Friday, 14 July 2017

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీకే ఫీవర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయ్. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతిపక్ష వైసీపీ ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తన అమ్ములపొది నుంచి జగన్ బయటకు తీస్తే... అధికార టీడీపీ ప్రతివ్యూహాల్లో బిజీ అయిపోయింది. పీకే ప్రణాళికతో టీడీపీ వర్గాలు అప్రమత్తమయ్యాయ్.  25 ఎమ్మెల్యేలలకు వచ్చే ఎన్నికల్లో సీట్లివ్వొద్దంటూ జగన్ కు పీకే చెప్పినట్టుగా వార్తలు గుసగుసలాడుతున్నాయ్. ఏపీలో ఇప్పుడు పీకే ఫీవర్ హల్ చల్ చేస్తోంది.
ఏపీలో ఇప్పుడు రాజకీయాలన్నీ ప్రశాంత్ కిషోర్ చుట్టూ తిరుగుతున్నాయ్. దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ కిషోర్ దృష్టి వైసీపీపై మళ్లింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఢీకొట్టాలంటే అందుకు పీకే పవర్ కావాలని భావించిన వైసీపీ అధినేత జగన్ అందుకు రంగంలోకి దింపేశారు. చంద్రబాబును దెబ్బకొట్టాలంటే... చాలా కష్టమన్న విషయం జగన్ కు బాగా తెలుసు. 2014 ఎన్నికల్లో జగన్ చేసిన తప్పులన్నింటినీ ఒడిసిపట్టుకున్న బాబు అండ్ కో ఎన్నికల్లో విజయం సాధించింది. అందుకే ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఎన్నికల మాంత్రికుడు పీకే ద్వారా వ్యూహాలను ఆ పార్టీ రచిస్తోంది.  విజయసాయిరెడ్డి, జగన్, పీకే ఇప్పుడు చంద్రబాబు టీం ఆలోచనలను ఎలా చిత్తు చేయాలన్న స్క్రీన్ ప్లేను రాసుకోవడంలో బిజీబిజీగా ఉన్నారు.
ఎన్నికల్లో విజయం సాధించడం ఎంత తేలికో నాడు ఉప ఎన్నికల ఫలితాల ద్వారా జగన్ తెలుసుకున్నాడు. అదే సమయంలో ఎన్నికల్లో గెలుపు ఎంత కష్టమో... ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు...  జగన్ కు తెలిసొచ్చేలా చేశాయ్. అందుకే ఇప్పుడు జగన్ ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ఎన్నికల వ్యూహరచనలో నిమగ్నమైపోయాడు.  అందుకు ఎన్నికల విశ్లేషణల్లో అనుభవజ్ఞుడైన ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించాడు. పీకే హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రమంతా తిరిగొచ్చిన పీకే ఇప్పటికే ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించినట్టుగా చెబుతున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో... ప్రభుత్వం పట్ల ఎలాంటి వైఖరి ఉందన్న విషయాన్ని పీకే అండ్ కో నిశితంగా గమనించారు. రాష్ట్రంలో కీలక అంశాలుగా ఉన్న టాప్ 10 తీసుకొని చంద్రబాబుకు మార్కులు కూడా ఇవ్వాలంటూ ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ సైతం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఫలితాల ఆధారంగా జగన్ కు భవిష్యత్  ప్రణాళికను పీకే సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ బలం ఎలా ఉందన్న దానిపై ఒక అంచనాకు వచ్చిన పీకే... వ్యూహాలను అమలు చేయడంలో నిమగ్నమైనట్టుగా జగన్ ను వ్యతిరేకించే మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయ్.
పీకే అంచనాలను పరిగణలోకి తీసుకొని ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియాలోనూ, ఒక వర్గం సోషల్ మీడియాలోనూ విస్తృతమైన కథనాలొస్తున్నాయ్. వాటి సారంశమేమంటే... జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీలో ఉన్న 25 మందికి టికెట్లు నిరాకరించారన్నట్టుగా ఓ కథనం ప్రచారంలో ఉంది. వాస్తవానికి వైసీపీకి 2014 ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఆ తర్వాత రోజుల్లో ఒక్కొక్కకరిగా వైసీపీలో చేరగా... ఆ బలం ఇప్పుడు 50 దిగువకు పడిపోయింది. అయితే అందులో 25 మంది ఎమ్మెల్యేలకు జగన్ టికెట్లు ఇవ్వరంటూ ఒక ప్రచారం జరుగుతోంది. తద్వారా జగన్ పార్టీలో అలజడి సృష్టించాలన్న ఆలోచన కూడా ఒక వర్గంలో ఉంది. పార్టీ నేతల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే వారంతా జగన్ కు దూరమవుతారన్న స్కెచ్ కూడా ఉన్నట్టుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడున్న జగన్ ఎమ్మెల్యేలంతా... పార్టీకి గడ్డుకాలంలో బాసటగా నిలుస్తున్నవారే. ఎమ్మెల్యేలపై పీకే ఫీడ్ బ్యాక్ కు సంబంధించి మరో విశ్లేషణ కూడా ఆ పార్టీ వర్గాల్లో ఉంది. వైసీపీ నుంచి వెళ్లిపోయిన 20 మందికి జగన్ టికెట్ ఇవ్వరన్న అభిప్రాయం  కూడా మరోవైపు ప్రచారంలో ఉంది. ఒకవేళ ఎమ్మెల్యేల పనితీరు బాగోకుంటే...  ఆ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వరనుకుందాం... ఆ  వ్యవహారం గురించి తెలిస్తే జగన్ కు తెలియాలి. లేదంటే పీకే కు తెలియాలి. వారిద్దరూ కూడా ఇలాంటి కీలక విషయాన్ని బయటపెట్టి గందరగోళం చేసుకోరు కదా... ఓవైపు చంద్రబాబునాయుడు సర్కారు నిరంతరం ప్రజల్లో ఉంటున్నట్టుగా చెబుతోంది. ప్రతీ సమస్య పరిష్కారం కోసం నేను సైతమంటూ జగన్ ముందుంటున్నాడు... అయినప్పటికీ... ఓవరాల్ గా ఏపీలో పొలిటికల్ గ్యాప్ స్పష్టంగా కన్పిస్తోంది. ఆ గ్యాప్ ను జగన్ ఫిల్ చేయడం కష్టమన్నది ఒక వర్గం వాదన. అయితే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేస్తాడన్నది మరో వర్గం అభిప్రాయం. ఇద్దరి వాదనలు ఎలా ఉన్నా... ఎన్నో ఎక్సపెక్టేషన్ తో అధికార పగ్గాలు చేపట్టిన సీఎం చంద్రబాబునాయుడు ప్రజల అంచనాలు అందుకోవడంలో పూర్తి స్థాయి నమ్మకంతో లేరన్నట్టుగా తెలుస్తోంది.  ఓవైపు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బాబు ధీమాలో ఉన్నప్పటికీ... రాజధాని విషయంలో ముందడుగు పడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల సంగతటుంచితే ప్రైవేటు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో చెప్పలేని పరిస్థితి. అదే సమయంలో పీకే లాంటి నిష్ణాతుడు జగన్ శిబిరంలో ఉండటాన్ని సహజంగా టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేని పరిస్థితి. పీకేపై ఇప్పటి వరకు ఆచితూచి వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు మొదలుపెట్టాయ్. యూపీలో చతికిలపడిన పీకే... ఏపీలో ఏం  పీకుతాడంటూ ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరగడం కూడా పరిగణలోకి తీసుకోవాలి. తాజాగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సైతం వైసీపీపై విరుచుకుపడ్డారు. పార్టీ పెట్టే ముందు కన్సెల్టెన్సీని పెట్టుకోవాలని కానీ పార్టీ పెట్టిన ఆరేళ్ల తర్వాత ఏం చేస్తుందంటూ విమర్శించాడు. ప్రజల్లో జగన్ విశ్వాసం కోల్పోయాడని ప్రతిపక్ష నేతగా అనర్హుడంటూ విమర్శించారు. బయటకు గంభీరంగా ఉన్న పసుపు పార్టీలో... పీకే టెన్షన్ పీక్ కు చేరిందని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే... కులాల ఈక్వేషన్ల విషయంలో తలపండిన ప్రశాంత్ కిషోర్... జగన్మోహన్ రెడ్డికి... ఇప్పటికే ఉన్న బలానికి అదనపు బలం అవడం ఖాయమన్న విశ్లేషణ రాజకీయ వర్గాల్లో ఉంది. అన్నింటికీ మించి నాడు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన పలువురు నేతలు చంద్రబాబును ఓడించేందుకు జగన్ తో చేయి కలిపేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయ్.
రాష్ట్ర  ప్రభుత్వం ఇప్పుడు సోషల్ మీడియాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది. ఇక ఎన్నికలకు రెండేళ్లే ఉన్న తరుణంలో జగన్ ఎన్నికల కురుక్షేత్రంలో దిగారు. జగన్  పాదయాత్ర అంటూ కూడా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నాడు వైఎస్  ఫార్మూలాను బాబు అమలు చేస్తే... బాబు ఫార్ములాను జగన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా కన్పిస్తోంది. ఏపీలో పాదయాత్ర రాజకీయాలు సూపర్ హిట్టనే చెప్పాలి. పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా ఏడాది పాటు చుట్టి రావాలని జగన్ తలపోస్తున్నారు. దీనికి సంబంధించి పీకే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయ్. అయితే ఎన్నికలు ముందుగా వస్తాయన్న అభిప్రాయం కూడా ఉన్న నేపథ్యంలో పాదయాత్రకు సంబంధించి క్లారిటీ సైతం ప్లీనరీ వేదికగా జగన్ ఇచ్చే అవకాశం ఉంది. పాదయాత్ర రాజకీయాలే విజయానికి సోపానాలన్న భావనలో పార్టీ నేతలు కూడా ఉన్నారు. అయితే దానికైనా పరిస్థితులు కలిసిరావాలి. ఒక్కటి మాత్రం చెప్పొచ్చు... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పీకే ఫోబియా అధికార పక్షాన్ని వెంటాడుతోంది. ఎలా ముందడుగేద్దామా అనుకుంటున్న జగన్ కు పీకే సేవలు చాలానే అవసరమని ఆ పార్టీ భావిస్తుంటే... పీకే ప్రణాళికలు తమకు ముప్పుగా పరిణమిస్తాయోనన్న బెంగ తెలుగుదేశం పార్టీలో ఉంది.  

No comments:

Post a Comment