సామ దాన భేద దండోపాయాలతో చిన్నాచితకా దేశాలను తన ఉక్కుపిడికిట్లో బంధించడం జనచైనాకు ఆది నుంచీ అలవాటు. తాను స్వాయత్తం చేసుకొన్న టిబెట్‌కు- భూటాన్, లడఖ్, నేపాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అయిదూ చేతివేళ్లు అని చైనా విశ్వసిస్తున్నట్లు చరిత్రకారులు చెబుతుంటారు! కాబట్టే 1998 దాకా భూటాన్‌ను సర్వసత్తాక దేశంగా చైనా గుర్తించలేదు. చైనాతో భూటాన్‌కు ఉత్తర దిశగా రెండు చోట్ల, నైరుతి దిక్కున డోక్‌లామ్ పరగణాకు సంబంధించీ దశాబ్దాలుగా భూవివాదాలున్నాయి. ఆర్థిక సంస్కరణల దరిమిలా భారత్ పుంజుకొంటోందని గ్రహించి డోక్‌లామ్ పరగణాను తనకు అప్పగించేస్తే, ఉత్తర దిక్కు భూమిపై హక్కుల్ని వదులుకొంటామని 1996లోనే భూటాన్‌కు చైనా ప్రతిపాదించింది. ఇప్పటికి ఇరవై నాలుగు పర్యాయాలు జరిగిన చర్చల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండగా- భారత్ నుంచి భూటాన్‌ను దూరం చెయ్యడానికి డ్రాగన్ శతథా ప్రయత్నిస్తూనే ఉంది. టిబెట్‌తో పాటు తనను కూడా చైనా కబళిస్తుందేమోనన్న బెదురుతో భూటాన్ 1949లోనే ఇండియాతో స్నేహ ఒప్పందం కుదుర్చుకొంది. భారత్ మార్గదర్శకత్వంలోనే భూటాన్ తక్కిన ప్రపంచ దేశాలతో దౌత్యసంబంధాలు ఏర్పరచుకోవాలని, జాతీయ ప్రయోజనాలకు సంబంధించి పరస్పరం సన్నిహిత సహాయ సహకారాలతో మెలగాలని ఒడంబడిక నిర్దేశిస్తోంది. వాస్తవానికి చైనా పక్కా రహదారి నిర్మాణానికి తెగించిన భూభాగం భూటాన్ పరిధిలోనిదే అయినా, మిత్రధర్మాన్ని మన్నించి, అంతకుమించి సిలిగురి క్యారిడార్ దాకా చైనా చొచ్చుకురావడం స్వీయభద్రతకు పెనుముప్పుగా భావించీ- ఇండియా అక్కడ తన దళాల్ని మోహరించింది. భారత్, చైనా బలగాలు రెండూ నిష్క్రమించి యథాపూర్వ స్థితి నెలకొంటేనే కదా... శాంతి చర్చలు ప్రారంభించగలిగేది!
ఇండియాకు ప్రధానంగా ముప్పు చైనా నుంచే పొంచి ఉందని పందొమ్మిదేళ్ల క్రితం రక్షణమంత్రిగా జార్జి ఫెర్నాండెజ్ బహిరంగంగా చేసిన ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ‘ముత్యాలహారం’ మాదిరిగా ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో పాగా వేస్తున్న చైనా- టిబెట్‌లో అణ్వస్త్ర నిల్వలు పెట్టి, మియన్మార్‌లో లక్షల మంది సైన్యానికి సాయుధ శిక్షణ గరపుతోందన్న ఫెర్నాండెజ్ ఆనాటి వ్యాఖ్యలు, గుర్తించి తీరాల్సిన ప్రమాద సంకేతాలుగా నేడు కళ్లకు కడుతున్నాయి. 440కోట్ల మంది జనావళి ఉజ్జ్వల భవిత కోసమంటూ చైనా నాయకగణం మొదలుపెట్టిన ఒకే బెల్టు-ఒకే రోడ్డు (ఓబీఓఆర్) ప్రాజెక్టు లోగుట్టుమట్లను పసిగట్టిన ఇండియా, భూటాన్లు అందులో భాగస్వామ్యానికి ససేమిరా అన్నాయి. ఆ కడుపుమంటతోనే చైనా సిక్కిం సరిహద్దుల్లో తాజా వివాద కుంపటి రాజేసింది. మిత్ర దేశమంటూ భూటాన్ పక్షాన భారత్ బలగాల్ని దింపితే పాకిస్థాన్‌కు దన్నుగా కశ్మీరులో తమ సైన్యం కాలిడవచ్చునంటూ చైనా మీడియా మంటల్ని ఎగదోస్తోంది. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహిస్తామన్న బీజింగ్ తాజా ప్రతిపాదన ఇండియాను ఇరుకున పెట్టే వ్యూహంలో అంతర్భాగం. దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై శివాలెత్తిపోవడం, సిక్కిం స్వాతంత్య్రాన్ని ప్రస్తావించడం చైనా ఆభిజాత్య దురహంకారం! టిబెట్, తైవాన్, దక్షిణ చైనా సముద్రాల వివాదంపై చైనా సార్వభౌమత్వమంటూ ఒంటి కాలిమీద లేచే బీజింగ్- డోక్‌లామ్ పైనా అదే పదబంధంతో విరుచుకుపడుతోంది. అంతర్జాతీయ వేదికలపై చైనా మకురుతనాన్ని, విస్తరణ కాంక్షల చీకటి కోణాల్ని ఎండగట్టి, నిప్పులు చిమ్ముతున్న డ్రాగన్‌ను గట్టిగా నిలువరించే వ్యూహానికి మోదీ సర్కారు సానపట్టాలి. జాతి భద్రతతో ముడివడిన ఈ కీలకాంశంలో అఖిల పక్షాలూ ఒక్కతాటిపైకొచ్చి కేంద్రానికి దన్నుగా నిలవాలి!
No comments:
Post a Comment