Friday, 14 July 2017

గోరక్షకులపై దాడులు... మోదీ హెచ్చరికలు


గోరక్షలు దేశ పరువు తీస్తున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలుపుతున్నారు. జాతిని జాగృతం చేయాల్సిన గోరక్షలు భక్షకులుగా మారిపోయారు. భారతదేశ్ సంస్కృతిని చిన్నాభిన్నం చేస్తున్నారు. గోవులను రక్షిస్తున్నామంటూ అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. గోవధ పేరుతో దేశాన్ని ముక్కలు చేస్తున్నారు. మత ప్రాతిపదికను దేశాన్ని విభజిస్తున్నారు. మూడేళ్లుగా సాగుతున్న విద్వేషాల పరంపరపై ప్రధాని మోదీ గట్టి హెచ్చరికలు పంపించారు. గోరక్షణ పేరుతో హత్యలేంటంటూ నినదించారు. చట్టాన్ని ఎవరూ చేతులోకి తీసుకోరాదంటూ గర్జించారు. అయితే ఇప్పటికే ఎంతో ఆలస్యం జరిగిపోయింది. ప్రపంచదేశాల దృష్టిలో భారతదేశం పలుచనైపోతోంది. సనాతన హిందూ సంస్కృతిని ప్రపంచదేశాలకు నేర్పిన భారత్...  ఇప్పుడు గోరక్షకుల చేతిలో చిన్నబుచ్చుకోవడం దేశానికి, మన ప్రజలకు  ఎంత మాత్రం మంచిది కాదు. నాట్ ఇన్ మై నేమ్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియా గోరక్షకుల ఆగడాలపై సమరభేరి మోగిస్తోంది. మోదీ హెచ్చరికలతో కట్టుదప్పిన గోరక్షకుల అదుపులోకి వచ్చేనా? అమాయకుల ప్రాణాలు నిలిచేనా? నాలుగు పదాల సందేశం ఇప్పుడు నాలుగు దిక్కులా ప్రజ్వరిల్లుతోంది... నిశ్శబ్ద విప్లవం జనం గుండెలను తాకుతోంది.
ఇదా.. గో రక్షణ?  గో రక్షణ పేరుతో హత్యలు చేస్తారా? ఇలాంటి ఘటనలు  ఎంతో బాధకలిగిస్తున్నాయ్... చట్టాన్ని చేతుల్లో తీసుకునే హక్కు ఎవరికీ లేదు... ఇలాంటి హింస గాంధీజీ సిద్ధాంతాలకు విరుద్ధం... మహాత్మాగాంధీ నడయాడిన సబర్మతీ ఆశ్రమం వద్ద నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఇది...
గో సంరక్షణ పేరిట అమాయకులను హతమార్చడం ఆమోదయోగ్యం కాదని ప్రధాని నరేంద్రమోదీ తేల్చిచెప్పారు.  చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఏ ఒక్కరికీ లేదని తేల్చిచెప్పారు. మహాత్మాగాంధీ స్థాపించిన సబర్మతీ ఆశ్రమానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. గోవుపై భక్తి పేరుతో హింసకు పాల్పడుతూ... కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని... ఇది ఆదర్శాలకు పూర్తిగా విరుద్ధమని మోదీ చెప్పారు. ఆవుల్ని రక్షించే ముసుగులో అమాయకులను చిత్రవధ చేయడం, హింసకు పాల్పడడం ద్వారా సాధించేదేమీ లేదని ఆయన అన్నారు. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న గోరక్షకుల చర్యలు...  విచారాన్ని, బాధను కలిగిస్తున్నాయని మోదీ అన్నారు.
మహాత్మాగాంధీ అహింసను  ప్రబోధిస్తే... కొందరు దుర్మార్గులు... తమ చర్యలతో దేశానికి మచ్చ కలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహాత్ముడితోపాటు, ఆయన అనుచరుడు వినోబా భావే గోవుల్ని ఆరాధించారని... వాటి పరిరక్షణ కోసం పాటు పడ్డారని... ఆవుల్ని ఎలా పరిరక్షించుకోవాలన్న విషయానికి సంబంధించి ఒక మార్గాన్ని చూపించారనీ మోదీ అన్నారు. గోవుల పేరిట మనుషుల్ని చంపడాన్ని మహాత్ముడు కూడా ఆమోదించబోరని తెలిపారు. ఆవుల రక్షణ గురించి భారత రాజ్యాంగం కూడా చెబుతోంది. అంతమాత్రాన ఒక వ్యక్తిని చంపడానికి మనకు హక్కు ఉన్నట్లేనా? ఆవుల్ని ఆరాధించడమంటే ఇదేనా? వాటిని రక్షించుకోవడం ఇలాగేనా అంటూ ఆయన ధ్వజమెత్తారు. హింస ద్వారా ఏ సమస్యకు పరిష్కారం లభించదని...  సమాజంలో హింసకు తావు లేదనీ చెప్పారు. మతాల వారీగా చీలిపోవడాన్ని అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
అదే సమయంలో ఒక రోగి చనిపోతే అతని బంధువులు ఆఆసుపత్రిని కాల్చేస్తున్నారని...   వైద్యులపై దాడులు చేస్తున్నారని ఇలాంటి వాటి వల్ల చనిపోయినవారు తిరిగిరారని... వైద్యులపై నమ్మకం ఉంచాలని మోదీ చెప్పారు. మరోవైపు  రోడ్డు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే... కొంతమంది ఆగ్రహంతో రోడ్డెక్కి వాహనాల్ని ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా... ఎవరికి తోచిన విధంగా వారు... చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఆమోదించబోమని ఆయన అన్నారు. గాంధీ కలలు కన్న భారతదేశాన్ని సాకారం చేయడానికి అంతా కలిసి పనిచేయాలన్నారు.
మరోవైపు ప్రధాని మోదీ ఓవైపు గో సంరక్షణ అంటూ సబర్మతీ ఆశ్రమం వద్ద నుంచి సందేశమిస్తుంటే... మరోవైపు గోరక్షకుల పేరుతో అల్లరిమూకలు మరో ప్రాణాన్ని  బలిగొన్నాయ్. ఓవైపు ప్రభుత్వ పెద్దలు హెచ్చరిస్తుంటే.. ఆకతాయిలు మాత్రం ఇష్టారాజ్యంగా అమాయకులను వధిస్తూనే ఉన్నాయ్.  గో సంరక్షణ పేరుతో మనుషుల్ని చంపడం ఆమోదయోగ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పిన కొద్ది గంటలకే ఝార్ఖండ్‌లో మరో హత్య జరిగింది. బీఫ్‌ తీసుకెళ్తున్నాడని ఆరోపిస్తూ.. ఓ వ్యక్తిపై దాడి చేశారు కొందరు వ్యక్తులు నడిరోడ్డుపై చంపేశారు. అలీముద్దిన్‌ అనే వ్యక్తి తన కారులో వెళ్తుండగా.. గ్రామ శివారులో కొందరు వ్యక్తులు అడ్డుకొని...  అలీముద్దిన్‌ను కారు నుంచి దింపి తీవ్రంగా కొట్టారు. బీఫ్‌ను తరలిస్తున్నాడని ఆరోపిస్తూ.. అతడి కారుకు నిప్పటించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగానే.. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.  గతవారం ఢిల్లీ నుంచి హర్యానా వెళుతున్న ముస్లిం యువకుడు జునైద్ ఖాన్ పై దాడి, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నెల 22న రంజాన్ పండుగకు అవసరమైన షాపింగ్ చేసుకుని రైలులో సొంత ఊరికి వెళుతున్న జునైద్‌ను బీఫ్ తీసుకెళుతున్నాడని ఆరోపిస్తూ అల్లరిమూక దాడి చేసి కత్తిపోట్లకు పాల్పడటంతో మరణించాడు. ఆ హత్య జరిగిన మరుసటి రోజే ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు సినీ నిర్మాత సబా దివాన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పిలుపునిచ్చారు. నాట్ ఇన్ మై నేమ్ అనే పేరుతో ఆమె చేసిన పోస్ట్ అందరినీ ఆలోచింపజేసింది. ఆ పోస్ట్ స్ఫూర్తిగా బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌తోపాటు దేశంలోని 11 నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. లండన్, టొరంటో, బోస్టన్, కరాచీ నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయని దివాన్ తన ఖాతాలో పోస్ట్ చేశారు. జునైద్‌పై దాడి ఘటనలో ఢిల్లీకి చెందిన ప్రభుత్వోద్యోగి సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వ రైల్వే పోలీస్  ఫరీదాబాద్ ఎస్పీ కమల్‌దీప్ గోయల్ తెలిపారు. అరెస్టు చేసిన వారిలో ముగ్గురు 20 ఏళ్లలోపు వారే.

ఇవాళ ఈ పరిస్థితి నాకు వచ్చింది... రేపు మీకు రావొచ్చు... మరో రోజు  ఇంకెవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురు కావొచ్చు. సోషల్ మీడియాలో మొదలైన ఉద్యమం...  ఇప్పుడు నాట్ ఇన్ మై నేమ్ అంటూ దేశంలోని ప్రధాన పట్టణాల్లో నిరసనలు వేదిక అవుతోంది.  పాలకులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. మొల్లగా మొదలైన ఉద్యమం ఇప్పుడు ప్రధాన నగరాలను ప్రభావితం చేస్తోంది.
దేశంలో దళితులు, మైనారిటీలు,  అమాయకులపై మతం, సంస్కృతి,  ఆవు పేరుతో జరుగుతున్న దాడులకు  నిరసనగా మేధావులు, సెలబ్రిటీలు... మౌనదీక్ష  నిర్వహించారు. ప్రభుత్వానికి, విధానాలకు వ్యతిరేకంగా... దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయ్. అవన్నీ కూడా నాట్  ఇన్ మై  నేమ్ పేరుతో జరుగుతున్నాయ్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా... నినాదాలు లేవూ...  ఊకదంపుడు ఉపన్యాసాలు లేవు.. అంతా నిశ్చబ్దం. ఒక్క  ప్లకార్డ్ పై NOT IN MY NAME అనే అక్షరాలు మాత్రమే కన్పిస్తాయ్. స్పాట్
నాట్ ఇన్ మై నేమ్ అంటే.. నాపై ఈరోజు దాడి జరగకపోవచ్చు.. ఏదో ఒక రోజు.. ఏదో ఒక కారణంతో నాపై దాడి జరగొచ్చు. ఇప్పుడు నేను వ్యతిరేకించకపోతే.. రేపు నా వంతు కూడా రావచ్చు. అందుకే ఈ మౌన నిరసన అని అర్థం. వర్గం, మతం, వర్ణం అంటే ద్వేషం పెంచుకున్నవాళ్లే దళితులు, మైనారిటీలపై దాడులు చేస్తున్నారనేది మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్న మాట. సోషల్ మీడియాలో పుట్టిన స్లోగన్.. ఇప్పుడు నడి రోడ్డుపై ఆందోళనలు చేస్తోంది. ఎక్కడా విధ్వంసాలు లేవు.. గొడవలు లేవు.. ఘర్షణలు అస్సలే లేవు. దేశంలో జరుగుతున్న అల్లరిమూకల దాడులకు నిరసనగా... ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు పదాల సందేశం ఇప్పుడు నాలుగు దిక్కులా ప్రజ్వరిల్లుతోంది... నిశ్శబ్ద విప్లవం జనం గుండెలను తాకుతోంది. స్పాట్
దేశంలో అసహనం, విద్వేష దాడులతో...  మతం కారణంగానూ... ఇతర కారణాలతో జరుగుతున్న ఆందోళనలు శృతి మించి మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయ్.  మతం పేరుతో జరుగుతున్న మారణహోమం అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయ్. ఇలాంటి ఘటనలపై  సోషల్ మీడియాలో పుట్టిన ఈ నినాదం.. ఇప్పుడు హోరెత్తుతోంది. మానవతావాదులు, ప్రజా సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు.. నాట్ ఇన్ మై నేమ్ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్పాట్
ఎవరూ ఎవర్నీ పిలవలేదు. ఎవరికీ ఆహ్వానాలు లేవు. రాజకీయనాయకులు వచ్చినా... ఆందోళనకారులకు సంఘీభావం చెప్పడం... వెళ్లడం మాత్రమే. అయినా సరే NOT IN MY NAME ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాయి పలు పార్టీలు. హిందూ తీవ్రవాదాన్ని అంతమొందించాలి. బ్రాహ్మనిజాన్ని అడ్డుకోవాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ఆందోళనల్లో  సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీలతోపాటు, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా భాగస్వాములయ్యారు. సోషల్ మీడియాలో పుట్టిన ఈ ఉద్యమం.. ఇప్పుడు ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ వరకు విస్తరించింది. నిరసనతో కూడిన నిశ్శబ్దం. ఆహారం పేరుతోనో, ఆవు పేరుతోనో, ఇంకో పేరుతోనో, మరేదైనా పేరుతోనో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై నోరు విప్పాలంటూ నిశ్శబ్దంతో నిరసనని పాటించారు హైదరాబాదీలు. మానవ హక్కులు కాలరాయొద్దంటూ మానవతావాదులు  ఒక్కరొక్కరుగా ట్యాంక్‌బండ్‌పైకి ఆందోళనబాటపట్టారు. స్పాట్
అందరి మాట ఒక్కటే మొత్తం గోరక్షణ పేరుతో జరగుతున్న అరాచకాలకు బీజేపీ పెద్దల అండదండలున్నాయన్నది వారి అభిప్రాయం.  బీజేపీ ప్రభుత్వాలు గోరక్షకులకు దన్నుగా నిలవడంతో... వారు చేస్తున్న కార్యక్రమాల్లో హింస రాజ్యమేలుతోందని... అది చివరకు ప్రాణాలను బలితీసుకుంటుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అందుకే కాబోలు ప్రధాని మోదీ సైతం స్పందించారు. ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది... మోదీ ఇప్పుడు తన మాటలను చేతల్లో చూపించాలి.
గోరక్షణ అంటే ఏంటి? అసలు గోరక్షణ ఎవరు చేస్తున్నారు... రాజకీయ గోరక్షణ చేస్తుందెవరు? గోరక్షణ ముసుగు వేసుకుందెవరు? దేశంలోనే అతిపెద్ద బీఫ్ మార్కెట్ తో ఉత్తరప్రదేశ్ ఎంత మందికి ఉపాధి చూపిస్తే... నేడు యూపీలోనూ బీఫ్ బ్యాన్ మొదలైంది. బీఫ్ తిన్నారంటూ సెలబ్రిటీలపైనా రాళ్లు వేసే విష సంస్కృతి మొదలైంది. మరోవైపు  కేంద్రం జంతువధ చట్టా్న్ని సైతం తీసుకొచ్చి... మొత్తం బీఫ్ పాలిటిక్స్ కు తెరదీసింది.   హిందువులు గోవును పరమపవిత్రమైనదిగా భావిస్తారు. గోమాతగా ఆవుకు పూజలు, పునస్కారాలు చేస్తూ.. పవిత్ర కార్యంగా తలుస్తారు. గృహప్రవేశం చేసినా... ముందుగా గోమాతను లోపలకి పంపించి... గోమాత ఆశీస్సులు తీసుకుంటారు. గోవుకు మొక్కితో కష్టాలు  తొలగిపోతాయని నమ్ముతారు. గోవు చుట్టూ ప్రదక్షణ చేస్తే పాపాలు తొలగిపోతాయని... మంచి జరుగుతుందని తలుస్తారు. అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి గోరక్షకుల పేరుతో దాడులు పెచ్చరిల్లాయ్.
ఒకరా... ఇద్దరా...  ఏకంగా 25 మందిని... గోరక్షకుల  పేరుతో...  బీఫ్ తింటున్నారని బలితీసుకుంటున్నారు. మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే 97 శాతం ఘటనలు జరిగినట్టుగా రికార్డులు స్పష్టం చేస్తు్న్నాయ్. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, హర్యానా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ ఘటనలు జరుగుతున్నాయ్. ఇప్పటి వరకు ఈ తరహా దాడులు 63 జరగ్గా... 24 మంది మైనార్టీలు ప్రాణాలు కోల్పోయారు. 124 మంది గాయపడ్డారు. ఈ  గణాంకాలను ఇండియా స్పెండ్ విడుదల చేసింది. దాడులు ఎక్కువగా  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నాయని నివేదిక స్పష్టం చేస్తోంది.
మరోవైపు గోరక్షకులకు దన్నుగా ఉండేలా...  బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గోమాంస నిషేధ చట్టాలను తీసుకొస్తున్నాయన్న విమర్శ ఎక్కువవుతోంది. దేశవ్యాప్తంగా ఈ గోమాంస విక్రయాలను నిరోధించేందుకు కేంద్రం జంతువులను క్రూరత్వం నుంచి రక్షించే ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయాలిటీ టువర్డ్స్ యానిమల్స్‌ యాక్ట్‌  చట్టాన్ని ఆశ్రయించింది. ఆ చట్టంలో 22వ నిబంధన కింద పశువుల సంతలో పశువులను వ్యవసాయ అవసరాల కోసమే తీసుకుంటున్నట్లు కొనుగోలు, విక్రయదారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలంటూ ఆంక్షలు తీసుకొచ్చారు. అదే చట్టంలోని 11వ సెక్షన్‌  ఈ నిబంధన ప్రకారం అనవసరంగా హింసించనంత కాలం ఆహారం కోసం జంతువులను చంపడం తప్పు కాదని కూడా ఉంది. అయినా... దేశవ్యాప్తంగా గోమాంసం నిషేధించాలనే ఆరెస్సెస్‌ డిమాండ్‌ను అమలు చేయడానికి కేంద్రం తెలివిగా వ్యవహరిస్తుందన్న విమర్శలు విన్పిస్తున్నాయ్. గోమాంసం నిషేధం, కబేళాల నిషేధం రాష్ట్రాల పరిధిలోని అంశం కావంతో కేంద్రం జంతువులను క్రూరత్వం నుంచి రక్షించే చట్టం నిబంధనలను ఆశ్రయించింది. ఆ చట్టం కింద పశుమాంసం క్రయవిక్రయాలను గానీ, కబేళాలను గానీ నిషేధించే హక్కు లేకపోవడం వల్ల కేంద్రం మధ్యేమార్గాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్రమే గోమాంసాన్ని నిషేధించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. నిషేధం వల్ల వచ్చే పర్యవసనాలను కూడా పరిశీలించాలి. దేశంలో గోమాంసం, దాని సంబంధిత పరిశ్రమలపై ఆధారపడి బతుకుతున్న నాలుగైదు కోట్ల మంది రోడ్డున పడతారని ప్రాథమిక అంచనాలు తెలియజేస్తున్నాయి. యూపీలో మాంసం పరిశ్రమ స్తంభించిపోవడం వల్ల ఏడాదికి 56 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతుందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో దాదాపు 18-19 శాతం ముస్లింలతోపాటు వారిలో మాంసం వ్యాపారం చేసే ఖురేషీ, కసాయీ అనే కులాలవారు ఉన్నారు. దేశంలో వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహార ఉత్పత్తులు ఎగుమతుల అభివృద్ధి సంస్థ...  అనుమతితో నడుస్తున్న ఆధునిక యాంత్రిక జంతు వధశాలలు 75 ఉంటే, వాటిలో 42 యూపీలోనే పనిచేస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ సహా దేశం నుంచి బీఫ్‌ పేరుతో ఎగుమతి అయ్యేదంతా గేదె మాంసమే. మొత్తం మాంసం ఎగుమతుల్లో అధిక భాగం గేదె మాంసమే. 2011–12లో దేశంలో ఉత్పత్తి అయిన పాలలో దాదాపు 53 శాతం గేదెలదయితే, మిగిలిన 47 శాతం ఆవులది. వాటి యజమానుల్లో దాదాపు 80 శాతం ముస్లింలే. స్థానిక ఖురేషీ ముస్లింలు కూడా కొన్ని ఆధునిక కబేళాలు నిర్వహించడమేగాక, ఎస్పీ, బీఎస్సీ టికెట్లపై పార్లమెంటు, యూపీ అసెంబ్లీ, కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. 2010-14 మధ్య కాలంలో యూపీఏ సర్కారు గేదెల కోడె దూడల పెంపకానికి ఓ పథకం రూపొందించింది. దూడలను ఏడాదిపాటు పెంచడానికి రుణాలు సమకూర్చడమేగాక, అవి పెరిగాక ఆధునిక కబేళాలకు పంపడానికి సర్కారు ఈ స్కీము కింద సాయమందించేది. ఫలితంగా గేదె మాంసం కబేళాల నుంచి ఉత్పత్తి, ఎగుమతులు పెరిగాయి. 2016 ఏప్రిల్‌-ఆగస్టు నాలుగు నెలల కాలంలో దేశంలో మొత్తం వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహారపదార్ధాల ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈ కారా బీఫ్‌ వాటా 23 శాతానికి పెరిగింది. తాజాగా యూపీ సీఎం ఆదిత్యా నాథ్‌ యోగి తీసుకున్న గోమాంస నిషేధంతో సింహాలకు బీఫ్‌ బదులు మటన్‌, చికెన్‌ పెడుతున్నారు.గొడ్డు మాంసం దొరకకపోవడంతో... అధికారులు మటన్‌, చికెన్‌ అందజేస్తున్నారు. అయితే, దీని కారణంగా అక్కడి ప్రభుత్వ ఖజానాపై ఎక్కువ భారం పడుతోందని అధికారులు అంటున్నారు. ఒక్కో సింహానికి రోజుకు సగటున 10కిలోల గొడ్డుమాంసం పెట్టాల్సి ఉంటుంది. స్పాట్
ఇటీవల నటి కాజోల్...  గోమాంసం బీఫ్ తిని పైగా ఆ వీడియోను అప్‌లోడ్ చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ నటి ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. మీరు ఊహించింది, ప్రచారం చేసింది తప్పు... వీడియోలో ఉన్న డిషెష్ లో మీరు చూసింది బఫెలో మాంసం దున్నపోతుదని... దానిపై ఎలాంటి నిషేధం లేదంటూ చెప్పుకోవాల్సి వచ్చింది. మరోవైపు.  అదే సమయంలో నటి కాజోల్‌కు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ మద్దతుగా నిలిచారు. బీఫ్‌ తింటున్న ఓ వీడియోను పోస్ట్‌ చేస్తే...  చివరికి తాను తిన్నది గేదె మాంసమని వివరణ ఇచ్చేవరకూ పరిస్థితి వచ్చిందని మమత తెలిపారు. దేశంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్న మమత, కొందరు వ్యక్తులు ఇతరులు ఏం తినాలో నిర్దేశిస్తున్నారని విమర్శించారు.
దేశ వ్యాప్తంగా బీఫ్‌ అమ్మకాలు, కబేళాల విషయంలో బీజేపీ చాలా సీరియస్‌గా ఉండగా అదే పార్టీకి చెందిన నేత మాత్రం బీఫ్‌కు అనుకూలంగా ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే చౌక ధరలకే బీఫ్‌ లభించేలా ఏర్పాట్లు చేస్తామని, కబేళాలను కూడా చట్టబద్ధం చేస్తామంటూ మేఘాలయ బీజేపీ నేత బెర్నార్డ్‌ మారక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే తరహా వ్యాఖ్యలను కేరళ బీజేపీ నేత చేశారు. వ్యక్తిగతంగా గోవధను అంగీకరించకపోయినా... కేరళ చట్టాలు బీఫ్‌ తినేందుకు అనుమతిస్తాయని... క్వాలిటీ బీఫ్‌ అందుబాటులో ఉంంచుతానని... కబేళాలను ఎలాంటి సమస్యలు లేకుండా నడిపిస్తానంటూ   కేరళకు చెందిన బీజేపీ నేత ఎన్‌ శ్రీప్రకాశ్‌  చెప్పారు.  అంటే ఓటు ముందు బీఫ్ రాజకీయం కొత్త పుంతలు తొక్కుతుందన్నమాట. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చాక 2015 సెప్టెంబర్‌ ఆఖరులో యూపీలోని దాద్రీ పట్టణంలో ఆవు మాంసం ఇంట్లో దాచారనే ఆరోపణతో మహ్మద్‌ అఖ్లక్‌ సాయిఫీ అనే 52 ఏళ్ల వ్యక్తిని ఓ గుంపు దాడి చేసి చంపింది. నాటి నుంచి నేటి వరకు బీఫ్ పేరుతో పలు హిందూ సంస్థల మైనార్టీలకు బెదిరింపులు కొనసాగిస్తున్నాయ్. అనుమానం వచ్చిన తర్వాత... అందుకు బీఫ్ ముసుగు తొడిగి... అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నాయ్. నాటి నుంచి బీఫ్ పేరుతో దేశంలో ఏదో ఒక మూలన జరుగుతున్న ఘటనల్లో పెద్ద ఎత్తున అమాయకులు ఆస్తులు కోల్పోతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు.
మైనార్టీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో పలు ముస్లిం సంఘాల పెద్దలు సైతం... గోమాంసాన్ని మానేయాల్సిందిగా పిలుపునిస్తున్నారు. రాజస్థాన్ అజ్మీర్ దర్గాకు చెందిన ప్రముఖ మత గురువు సయ్యద్ జైనుల్ అబెదిన్ అలీఖాన్  ముస్లింలందరూ గో మాంసాన్ని తినడం మానేయాలని సూచించారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని విజ్ఞప్తిచేశారు. ఇతర మతస్తుల విశ్వాసాలను మనం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముస్లింలకు మత గురువు సూచించారు. హిందువులకు పవిత్రమైన ఆవును చంపకూడదని.. గో మాంసాన్ని తినడం మానేసి హిందూ సోదరుల మత విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని ముస్లింలకు పిలుపునిచ్చారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గో మాంసాన్ని నిషేధించిన అనంతరం పలు రాష్ట్రాల సీఎంలూ ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు.
పశువులను కబేళాలకు తరలించకుండా నిరోధించేందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆంక్షలపై కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని మంటకలుపుతోందని మండిపడుతున్నాయి. దీనికి కేంద్ర పర్యావరణ శాఖ వివరణ ఇస్తూ ఆహారం కోసం జంతువులను హతమార్చడాన్ని నిషేధించలేదని, జంతువులను హింస నుంచి రక్షించే చట్టం కిందనే ఆంక్షలు తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. ఇదంతా నాణానికి ఒకవైపు ఉంటే... ఇటీవల కాశ్మీర్ లో గుంపు చేతిలో చనిపోయిన డిప్యూటీ ఎస్పీ హత్యకు  కూడా పండిత్ అన్న పేరే కారణంగా విన్పిస్తోంది. తన విధులు బాధ్యతతో నిర్వర్తిస్తున్న డీఎస్పీ హిందువన్న అభిప్రాయంతోనే... అక్కడ ఉన్న మరో వర్గం ప్రజలు అతనని అంతమొందించినట్టుగా చెబుతున్నారు. మత ప్రాతిపదికన ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యానికి చికిత్స కట్టుదిట్టంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దేశంలో మత ప్రాతిపదికన అలజడి ఇప్పుడు ఎంతో మాత్రం సహేతుకం కాదు. మతం పేరుతో దేశం ఇప్పటికే రెండు ముక్కలైంది. మరోసారి అలాంటి స్థితిని ఎదుర్కోడానికి ఎంత మాత్రం సిద్ధంగా లేదు. ప్రధాని మోదీ ఇప్పుడు కీలకంగా వ్యహరించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతీ రోగానికి చికిత్స చేస్తున్న మోదీ... గోరక్షణ అంటూ సాగుతున్న దురాగతాలను కట్టడి చేయడం పెద్ద కష్టమేమీ కాదు... నిందితులను కాపాడుతున్న  హిందూ సంస్థలపై ఉక్కుపాదం మోపాలి. దేశ ప్రతిష్టను మంటగలుపుతున్న దుర్మార్గుల కోరలు పీకాలి. దుష్ట శిక్షణ మొదలు పెడితే... శిష్ట రక్షణ మొదలవుతుంది. చర్యలు తీసుకోవాల్సిన పెద్దలు అడుగు ముందుకేస్తే... విధ్వంసకారులు రెండడుగులు వెనక్కి వేస్తారు. అప్పుడు అమాయకుల ప్రాణాలు కాపాడగలుగుతాం. ఇది ఇవాళ్టి ఇన్ సైడ్... మరో కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం...

No comments:

Post a Comment