Friday, 14 July 2017

బంగారం బంగారమే

వన్నె తగ్గనిది... విలువ తగ్గనిది... అంతకంతకూ పెరిగేది... 365 రోజులు గిరాకి కలిగి ఉండేది బంగారం ఒక్కటే.  అవును బంగారం ప్రపంచాన్ని శాసిస్తోంది. జనంలో బంగారానికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ధర పెరిగినా బంగారాన్ని కొనుగోలు చేయడం మాత్రం తగ్గడం లేదు.  బంగారంపై పిచ్చి ఇండియన్లకు మాత్రమే కాదు... బంగారంపై ప్రేమ, మమకారం, అవసరం ప్రపంచ దేశాలకు ఎక్కువవుతోంది. బంగారు నిల్వలపై ప్రపంచ దేశాల కన్నుపడింది. ఎంతైతే  డబ్బు దాచుకుంటారో... అంత మొత్తానికి సమానంగా బంగారాన్ని కొనుగోలు చేయాలని జనం భావిస్తున్నారు. డబ్బుకంటే బంగారం రూపానికే ఎక్కువ వాల్యూ ఉంటుందన్న అభిప్రాయం జనంలో ఉంది.  బంగారం లాంటి జీవితం... బంగారు భవిష్యత్.....  బాబు బంగారమంటూ మన జీవితాల గురించి  బంగారం  ప్రభావం ఎంతో ఉంటుంది. గోల్డ్ ఈజ్ గోల్డ్ స్పెషల్ రిపోర్ట్...
బంగారం ప్రపంచ వ్యాప్తంగా అతి ఎక్కువ గిరాకీ ఉన్న ఖనిజం. అయితే బంగారం నిల్వలలు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా తక్కువ పరిణామంలోనే ఉన్నాయ్. అనాధిగా బంగారం ఆఫ్రికా ఖండంలో...  ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో లభించేది.  అక్కడి గనుల నుంచి పెద్ద ఎత్తున బంగార నిల్వలు ప్రపంచ వ్యాప్తంగా తరలి వచ్చేవి.   బంగారం, రాగి  క్రీస్తు పూర్వం 5000 ఏళ్ళ క్రితమే కనుగొన్నారు భూమి పై ఉన్న ఏడు ఖండాల్లోనూ బంగారు నిక్షేపాలను కనుగొన్నారు.  ప్రపంచంలో బంగారు నాణాలను తొలిసారిగా వాడుకలోకి తెచ్చిన ఘనత ప్రాచీన గ్రీకు ప్రాంతానికి చెందిన లిడియా రాజు కింగ్ క్రిస్ కు దక్కుతుంది.  క్రీస్తు పూర్వం 540 ప్రాంతంలో స్వచ్ఛమైన బంగారు నాణాలను వాడుకలోకి తెచ్చాడు.
హేమం, కనకం, స్వర్ణం ఇలా పలు పేర్లతో బంగారాన్ని పిలుచుకుంటాం.  బంగారు ఒక అరుదైన ఖనిజం. అత్యంత ఖరీదైన వస్తువు. బంగారంతో అద్భుతమైన ఆభరణాలు తయారు చేయవచ్చు...  ఆయా వ్యక్తులు సైతం తమ వద్ద ఉన్న బంగారాన్ని బట్టి ధనికులుగా చెలామణీ అవుతున్నారు. బంగారాన్ని బట్టి ఆ దేశ సంపదను అంచనా వేస్తారు.  బంగారు నిల్వల ఆధారంగానే ఆ దేశ కరెన్సీని ముద్రిస్తుంది. అందుకే బంగారం ధర ప్రపంచమంతా ఒకే మాదిరిగా ఉంటుంది. ఒకచోట ఒకలా... మరో చోట మరోలా బంగారం ధరల్లో వ్యత్యాసం ఉండదు.
బంగారం అతి తక్కువ ప్రమాణంలో నేల పొరలల్లో  నిక్షిప్తమై ఉంటుంది. భూమిలో బంగారం ప్రధానంగా రెండు రకాలుగా లభిస్తుంది. ప్రథమ శ్రేణి, లోడ్ నిల్వలు  ద్వితీయ శ్రేణి నిల్వలను ప్లసెర్ అంటారు. ఈజిప్టులో ఫారోల కాలంలో బంగారాన్ని గనుల నుంచి తవ్వేవారు. ఆ బంగారం అవసరానికి తగినంతగా లభించనప్పుడు యెమెన్,  దక్షిణాఫ్రికాలో అన్వేషణ కొనసాగించారు. అయితే బంగారు గనుల్లో పనిచేసే వారి జీవితం దుర్భరంగా ఉంటుంది.  గనుల్లో తవ్వకాలతో కార్మికులు కాలుష్యం బారినపడి... దీర్ఖకాలంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం భూమి మీదా వాడుక లో ఉన్న బంగారం 20 శాతం మాత్రమేనని మరో 80 శాతం భూ గర్భం లోనే ఇంకా నిక్షిప్తమై ఉందని శాస్త్ర వేత్త ల అంచన.  భూమి పై ఉన్న అన్ని సముద్రాల అట్టడుగునా దాదాపు 2 కోట్ల టన్నుల వరకు బంగారం ఉంటుందని శాస్త్ర వేత్తల అభిప్రాయపడుతున్నారు. ఇతర గ్రహాల్లోనూ బంగారం అవశేషాలను కనిపెట్టినట్టుగా చెబుతున్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు గనుల నుంచి తవ్వి తీసిన మొత్తం బంగారంలో దాదాపు సగం బంగారం ఒకే ఒక్క ప్రదేశం నుంచి దొరికింది.  ఆ ప్రదేశమే దక్షిణాఫ్రికాలోని విట్ వాటర్స్ రాండ్ . ఒక ఔన్సు బంగారాన్ని 300 చదరపు అడుగుల పలుచని రేకులా సాగ గొట్టవచ్చును. బంగారం భౌతిక గుణగణాలు నిజంగా విశ్మయాన్ని కలిగిస్తాయ్.  అత్యంత పలుచని రేకులుగా సాగే అద్భుతమైన భౌతిక ధర్మాన్ని బంగారం కలిగి ఉంది.  వెంట్రుకల  కన్నా సన్నని తీగెలుగా బంగారం సాగుతుంది. ఒక ఔన్సు బంగారం అంటే 28 గ్రాముల బంగారాన్ని 50 మైళ్ళ పొడవున్న తీగెను చేయవచ్చట.  కేవలం ఒకగ్రాము భారమున్న బంగారాన్ని ఒక చదరపు మీటరు వైశాల్యం గల రేకుగా సాగతీయోచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పూర్వ కాలంలో బంగారాన్ని మారకంగా వినియోగించేవారు.  బంగారంనుండి ఎక్కువగా నాణేలు, ఆభరణాలు తయారు చేయుటకు ఉపయోగించడం జరిగేది. 1930నుండి బంగారపు నాణేల చలామణిని ఆగిపోయింది. 2012 నాటికి లక్షా 74 వేల 100  టన్నుల బంగారం ప్రపంచం వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యింది

ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా పెరుగుతూ వచ్చాయ్. బంగారం ధర ఎన్నాళ్లకు రెట్టింపు అవుతోంది. బంగారం డిమాండ్ వచ్చే రోజుల్లో కొనసాగుతోంది... పడిపోతుందా... బంగారం డిమాండ్ ఎందుకు తగ్గుతోంది. బంగారం విషయంలో భారతీయులకు క్రేజ్ ఎక్కువ. అయితే భారతదేశంలో లభిస్తున్న బంగారం చాలా తక్కువనే చెప్పాలి. భారతీయులు కొనుగోలు చేస్తున్న బంగారమంతా ప్రపంచ  దేశాల నుంచి దిగుమతి చేసుకునేదే...  బంగారాన్ని అంతర్జాతీయ రేట్లు ఆధారంగా విక్రయిస్తారు. కొనుగోళ్లు జరుపుతారు. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ఒకే రకమైన ధరను కలిగి ఉంటుంది.  బంగారం ప్రతి తొమ్మిదేళ్లకు ఒకసారి రెట్టింపు అవుతుంది. 1925లో పది గ్రాముల బంగారం ధర రూ 18.75 పైసలు. 1950లో పది గ్రాముల బంగారం ధర రూ. 99.18 పైసలు... 1975లో పది గ్రాముల బంగారం ధర రూ. 540. అదే 2000 సంవత్సరంలో పది గ్రాముల బంగారం ధర రూ. 4400. అదే ప్రస్తుతం రూ. 29,000గా ఉంది.  బంగారం ధరలు అంతకంతకు పెరుగుతుండగా... రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల బంగారం కొనుగోలు చేయడంతో  దాని ధర పలానా విధంగా పెరిగిందని సంతోషించవచ్చు. దేశ ప్రజలు బంగారం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం చేస్తున్న పలు చర్యల మూలంగా 13 ఏళ్ల కనిష్ట స్థాయికి ఇండియాలో బంగారం డిమాండ్ తగ్గింది. 2016లో గోల్డ్ డిమాండ్ 580 టన్నులుగా ఉంది. అది ఈ ఏడాది 34 శాతం తగ్గినట్టుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. 2003 తర్వాత ఇలాంటి పరిస్థితి చూడటం ఇదే మొదటి  సారిగా గోల్డ్ ఎక్సపర్ట్స్ చెబుతున్నారు. 2016 బంగారం వ్యాపారంలో అనూహ్యమైన మార్పులు వచ్చినట్టుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడింది.
2016లో గోల్డ్ దిగుమతులు 498 టన్నులుగా ఉంది. 2015 నుంచి నెలకు 60 టన్నుల గోల్డ్ దిగుమతులు జరుగుతున్నాయ్.  అయితే 2020 నాటికి భారతదేశంలో బంగారం డిమాండ్ 850 నుంచి 950 టన్నుల వరకు ఉంటుందని వరల్డ్ గోల్డ కౌన్సిల్ పేర్కొంది.  2010లో భారతదేశంలో గోల్డ్ డిమాండ్ 1006 టన్నులుగా ఉంది. 2011లో 986 టన్నులుగా ఉంది. 2012లో ఆ సంఖ్య 864 టన్నులుగా ఉంది. 2013లో 975 టన్నులుగా ఉంది. 2014లో బంగారం డిమాండ్ 811 టన్నులు ఉంది. 2015లో 858 టన్నులు ఉంది. 2016లో అది 580 టన్నులకు పడిపోయింది. బంగారం దిగుమతులు భారీగా తగ్గిపోడానికి కారణం... 2016 బడ్జెట్లో 1 శాతం ఎక్సైజ్ డ్యూటీ వేయడమన్న అభిప్రాయాన్ని పరిశ్రమవర్గాలు వ్యక్తం చేస్తున్నాయ్. దీనికి నిరసనగా 42 రోజులపాటు ఆందోళన కూడా చేశారు.   దేశీయంగా బంగారు దొరకడం తక్కువకావడంతో... ఎక్కువ శాతం బంగారాన్ని బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

భారతదేశంలో బంగారు ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతోంది. మనం వాడుతున్న బంగారమంతా బయట నుంచి వచ్చేదేనా? కర్ణాటకలో తప్పించి మిగతా చోట్ల దొరికే బంగారం అంతంత మాత్రమేనా? ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో సింహ భాగం భార‌త్‌, చైనా దేశాల నుంచే జ‌రుగుతోంది. ప్రపంచంలో ని బంగారం లో దాదాపు 11 శాతం భారతదేశంలో ని మహిళా ల వద్ద ఆభరణాల రూపం లోనే ఉంది. ఈ ఆభరణాల పరిమాణంత అమెరికా , జర్మని , స్వీట్లర్జాండ్ , ఐ ఎం ఎఫ్ ల మొత్తం బంగారు నిల్వల కంటే చాలా ఎక్కువ. అంత‌ర్జాతీయంగా ప‌సిడి ధ‌ర‌లు మార‌డంలో వీటి ప్రభావం ఎక్కువ‌గా ఉంటుంది. గ‌త కొద్ది నెల‌లుగా ఈ రెండు దేశాల్లో వినియోగం త‌గ్గుతోంది. ఆర్థిక ప‌రిస్థితులు  ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డంతో బంగారం త‌దిత‌ర సాధనాల్లో పెట్టుబ‌డి దిశ‌గా కొనుగోళ్లు జ‌రిపేవారు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత బంగారం అమ్మాకాలపైనా ప్రభావం చూపింది. అమ్మకాలు తగ్గినప్పటికీ... బంగారం ధర మాత్రం అదే విధంగా కొనసాగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా దొరుకుతున్న బంగారు నిల్వల్లో దేశంలో దొరుకుతున్న బంగారం నిల్వలకు చాలా తక్కువగా లభిస్తున్నాయ్. మెజార్టీ మొత్తం బయట దేశాల నుంచే మనం కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రపంచంలో లభించే గోల్డ్ నిల్వల్లో మెజార్టీ మన దేశంలో వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.  ప్రపంచ వ్యాప్తంగా 116.5 మిలిటన్ టన్నుల ఖనిజాలుండగా...   22.4 మిలియన్ టన్నుల బంగారం నిల్వలున్నాయి. అదే సమయంలో భారతదేశంలో ఉన్న గోల్డ్ నిల్వలు కేవలం ఒక శాతంగానే ఉన్నాయన్న అంచనా ఉంది.  దక్షిణాఫ్రికా మనకంటే 60 సార్లు అధికంగా ఉత్పత్తి చేయగలిగితే, కెనడా 22 సార్లు, ఆస్ట్రేలియా 5 సార్లు మన కంటే ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేయగలుగుతున్నాయ్. అయితే బంగార నిల్వలను వెలికితీయడం ఏటికేడు తగ్గుతూ వస్తోంది. దేశంలో బంగారు అందుబాటులో ఉన్నప్పటికీ... 1999-2000 సంవత్సరాల మధ్య అది 2,586 కేజీలుగా ఉంది. 2002-03 నాటికి అది 3,049 కేజీలకు చేరింది.  భారతదేశంలో బంగారం నిల్వలు ఎక్కువగా కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్, హుట్టి గోల్డ్ ఫీల్డ్, ఆంధ్రప్రదేశ్ లోని రామగిరి గోల్డ్ ఫీల్డ్ లో  ఉన్నాయ్.  కర్ణాటకలో 42 వేల కేజీల బంగారు లభ్యవుతుందని అంచనా వేస్తున్నారు. అది దేశంలోని 88.7 శాతంతో సమానం. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని రామగిరి వద్ద పెద్ద మొత్తంలో బంగారు నిల్వలున్నాయ్. జార్ఖండ్, కేరళలోనూ బంగారం లభ్యవుతోంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద పెద్ద ఎత్తున గోల్డ్ నిల్వలున్నాయ్.  రిజర్వ్ బ్యాంక్ చేతి వద్ద  1312.5 బిలియన్ రూపాయల బంగారు నిల్వలున్నాయి. ఆ నిల్వల ఆధారంగానే కరెన్సీ ముద్రణ జరుగుతుంది.
భారతదేశంలోని దేవాలయాల్లో కుప్పలుతెప్పలుగా బంగారం నిల్వలున్నాయన్న అభిప్రాయం ఉంది. ముఖ్యంగా తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి దేవాలయంలో బంగారు కోటాను కోట్ల విలువ  కలిగినది ఉన్నదని అంటారు. అదే సమయంలో టీటీడీ వద్ద భారీగా బంగారం నిల్వలున్నట్టుగా చెబుతున్నారు. అసలు భారతదేశంలోని దేవాలయాల్లో బంగారు నిల్వలు ఏ మేరకు ఉన్నాయ్.
భారతదేశంలో ఇష్టదైవానికి బంగారం సమర్పిస్తే మంచి జరుగుతుందన్న అభిప్రాయం భక్తుల్లో ఎక్కువగా ఉంది. అందుకే వారి ఇష్టదైవాలను స్మరిస్తూ... ఆయా ఆలయాలకు భక్తుల బంగారు నగలు, బంగారు వస్తువులను సమర్పించుకుంటారు. ఇలా సమర్పించుకున్న బంగారు నిల్వలు దేశంలోని కీలక ఆలయాల్లో పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయ్. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద 7 వేల కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయ్. మార్కెట్లో ఆ బంగారం విలువ విలువ సుమారు రూ.1,800 కోట్లుగా ఉంది. ముంబయి... సిద్ధివినాయక గణపతి మందిరం 160 కిలోల బంగారు ఆభరణాలున్నాయ్. షిర్డి సాయిబాబా మందిరం 384 కిలోలు గుజరాత్‌ సోమనాథ్‌ మందిరం 35 కిలోలు, విజయవాడ కనకదుర్గ ఆలయం 110 కిలోల బంగారం నిల్వలున్నాయ్. ఇక కేరళలోని అనంతపద్మనాభస్వామి ఆలయంలోని  నేలమాళిగల్లో దాగిన అపారసంపద బయట పడింది. దాంతో ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా పరిగణించే అవకాశం ఉంది. అయితే ఇక్కడి సంపద, నిక్షేపాలపై సుప్రీం పర్యవేక్షణ ఉండటంతో... ఇక్కడ సంపదపై పూర్తి స్థాయి ఆధారాలు లభ్యం కాలేదు.
బంగారంపై ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించి నిపుణులు ఏం చెబుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయడాకి సంబంధించి అందుతున్న సూచనలేంటి? బంగారం విషయంలో కామన్ మ్యాన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.  బంగారమంటే స్త్రీలకు మొజు. బంగారమంటే మహిళలు పడిచస్తారు. బంగారు ఆభరణాలు ధరించాలని... బంగారాన్ని తగినంతగా సమకూర్చుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. ఫంక్షన్లకు వెళ్లాలంటే బంగారు లేకుండా వెళ్లనే వెళ్లరు. బంగారు ధరించడం ఒక ప్రెస్టేజ్ ఇష్యూలా మహిళలు భావిస్తారు.  భారతీయ సంస్కృతి ప్రకారం పండుగ, పెళ్లిళ్లంటే గుర్తుకొచ్చేది బంగారం మాత్రమే. అందుకే భారత దేశంలో బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు ఏమాత్రం తగ్గట్లేదని సర్వేలో తేలింది. భారతీయులు ఏడాదికి 700-900 టన్నుల వరకు బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. చెప్పాలంటే బంగారం వినియోగంలో భారత దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. బంగారం నిల్వలను, కొనుగోళ్లను భారతీయ వివాహ వ్యవస్థ పెంచుతోంది. ఈ క్రమంలో 18వేల టన్నుల బంగారాన్ని భారతీయులు ధరించుకుని తిరుగుతున్నారని సర్వే తేల్చింది. దీని విలువ అక్షరాల 60 లక్షల కోట్లు. అమెరికా, యూరప్, స్విజ్ బ్యాంకుల కంటే భారత రిజర్వ్ బ్యాంక్‌ ఇతరత్రా బ్యాంకుల్లో దాచే బంగారాన్ని లెక్కకు తీసుకోకుండా, గృహస్థుల వద్ద మాత్రం 950 బిలియన్ డాలర్ల విలువైన బంగారం ఉంటుందని అంచనా
అయితే బంగారం పెట్టుబడుల వెనుక పెద్ద ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పటికీ భారతీయ కుటుంబాలు బంగారాన్ని అమ్ముకునేందుకు ఇష్టపడట్లేదని, అందుకే భారత్‌లో బంగారం నిల్వ శాతం పెరిగిపోతోందని సర్వే తెలిపింది. రూపాయి బలహీన పడటానికి బంగారు వినియోగం పెరగడమే కారణమని, ముడిచమురు, క్యాపిటల్ గూడ్స్ తర్వాత భారత్ బంగారాన్నే అధికంగా భారత్ దిగుమతి చేసుకుంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
డీమానిటైజేషన్ తర్వాత అతిపెద్ద గోల్డ్ ఈటీఎఫ్ ప‌థ‌క‌మైన ఎస్‌పీడీఆర్ నుంచి గ‌త నెల రోజులుగా ఇన్వెస్ట‌ర్లు 75 ట‌న్నుల బంగారానికి స‌మాన‌మైన పెట్టుబ‌డుల‌ను వెన‌క్కు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌న దేశంలో అన్ని ర‌కాల బంగారం కొనుగోళ్లు బాగా ప‌డిపోయాయి. దీంతో ఈ సంవ‌త్స‌రం కూడా బంగారు దిగుమతులు 500 ట‌న్నులు మించ‌క‌పోవ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.  డాల‌ర్ ప్ర‌భావం డాల‌ర్ ప్రభావం అంత‌ర్జాతీయ మార్కెట్లో బంగారం ధ‌ర‌ల‌ను డాల‌ర్ల మార‌కంలో నిర్ణ‌యిస్తారు. ఇత‌ర క‌రెన్సీల‌తో పోలిస్తే డాల‌ర్ విలువ పెరిగితే బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయి. డాల‌రు మార‌కం విలువ బ‌ల‌హీన‌ప‌డితే బంగారం పెరుగుతుంది.
శుభ సూచికకు చిహ్నం  బంగారం... బంగారమంటే ఒక అభిమానం... ఒక ధైర్యం... ఒక భరోసా... ఒక ధీమా... బంగారం లాంటి జీవితం... బంగారం లాంటి మనిషి... బంగారం లాంటి వ్యవస్థ... బంగారాన్ని ఇలా అనేక విధాలుగా మనం పిలుచుకుంటాం... అంతెందుకు ఎవరైనా పోటీలో విజేతగా నిలిస్తే బంగారు పతకాన్ని బహూకరిస్తాం... ఇంతట మహిమాన్వితమైన బంగారం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం... బంగారానికి బంగారమే సరిపోతుంది. బంగారం లాంటి మాట చెప్పావ్ అంటారు... బంగారం అంటూ వ్యక్తులను పిలుచుకుంటారు... బంగారంతో తయారైన కప్పులను గిఫ్టులుగా ఇస్తారు. ఆయా రాజుల పాలన సువర్ణయుగంగా పిలుస్తారు. బంగారంతో తయారు చేసిన ట్రోఫీలను బహూకరిస్తారు. ఒలింపిక్స్ తో గెలిచిన వారికి గోల్డ్ మెడల్స్ ను ఇస్తారు. కొంత మంది విగ్రహాలకు బంగారపు పూత పూస్తారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, ఎమ్మీ అవార్డులు, బ్రిటీష్ అకాడెమీ అవార్డులు అన్నీంట్లో కూడా బంగారపు పూత ట్రోఫీలను అందిస్తారు.
ప్రఖ్యాత అర్ధశాస్త్ర నిపుణులు అరిస్టాటిల్ సైతం కొన్ని విషయాల్లో బంగారు భావన పదాన్ని ఉపయోగించారు. యువతకు బంగారు భవిత రాబోతుదంటూ అభివర్ణిస్తారు. అభివృద్ధి సూచికగా కూడా బంగారాన్ని కొలుస్తారు. కాపురం బంగారంలా ఉందని... మా పిల్లల జీవితాలు బంగారంగా ఉన్నాయంటూ కూడా చెప్తారు. గోల్డెన్ ఇయర్స్, గోల్డెన్ ఏజ్ అంటూ జీవిత ఘట్టాలను వివరిస్తారు. క్రైస్తవంలోనూ, జూడాయిజంలోనూ బంగారం దైవత్వంతో కూడినదని చెబుతారు. అంతెందుకు పెళ్లిళ్లలోనూ, ఎంగేజ్మెంట్ల సందర్భంగానూ బంగారు ఉంగారాలను తొడుగుతారు. బంగారు కీరిటమంటూ కీర్తిస్తారు. గోల్డెన్ ఛాన్స్ అంటూ అవకాశం గురించి చెబుతారు. గెల్డెన్ అవర్ అని వ్యక్తి ప్రాణాన్ని నిలెబట్టే సమయంగానూ చెప్తారు. మొన్నటి వరకు భారత్ నెంబర్ వన్... ఇప్పుడు గోల్డ్ వినియోగంలో చైనా నెంబర్ వన్...  బంగారానికి తుప్పు పట్టదు... చిలుము పట్టదు...  బంగారం బంగారమే...

బంగారం... బంగారమే. బంగారం ఎల్లప్పుడూ నిలిచే ఉంటుంది. బంగారంతో సాటి గల వస్తువు ఇంత వరకు భూమిపై లేదు. బంగారం కంటే ఖరీదైన వస్తువులున్నప్పటికీ బంగారం మంది అవి దిగదుడుపే.  బంగారంతో ఏదీ కూడా సరిసమానం కాదు. గత రెండేళ్లుగా బంగారం దిగుమతులు భారత్ లో తగ్గినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా బంగారంపై క్రేజ్ పెరుగుతూనే వస్తోంది. అయితే 2017లో తిరిగి భారతదేశంలోనూ పెద్ద ఎత్తున దిగుమతులు పెరుగుతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారంపై భారీగా ప్రభావం చూపినప్పటికీ అది ఈ ఏడాది చివరకు పుంజుకుంటుందన్న అంచనాను పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయ్. ఇదీ ఇవాళ్టి స్పెషల్ రిపోర్ట్

No comments:

Post a Comment