కశ్మీర్ లో బుర్హాన్ వనీని అంతమొందించి ఏడాది పూర్తయింది. లోయల అలజడి రేపుతూ... భారత్ సైన్యానికి కొరకరాని కొయ్యాల మారిన తీవ్రవాదిని భద్రతా దళాలు తుదముట్టించాయ్. బుర్హానీ స్వతంత్రవీరుడంటూ అక్కడి తీవ్రవాద సంస్థలు మృతి చెంది ఏడాదైన సందర్భంగా నిరసనలకు పిలుపునిచ్చాయ్. అయితే పోలీసులు తీవ్రవాదులకు మద్దతిచ్చే ఎలాంటి చర్యలను ప్రోత్సహించేది లేదంటూ అల్లర్లు జరిగే ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు.
భారతదేశంలో పుట్టి... భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు బుర్హన్ వనీ. తండ్రి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకున్న వనీ... తీవ్రవాదుల చేతిలో పావుగా మారాడు. క్రికెటర్ కావాలనుకున్నాడు. లేని పక్షంలో సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకున్నాడు వనీ... చివరకు పాకిస్తాన్ వేర్పాటువాదులు సృష్టించిన అలజడిలో ఆహుతైపోయాడు. కశ్మీర్ లో అలజడికి కారణమయ్యాడు. పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదుల కుట్రలకు పావుగా మారాడు. గత ఏడాది ఇదే రోజు తీవ్రవాదుల కుట్రల గురించి తెలుసుకున్న పోలీసులు బుర్హన్ వనీని అంతమొందించారు. కశ్మీర్ లో తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న జైష్ ఇ మహ్మద్ సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న బుర్హన్ వనీ... స్థానికులను తీవ్రవాదం దిశగా అడుగులు వేయించాడు. వేర్పాటువాదులతో చేతుల కలిపి భారత భద్రతా సిబ్బందిపై దాడులకు తెగబడ్డాడు. ఎన్‌కౌంటర్‌లో హతమవ్వడానికి ముందు బుర్హాన్ వనీ దేశంలో భారీ కుట్రకు ప్రణాళికను రచించాడు. భద్రతా దళాలపైన జిహాదీ ప్రకటించడానికి లష్కరే తాయిబాను, హిజ్‌బుల్ ముజాహిద్దీన్ సంస్థను కలిపి యునైటైడ్ ఫ్రంట్‌గా నెలకొల్పడానికి కసరత్తు చేశాడు. అదే సమయంలో... ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌తో మంతనాలు జరిపాడు. భారత్ సైన్యం ఓటమి ఖాయం... మనం కలిసి పనిచేయాలంటూ సయీద్ వనీకి నూరిపోశాడు. కలిసి పనిచేద్దాం అని సయీద్‌ను వనీ కోరాడు. సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో ప్రావీణ్యం సంపాదించిన బుర్హాన్ అతికొద్ది కాలంలోనే యువతను ఆకర్షించేవాడు. ఈ లక్షణాలతోనే... చిన్న వయస్సులోనే హిజ్బుల్ ఉగ్రవాద సంస్థకు డిప్యూటీ కమాండర్ స్థాయికి ఎదిగాడు. ఆయుధాలు ధరించి, భద్రతా దళాలను దూషిస్తూ, సోషల్ మీడియాలో కశ్మీర్ యువకులను ఆకర్షించి వారిని ఉగ్రవాదులుగా మార్చడంలో కీలకపాత్ర పోషించాడు. బుర్హన్ వనీ ఆగడాలపై జమ్మూకశ్మీర్ ప్రభుత్వంతోపాటు... సైన్యం దృష్టిసారించి పట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేశాయ్. వనీ ఆచూకీ చెబితే పది లక్షల బహుమతి సైతం ప్రకటించారు. జులై 8, 2016న జమ్మూకశ్మీర్ పోలీసులతోపాటు, 19 రాష్ట్రీయ రైఫిల్స్ బుర్హన్ వనీ మట్టుబెట్టాయ్. ముందురోజే వనీ ఉన్న ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకొని లొంగిపోవాల్సిందిగా కోరినా... వనీతోపాటు మరో ఇద్దరు తీవ్రవాదులు కాల్పులు జరపారు. పోలీసులు ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని వనీ కశ్మీర్ యువతలో ఆకర్షణ పొందగలిగాడు. వనీ ఎన్ కౌంటర్ తో లోయలో అలజడి రాజ్యమేలింది. వేర్పాటువాదుల ప్రేరణతో వనీ అంత్యక్రియలు సందర్భంగానూ లోయలో అల్లర్లు జరిగాయ్. ఆ అల్లర్లలో 90 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 వేల మంది పౌరుల గాయాలపాలవగా... 4 వేల మంది భద్రతా సిబ్బంది అల్లర్లలో గాయపడ్డారు. 2010 తర్వాత కశ్మీర్ లో ఇంతలా అల్లర్లు జరగడం వనీ ఎన్ కౌంటర్ తర్వాత జరిగాయ్. 53 రోజులు పోలీసులు కర్ఫ్యూ విధించారు.
తెలివితేటలు ఉన్న కుర్రాడు సమున్నత లక్ష్యాన్ని వదిలి దారితప్పితే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో.. ఎన్ కౌంటర్ లో హతమైన హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్ వనీ ఉదంతమే నిదర్శనం. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్నది వనీ ఆశయమని అతని తండ్రి ముజఫర్ వనీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే కశ్మీర్ క్రికెటర్ పర్వేజ్ రసూల్ మాదిరి క్రికెటర్ కావాలని, దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుకునేవాడని తెలిపాడు. బుర్హన్ వనీ తండ్రి ముజఫర్ వనీ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్. పిల్లలు బాగా చదువుకుని కశ్మీర్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్, ఐఏఎస్ వంటి ఉన్నతాధికారులు కావాలని ఆయన చెబుతుంటారు. తండ్రి మాటలకు ప్రేరణతో బుర్హన్ కూడా బాగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకున్నాడు. అయితే వక్రదారి పట్టడంతో అతని లక్ష్యం నెరవేరలేదు. ఉగ్రవాద భావజాలంతో అతని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కశ్మీర్ కల్లోలానికి కారణమయ్యాడు.మరోవైపు కశ్మీర్ లోని బుర్హన్ వనీ స్వస్థలమైన దక్షిణ కశ్మీర్ లోని ట్రాల్ వద్ద... ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయ్. బుర్హనికి నివాళులర్పించాల్సిందిగా వేర్పాటువాద నాయకులు సయ్యద్ అలీషా గిలానీ, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్ పిలుపునివ్వడంతో వారి మద్దతుదారులు... పుల్వామా జిల్లా ట్రాల్ కు బయల్దేరారు. అయితే భద్రతాదళాలు వారిని అడ్డుకున్నాయ్. నిరసనకారులు రాళ్లు విసరడంతో పోలీసులు బాష్పవాయవు ప్రయోగించారు.
కశ్మీర్ లోయలో శాంతి, సామరస్యతను పునరుద్ధరించాలని హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ తండ్రి కశ్మీర్ యువతకు శనివారం విజ్ఞప్తి చేశారు. తనకుమారుడి వర్థంతి రోజున ఎలాంటి రక్తపాతం సృష్టించవద్దంటూ ముజఫర్ అహ్మద్ వనీ వేడుకున్నారు. మాకు హత్యాకాండలు వద్దు. కశ్మీర్‌లో శాంతి, సామరస్యాన్ని పెంపొందించండి చాలంటూ వీడియో సందేశం పంపారు. తన ఇంటి చుట్టూ భారీగా భద్రతా దళాలు మోహరించి ఉన్నాయని... బుర్హన్ తండ్రి ముజఫర్ వాని చెప్పారు. ఇంట్లోంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని... ఇవాళ తన కుమారుడికి నివాళి అర్పించడం సాధ్యమయ్యేలా కన్పించడం లేదని ఆయన చెప్పాడు.
కశ్మీర్ ప్రజలను ఇబ్బందులకు గురిచేసి... ప్రజల మధ్య చిచ్చుపెట్టిన ఉగ్రవాదిని అంతమొందిస్తే... అందుకు మద్దతిస్తున్న వేర్పాటువాదుల నిరసనలకు పిలుపివ్వడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. వేర్పాటు శక్తుల ఆగడాలను సహించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనల మూలంగా లోయలో అల్లర్లు మరింత ఉధృతమయ్యే ప్రమాదముందన్న అభిప్రాయం పోలీసుల్లో ఉంది. ఎలాంటి అలజడులు జరక్కుండా ఉండాలని... లోయలోని కీలక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్టుగా పోలీసులు తెలిపారు. శ్రీనగర్ లో దుకాణాలన్నీ మూసివేశారు. 8వ తారీఖున జరిగే అన్ని పరీక్షలను యూనివర్శిటీలు వాయిదా వేశాయ్. హిజ్బుల్ నేత బుర్హాన్ వనీ ప్రథమ వర్థంతి సందర్భంగా జాతి వ్యతిరేక శక్తులు ఇంటర్నెట్‌ను వేదికగా చేసుకునే విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, అందుకే సేవలను నిలిపివేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్మూలోని భగవతి నగర్ నుంచి అమర్ నాథ్ యాత్రకు వెళ్లడాన్ని కూడా పోలీసులు నిలిపివేశారు. అదే సమయంలో పహల్గామ్, బల్తాల్ బేసు క్యాంపుల నుంచి మాత్రం యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. అదే సమయంలో జమ్ముకశ్మీర్‌లో బందిపోరాలోని హాజిన్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృత్యువాత పడ్డారు.పాకిస్తాన్ ప్రోత్సహంతో లోయలో జరుగుతున్న ఆగడాలకు వేర్పాటువాద శక్తుల తోడైతే బుర్హన్ వనీలు పుడుతూనే ఉంటారు. ఇలాంటి ఉగ్రవాదులను అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. నిరనసలను అడ్డుకోవడం ద్వారా... లోయలో ఇష్టానుసారం వ్యవహరించాలనుకుంటున్న వేర్పాటువాద శక్తులను తుదముట్టించినప్పుడు కశ్మీర్ కార్చిచ్చు ఆగేది.
No comments:
Post a Comment