిస్తున్న దీదీ... కేంద్రంలో మోదీ లాంటి నాయకుడు రాష్ట్రాలకు గ్రహణమంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.  తనపై బీజేపీ ఎంతలా దాడి పెంచినా తిప్పుకొడతానని... బెంగాల్ లో ఎవరేంటో తేల్చుకుంటానంటూ అనేక పరీక్షల్లో బీజేపీపై పైచేయి సాధిస్తోంది. 2014 లోక్ సభ ఎన్నికల తర్వాత మమత ప్రభంజనానికి శారదా చిట్ ఫండ్ స్కామ్ తో బ్రేకులేద్దామని భావించినా... జనంలో మాత్రం దీదీకి ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. పైపెచ్చు గత ఎన్నికల్లోకంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధించి బెంగాల్ పై మరింత పట్టు సాధించింది. లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీపై పైచేయి సాధించిన దీదీ...  తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విపక్షాలకు చిత్తు చేశారు. రాష్ట్రాలను గౌరవించండి... ఎవరి పరిధిలో వాళ్లే ఉండాలంటూ కేంద్రానికి గొప్ప సందేశాన్ని దీదీ పంపించారు. తమ జోలికొస్తే మాత్రం కేంద్రాన్ని వదిలేది లేదంటూ డైరెక్ట్ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయంలోని నెగిటివ్ షేడ్స్ తో మోదీ సర్కారుపై యుద్ధం ప్రకటిస్తున్నారు.

మమత బెనర్జీ కేంద్రంపై యుద్ధం ప్రకటించడానికి కారణాలేంటి? కేంద్ర-రాష్ట్రాల మధ్య అసలు సంక్షోభానికి కారణమైన పరిస్థితులేంటి? మమత కేంద్రంపై ఎందుకలా గర్జిస్తున్నారు...  రెండు పక్షాలకు చెడిందెక్కడ? ఎవరెటువైపు ఉన్నా... నేను మాత్రం అపోజిషనే... ఇష్టానుసార నిర్ణయాలను ఒప్పుకునేది లేదంటూ కేంద్రానికి బెంగాల్ బాస్ మమత తేల్చిచెప్పారు. మోదీ తర్వాత ప్రధాన మంత్రి రేసులో ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ తనెటువైపో తేల్చకుండా అటూ... ఇటూ వ్యవహరిస్తుండటంతో మమత నెంబర్ వన్ అపోజిషన్ గా మారిపోతున్నారు.
దేశంలో ఇప్పుడు మోదీని వ్యతిరేకించే నాయకుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోంది. గతంలో మోదీకి వ్యతిరేకంగా పెద్ద బ్యాండే ఉంటే ఇప్పుడు పలువురు నేతలు మాకెందుకులే అంటూ మోదీ దారి నుంచి తప్పుకుంటున్నారు. టోటల్ గా చెప్పాలంటే కేంద్రానికి ప్రతిపక్ష స్వరం అనేది దాదాపు మాయమైందనే చెప్పాలి. అయితే మమత బెనర్జీ మాత్రం అందుకు మినహాయింపు.  మోదీ సర్కారును వీలు చిక్కినప్పుడల్లా ఆమె ఊతికారేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పశువధ నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మమత నిప్పులు చెరిగారు. కేంద్రం నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఆమె స్పష్టం చేశారు. నిషేధం రాజ్యాంగ విరుద్ధమని... న్యాయపరంగా పోరాటం సాగిస్తామని ఆమె తేల్చిచెప్పారు. నిషేధం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను కబళించడమేనని ఆమె ఆరోపించారు. పశువధ ఉమ్మడి జాబితాలో ఉన్న అంశమని... రాష్ట్రాలను బుల్డోజ్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోరాదని ఆమె అన్నారు. కేంద్రం రాష్ట్రాలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోడవం మోదీ అహంకారం వల్లే జరుగుతుందని... మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను గౌరవించడం నేర్చుకోవాలని... లేకుంటే తిరుగుబాటు తప్పదని దీదీ గర్జిస్తున్నారు. కేంద్రం ఇష్టానుసారంగా రాష్ట్రాలపై నిర్ణయాలు రుద్దే పద్ధతికి స్వస్తి పలకాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

బెంగాల్ లో మమతను ఢీకొట్టాలనుకుంటున్న బీజేపీకి అతి అంత తేలికకాదన్న విషయం కూడా అర్థమవుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో దూసుకుపోతున్న బీజేపీ... బెంగాల్ లో దీదీని దెబ్బతీస్తే... మొత్తం ఈశాన్యమంతా తమ అదుపు ఆజ్ఞల్లోకి వచ్చేస్తోందన్న  నమ్మకం సడలుతోందా? ఈశాన్య రాష్ట్రాలను గెలుచుకున్నంత వీజీగా బెంగాల్ గెలవలేమని కమలదళానికి అర్థమైపోయిందా?
బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ లో పెట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ... ఆచరణలో మాత్రం షా ఆలోచనలు వర్కౌట్ కావడం లేదు. ఇటీవల బెంగాల్ లో జరిగిన ఏడు మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల్లోనూ నాలుగింటిని గెలుచుకొంది. గుర్ఖా ముక్తి మోర్చా బలంగా ఉన్న మిరిక్ లాంటి ప్రాంతాల్లోనూ దీదీకి జనం గులాం చేశారు. స్థానిక ఎన్నికల్లో టీఎంసీని మట్టికరిపించాలని కలలుగన్న బీజేపీ ఎన్నికల్లో చేతులెత్తేసింది.  జేపీకి బెంగాల్ లో మమత కొరకరానికి కొయ్యాలా మారుతున్నారు.
దేశ వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసే ఉద్దేశంతో రాష్ట్రాలను చుట్టివస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు బెంగాల్ పర్యటన తర్వాత జరిగిన ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం మమతకు ఎంతో ఆనందానిచ్చాయని చెప్పవచ్చు. బెంగాల్ లోని నక్సల్బరిలో మోదీతో కలిసి భోజనం చేసిన ఆదివాసీలు...  బెంగాల్ మంత్రి ఆధ్వర్యంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా సంచలనమైంది.  బీజేపీ నేతలు కేవలం మాటలు మాత్రమే చెబుతారని...  అయితే తృణముల్ కాంగ్రెస్ మాత్రం సమస్యలు పరిష్కరిస్తుందని ఆమె బెంగాలీలకు భరోసా ఇస్తారు.
దేశ వ్యాప్తంగా మోదీని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్న  దీదీ అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలుకోవడం లేదు. రాష్ట్రపతి అభ్యర్థిగా మరోసారి ప్రణబ్ ముఖర్జీకి అవకాశమివ్వాలన్న ప్రతిపాదనను ఆమె చేశారు. అదే సమయంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే... అందుకు తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానంటూ కమళదళానికి సవాల్ విసిరారు. వెరసి బీజేపీలో ఒక వర్గం తనకు సానుకూలంగా ఉండేలా పావులు కదపుతున్నారు. పార్టీలో మోదీని వ్యతిరేకించేవారి మద్దతు తనకు ఉందన్న దీమా కూడా దీదీలో ఉంది.
ఆ తర్వాత బెంగాల్ మాజీ గవర్నర్, గాంధీ కుటుంబ వారసుడు గోపాలకృష్ణ గాంధీ పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదన కూడా తెచ్చింది దీదీ.  బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేయడం ఎలాగో తెలిసిన మమత... అన్ని విషయాల్లోనూ కౌంటర్ ఎటాక్ మొదలుపెడుతూ ముందుకు సాగుతోంది.  రాష్ట్రపతి అభ్యర్థిని ఎలా నియమించాలన్న అంశానికి సంబంధించి యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ సందర్భంగా కూడా ఉమ్మడి అభ్యర్థిని పరిశీలించాలని... ఏకపక్షంగా వ్యవహరిస్తే పోటీ తప్పదన్న సంకేతాలను పంపించారు మమత బెనర్జీ.
దేశాన్ని కుదిపిన మూడు ఘటనల్లోనూ కేంద్రానికి ప్రతిపక్షంగా వ్యవహరించారు మమత బెనర్జీ. అది నోట్ల రద్దు కానీవ్వండి... జీఎస్టీ బిల్లు కానివ్వండి... ఎర్రబుగ్గల వ్యవహారం కానివ్వండి... ఎందులోనైనా మోదీ గొప్పేంటంటూ నిలదీస్తోంది బెనర్జీ. ప్రధాని నరేంద్ర మోదీ సంస్కరణల సేనానిగా... దేశ రక్షుకుడిగా మాంచిగా పేరు తెచ్చుకోవచ్చు గాక... మమత మాత్రం మోదీని అభివృద్ధి నిరోధకుడిగా ముద్ర వేసేశారు. మోదీ నిర్ణయాలన్నీ దేశాన్ని అస్థిరతవైపుకు దారితీస్తాయని... పేద ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తాయని ఆమె ఖరాకండీగా చెప్పేస్తారు.
దేశవ్యాప్తంగా ఏక పన్నుల విధానంపైనా మమత బెనర్జీ కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహిరస్తున్నారు. జులై నుంచి జీఎస్టీను అమలును తిరస్కరించాలని రాష్ట్రాలను దీదీ కోరారు. శనివారం జరగనున్న జీఎస్టీ సమావేశంలో రాష్ట్రాలన్నీ  కూడా వ్యతిరేకించాలని మమత రాష్ట్రాలను విజ్ఞప్తి చేశారు.  దేశంలో ఏ రాష్ట్రం కూడా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమలకు ఏ మాత్రం సిద్ధం లేదన్న అభిప్రాయాన్ని కేంద్రానికి తేల్చి చెప్పాలని బెంగాల్ సర్కారు భావిస్తోంది. కేంద్రం నిర్ణయాన్ని మార్చుకోకపోతే రాష్ట్రాలన్నీ కూడా జీఎస్టీని వీటో చేయాలని... ప్రతిపాదిస్తోంది దీదీ.
ఇక దేశవ్యాప్తంగా సంచలనం  సృష్టించిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో అందరకంటే గట్టిగా వ్యతిరేకించారు మమత బెనర్జీ... ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా నోట్ల రద్దంటే ప్రజలను వంచించడమేనని... బ్లాక్ మనీని అరికట్టేందుకు ఉన్న మార్గాలను వదిలేసి... పేదలను ఇబ్బందిపాల్జేస్తున్నారని ఆమె విమర్శించారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీలో పర్యటించడమే కాకుండా... ప్రభుత్వ వ్యతిరేక వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. పేద ప్రజల్ని బాధించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని... ఢిల్లీ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు తర్వాత ప్రాణాలు కోల్పోయినవారి చావులకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆమె అన్నారు. ఇక ప్రజాప్రతినిధులు కూడా సామాన్యులేనంటూ మోదీ తీసుకొచ్చిన ఎర్రబుగ్గ నిషేధాన్ని మమత విభేదించారు. ప్రధానితో సహా కేంద్ర మంత్రులందరూ ఎర్రబుగ్గలను నిషేధించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోవాల్సిన పనిలేదని... మమత బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఎర్రబుగ్గలు తీసేయడం ద్వారా వీఐపీ కల్చర్ అంతం కాదని.... నాయకులు మనస్సుల్లోంచి వీఐపీలమన్న భావనను తొలగించాలని ఆమె వ్యాఖ్యానించారు. బెంగాల్ లో పలువురు నేతలు ఎర్రబుగ్గలను గతంలో మాదిరిగానే వినియోగించడం విశేషం.
మోదీపై మమతకు ఎందుకంత కసి... మోదీ విధానాలను దీదీ ఎందుకు తీర్పారబడుతున్నారు...  మోదీని తుగ్లక్ తో పోల్చేలా రెండు పార్టీల మధ్య పరిస్థితులు ఎందుకు దారితీశాయ్. గతంలోని ప్రభుత్వాలకు... మోదీ ప్రభుత్వానికి మధ్య తేడాపై దీదీ ఏమంటున్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే... అవినీతి బాంబులేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలను చూశానని... ఎందరితో కలిసి పనిచేశానని తృణముల్ అధినేత్రి మమత బెనర్జీ అన్నారు. అయితే మోదీ సర్కారు లాంటి తుగ్లక్ సర్కారును ఇంతవరకు చూడలేని ఆమె అన్నారు. మోదీ తీసుకునే నిర్ణయాలు... 14వ శతాబ్దంలో ఢిల్లిని పాలించిన సుల్తాన్ మహ్మద్ బిన్ తుగ్లక్ ను మించి ఉన్నాయని ఆమె దుయ్యబట్టారు.  అనేక ప్రజాసంబంధమైన విషయాల్లో తుగ్లక్ తరహాలో మోదీ పాలిస్తు్న్నారని ఆమె దయ్యబడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను తుగ్లక్ పాలనతో కకావికలం చేస్తున్నారని... ప్లాస్టిక్ కరెన్సీకి సేల్స్ మ్యాన్ లో మోదీ వ్యవహరిస్తున్నారని కటువుగా మాట్లాడారు. ప్రజల దగ్గర కావాల్సినంత నగదు లేదని... ప్రజల వద్ద ఉన్న నగదు నల్లధనమైతే... బీజేపీ దగ్గర ఉన్న నగదు తెల్లధనమా అంటూ ఆమె తీవ్రంగా ప్రశ్నించారు.
మోదీని విమర్శించడానికి అవినీతినే అస్త్రంగా మమత ఉపయోగిస్తున్నారు. తమ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, ఎంపీలపై కేంద్రం అవినీతి పేరుతో దాడి చేస్తోందని... అన్నీ తెలిసి కూడా తృణముల్ పార్టీని ఇబ్బందులపాల్జేసేందుకే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తే అవినీతిపరులని... కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సోదాలు నిర్వహిస్తారని ఆమె మండపడ్డారు. ఇలాంటి ఎత్తుగడలకు భయపడేది లేదని కూడా మమత స్పష్టం చేశారు. సీబీఐని కన్సిపరసీ బ్యూరో ఆఫ్ ఇండియాగా ఆమె అభివర్ణించారు. దేశ వ్యాప్తంగా ఘర్షణపడే లెఫ్ట్-బీజేపీ పార్టీలు బెంగాల్ లో జట్టుకట్టాయని... అయినప్పటికీ ఇద్దరినీ కలిపి ఓడిస్తామని ఆమె చెప్పారు. అవినీతిపేరుతో కేంద్రం ధిక్కార స్వరాలపై ఉక్కుపాదం మోపుతోందని... తాము ప్రజల పక్షానే నిలుస్తామని... కావాలంటే నన్ను అరెస్టు చేసుకోవాలంటూ మమత చేసిన కామెంట్స్... కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరికొత్త యుద్దానికి తెరదీస్తున్నాయ్. బీజేపీ ఎంపీ సుదిప్ బందోపాధ్యాయ అరెస్టు తర్వాత కేంద్రంపై మమత తీవ్రంగా స్పందించారు. వచ్చే రోజుల్లో  బీజేపీ నేతల పిచ్చి పరాకాష్టకు చేరి మరింత మంది నేతలను అరెస్టు చేసే అవకాశముందని కూడా ఆమె వెల్లడించారు. సుదీప్ బందోపాధ్యయను రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కామ్ లో సీబీఐ అరెస్టు చేసింది. మీ చేతిలో అధికారముందని మావాళ్లను అరెస్టు చేస్తున్నారు... మీరు చేస్తున్న అల్లర్లకు మీ పార్టీ నేతలను అరెస్టు చేసే అరెస్టు చేయోచ్చని... అయితే తాను అలాంటి పనిచేయడం లేదని మమత చెప్పారు.
బీజేపీ, టీఎంసీ సంబంధాల్లో మరింత దారుణమైన విషయమేమంటే...  ముఖ్యమంత్రి మమతబెనర్జీ ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ కు ఎయిర్ కంట్రోల్ రూమ్ అనుమతివ్వకపోవడమన్నది బెంగాల్ పార్టీ అభియోగం. విమానంలో ఫ్యూయల్ అయిపోతున్నప్పటికీ... మమతను హతమార్చే కుట్రంటూ  ఆ పార్టీ పార్లమెంట్లోనూ ఆందోళనకు దిగింది. అయితే అది పైలెట్ల బాధ్యతారాహిత్యమని విమానయానశాఖ తేల్చిచెప్పింది. మోదీ సర్కారు వన్ నేషన్ వన్ ఎలక్షన్లంటూ దేశంలోని ఇతర రాజకీయ పార్టీలని మింగాలని చూస్తోందని... కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా...  అందుకు తగిన విధంగా ఉంటామని  పార్టీ ప్రకటించింది. బెంగాల్ దరిదాపుల్లోకి బీజేపీ రానివ్వబోమని... ప్రజలు ఆ పార్టీని నమ్మబోరని ఆమె అంటారు.
అంతా బాగానే ఉన్నా బెంగాల్ లో జరుగుతున్న వరుస చిట్ ఫండ్ స్కామ్ లు ఆ పార్టీని కార్నర్ చేస్తున్నాయ్. మొన్న శరదా నిన్న నర్మదా... నేడు రోజ్ వాలీ చిట్ ఫండ్ స్కామ్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి బెంగాల్ సర్కారుకు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయ్. బెంగాల్ లో శారదా చిట్ ఫండ్ స్కాము దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రూ. 2500 కోట్ల స్కామ్ లో ఆ పార్టీ నేతలు పోషించిన పాత్రపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. పదిహేడు లక్షల మంది ఖాతాదారులతో ఓ వెలుగు వెలిగిన శరదా చిట్ ఫండ్ స్కామ్ లో దోషులంతా కూడా తృణముల్ పార్టీ బినామీలేనన్న  నిజం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిట్ ఫండ్ స్కామ్ సొమ్ములన్నీ ప్రజలకు ఇస్తామంటూ మమత కవరింగ్ ఇవ్వడం... ప్రజల్నుంచి  వ్యతిరేకత పెద్దగా రాకపోయినా... కేసుల బెడద మాత్రం అదే విధంగా సాగుతోంది.
టీఎంసీ పార్లమెంట్ సభ్యులు కునాల్ ఘోష్, శృంజయ్ బోస్, బెంగాల్ మంత్రి మదన్ మిత్రా, మాజీ డీజీపీ రాజత్ మజుందార్ తో సహా పలువురు నేతలు అరెస్టు కావడం ప్రకంపనలు సృష్టించింది. 2008 నుంచి సామాన్యుల వద్ద చిట్ ఫండ్ సంస్థను ప్రారంభించిన శరదా గ్రూప్ 2013 నాటికి పెద్ద ఎత్తున నిధులను వసూలు చేసింది. శారద కుంభకోణంలో మంత్రులు, పార్టీ నాయకులు, ఉన్నతాధికారులు ఎలా కుమ్మ్కయ్యి ప్రజాధనాన్ని కొల్లగొట్టిందీ దర్యాప్తులో ఆధారాలతో సహా బయటపడ్డాయ్. ఇక శారదా చిట్ ఫండ్ స్కామ్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా ఆ పార్టీ తాజాగా మరో స్కామ్ తో చిక్కుల్లో పడింది.  రోజ్ వాలీ చిట్ ఫండ్ స్కామ్  విషయంలో ఆ పార్టీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ ని సీబీఐ అరెస్ట్ చేసింది. లోక్ సభలో తృణముల్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆ పార్టీ నేతను అరెస్టు చేయడం ద్వారా బీజేపీ తమ పార్టీని దెబ్బతీయాలని చూస్తోందని మమత వాపోయారు. ఇప్పటికే ఈ స్కామ్ లో టీఎంసీకి చెందిన ఎంపీ తపస్ పాల్ ను అరెస్ట్ చేశారు. ఆయన రోజ్ వ్యాలీ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు. వేల కోట్ల రూపాయలతో లక్షలాది మంది పేద ప్రజలను మోసం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. మరోవైపు చిట్ ఫండ్ స్కాములతో ఉక్కిరిబిక్కిరవుతున్న తృణముల్ కాంగ్రెస్ పార్టీకి నారద న్యూస్ టేపుల వ్యవహారం మరింత మసకబార్చింది. న్యూస్‌ పోర్టల్‌ స్టింగ్‌ వీడియోల్లో పట్టుబడినవారిలో మమత కొలువులో మంత్రులుగా ఉండటంపైనా దుమారం రేగింది. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శారద కుంభకోణంలో జైలు పాలైన మాజీ మంత్రి వర్యులతో సహా ఓ 13 మంది నేతలు నోట్లకట్టలు తీసుకుంటూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడం పెను సంచలనమైంది. సీబీఐ విచారణ వద్దంటూ మమత బెనర్జీ సర్కారు కోరడాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. తద్వారా దేశ వ్యాప్తంగా తృణముల్ పార్టీపై విమర్శలు రేగాయ్. బెంగాల్ లో జరుగుతున్న చిట్ ఫండ్ స్కాములన్నీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీకి తెలియకుండా ఏమీ జరగడం లేదని... ప్రతీ స్కామ్ లో ఆ పార్టీ నేతల ప్రమేయం బయటపడుతోందని... బీజేపీ దుయ్యబట్టింది. మమతను క్వీన్ ఆఫ్ శరదాగా ఆ పార్టీ అభివర్ణించింది. అయితే మమత మాత్రం బెదరడం లేదు.
ఓవైపు మోదీపై నిప్పులు చెరుగుతున్న మోదీ స్వరాష్ట్రంలో సామాన్యుడి నాటి పట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ సామాన్యులకు దీదీ అయిపోతున్నారు. సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే ముందుగా నిలుస్తామని చెబుతున్నారు. తాజాగా స్కూలు ఫీజులు పెంపుపైనా యాజమాన్యాలకు దీదీ ఝలక్ ఇచ్చారు.
మమత బెంగాల్ లో దీదీగిరి చేస్తున్నారు. సామాన్యుడి ప్రయోజనాలే ముఖ్యమంటూ... వారి కోసమే పనిచేస్తానంటున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలతో సామాన్యులకు బాసటగా నిలుస్తున్న మమత... రాష్ట్రంలో సంక్షోభాల నివారణకు పెద్దపీట వేస్తున్నారు. ఇటీవల ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో భేటీ అయిన మమత స్కూళ్ల ఫీజులపై ప్రైవేటు స్కూళ్లకు క్లాసు పీకారు. ఎవరిష్టం వచ్చినట్టుగా వారు స్కూలు ఫీజులు వసూలు చేస్తే చూస్తూ ఊర్కోనంటూ కుండబద్ధలు కొట్టారు. కోల్ కతా స్కూళ్లలో మోత మోగిస్తున్న యాజమాన్యాలకు సీఎం మమతబెనర్జీ షాకిచ్చారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, స్కూలు యాజమాన్యాలతో భేటీ సందర్భంగా స్కూలు ఫీజులు ఎవరిష్టం వచ్చినట్టుగా వారు వసూలు చేయడానికి లేదని తేల్చిచెప్పారు.నగరంలోని  లా మార్టినీ, సెయింట్ ఎక్సేవియర్, సెయింట్ జేమ్స్ తదితర స్కూలు యాజమాన్యాలతో మమత కోల్ కతాలో భేటీ అయ్యారు. స్కూళ్లు ఫలానా మొత్తంలో డొనేషన్లను వసూలు చేయోద్దంటూ మమత కుండబద్ధలు కొట్టారు. నగరంలోని స్కూళ్లన్నింటిపైనా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు దీదీ తెలిపారు. నగరంలోని 50 స్కూళ్లు డొనేషన్లు రూ. 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారన్న సమాచారాన్ని భేటీలో సీఎం దృష్టికి వచ్చింది.  ఇప్పటికే రాష్ట్రంలోని స్కూళ్ల ఫీజులు నియంత్రణ మండలిని ఏర్పాటు చేసిన మమత... స్కూళ్ల ఫీజులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు.
మోదీ వ్యతిరేకులకో దీదీ ఓ బ్రాండ్ అంబాసిడర్... ప్రధాని మోదీ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆమె దూసుకుపోతున్నారు. స్వరాష్ట్రంలో పాలనపై పట్టు సాధిస్తూనే... విమర్శకుల నోళ్లు మూయిస్తున్నారు మమత. దశాబ్దాల కమ్యూనిస్టు ఏలుబడిలో ఉన్న బెంగాల్ కు కొత్త చిత్రాన్ని చూపించారు. బెంగాల్ మరో పదేళ్లు తన ఏలుబడిలోనే ఉంటుందంటూ తన పట్టును చూపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఢీకొడతానంటున్నారు. ప్రజలను క్షోభపెట్టడమే లక్ష్యంగా  మోదీ సర్కారు పాలన సాగుతోందని... త్వరలోనే ప్రజా తిరుగుబాటు వస్తోందంటూ జోస్యం చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా కేంద్రంపై  పోరుబాటలో నడుస్తున్నారు. కొరకరాని కొయ్యలా ఉన్న దీదీపై బీజేపీ చిట్ ఫండ్ స్కామ్ అస్త్రాలను వదులూతూనే ఉంది. అయితే తాను దేనికి బెదిరిపోనని... మోదీని సాగనంపేవరకు పోరాటం సాగిస్తానంటోంది బెంగాల్ టైగర్. 

No comments:

Post a Comment