Friday, 14 July 2017

ఆంధ్రజ్యోతి వర్సెస్ వైసీపీ, సాక్షి మీడియా



( ) ఎన్నికలకు రెండేళ్ల ముందే ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయ్. వైసీపీ అధినేత జగన్ పై ఆంధ్రజ్యోతి సంధించిన కథనాలు కాక పుట్టిస్తున్నాయ్. జగన్-మోదీ భేటీ ఇప్పుడు రచ్చకు కారణమవుతోంది. జగన్ కేసుల గురించి మోదీని కలిశారంటూ ఆంధ్రజ్యోతిలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయ్. అయితే తాను మోదీని కలిసింది రాష్ట్ర సమస్యలపైనేనని... కావాలని తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఆ మీడియా కుట్ర చేస్తోందంటూ జగన్ పార్టీ, ఆయన మీడియా సాక్షి విరుచుకుపడ్డాయ్. మోదీతో జగన్ భేటీ తర్వాత... ఆంధ్రజ్యోతి పత్రిక అసత్య ప్రచారం చేస్తోందంటూ జగన్ పార్టీ మండిపడుతోంది. ఆంధ్రజ్యోతి పత్రిక, టీవీ చానెల్ ను బహిష్కరిస్తున్నట్టు  ఆ పార్టీ ప్రకటించింది.  మోదీ-జగన్ భేటీ తర్వాత పరిణామాలపై ఆంధ్రజ్యోతి చెబుతుందేంటి? జగన్ పార్టీ, సాక్షి ఇస్తున్న వర్షనేంటి?
వైసీపీ అధినేత జగన్ ఈ నెల10న ప్రధాన మంత్రితో భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్రంలోని సమస్యల గురించి ప్రస్తావించానని... చంద్రబాబు అవినీతిపైనా, అగ్రిగోల్డ్ అక్రమాలపైనా ఫిర్యాదు చేసినట్టుగా జగన్ బయటకు వచ్చి మీడియాకు వివరించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా కోరానన్నారు. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈనెల 15న ఆంధ్రజ్యోతి పత్రిక  'అమ్మా జగనా' అంటూ ఓ కథనం వచ్చింది. జగన్... మోదీతో భేటీ అయ్యింది ఈడీ కేసులకు సంబంధించి ప్రధానికి విజ్ఞప్తి చేసుకోడానికేనని...  పత్రికలో ప్రధాన కథనాన్ని అందించింది. ప్రధానిని కోరింది ఒకటి... బయటకు చెప్పింది మరోటి అంటూ కథనాన్ని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. మోదీతో భేటీ తర్వాత ఖుషిఖుషీగా ఉన్న వైసీపీ... ఆంధ్రజ్యోతి కథనంతో అవాక్కైంది. ఆంధ్రజ్యోతి కథనంపై అటు వైసీపీ, ఇటు సాక్షి పత్రికల కౌంటర్ ఎటాక్ ఇచ్చాయ్. పనిలోపనిగా...  ఆంధ్రజ్యోతి పత్రికను, ఏబీఎన్ న్యూస్ చానెల్ ను బహిష్కరిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ఆంధ్రజ్యోతి పత్రిక తమ పార్టీ అధినేతను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోందంటూ వైసీపీ ఆరోపించింది. మీరీ ఇంత దారుణామా అంటూ సాక్షి పత్రిక మంగళవారం కథనాన్ని అందించింది. ఓ మీడియా సంస్థ జరగనిది జరిగినట్లుగా చిత్రీకరించిందని జగన్ సైతం విమర్శించారు. తోక పత్రిక గారడీ గుట్టు అంటూ సాక్షి కథనాన్ని ఇచ్చింది. ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లోని కొందరు అధికారులు చంద్రబాబుతో కుమ్మక్కై తనపైనా, తన కుటుంబం సభ్యులపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నందున వారిపై చర్యలు తీసుకోవాలని 17-02-2017న వైఎస్ జగన్ ప్రధానికి లేఖ రాశారని... ఆ లేఖ మొదటి, చివరి పేజీలోని భాగాలంటూ పత్రిక ప్రచురించింది. అదే సమయంలో ప్రధాని కార్యాలయానికి జగన్ రాసిన  లేఖపై చర్యలు తీసుకోవాలని...  ఈడీ, డీవోపీటీ అధికారులను కోరుతూ... 13-04-2017న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాసిన లేఖ అంటూ సాక్షి కథనాన్ని ఇచ్చింది.  అదే సమయంలో ప్రధాన మంత్రి మోదీని కలిసినప్పుడు ఇచ్చిన విజ్ఞాపనకు సబంధించిన లేఖను ప్రచురించింది. ఏపీకి ప్రత్యేక హోదా, ఫిరాయింపులు, అగ్రిగోల్డ్, మిర్చి ధర గురించి 10-05-2017న లేఖలో వివరించినట్టుగా సాక్షి పేర్కొంది. మూడు లేఖలను వరుసగా ఇస్తూ... తోక పత్రిక గారడీ గుట్టు అంటూ ప్రచురించింది. జగన్ ఎప్పుడో రాసిన లేఖను తాజా భేటీతో ముడిపెట్టారంటూ వార్తను అందించింది.

అదే సమయంలో వైసీపీ ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానెల్ ను బహిష్కరిస్తున్నట్టుగా  వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. నిస్సుగ్గుగా ఆంధ్రజ్యోతి పత్రిక దిగజారుడు కథనాలు ప్రచురిస్తుందని... వైఎస్ జగన్ లేఖను తారుమారు చేసి క్రిమినల్ మైండ్ కథనాలను ఇస్తోందని...  విమర్శించింది. తప్పుడు వార్తలు రాసినందుకు లీగల్ నోటీసులిస్తామంటూ  ప్రకటించారు. అయితే టీడీపీ కార్యక్రమాలకు సంబంధించి జగన్ మీడియాపైనా బహిష్కరణ కొనసాగుతోంది. తాజాగా ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానెల్ పై సాక్షి సైతం బహిష్కరించింది.
మరోవైపు ఆంధ్రజ్యోతి పత్రిక మంగళవారం  సైతం మరో కథనాన్ని అందించింది.  ఉలికిపాటు... కప్పదాటు అంటూ కథనాన్ని ప్రచురించింది. ఫిబ్రవరి లేఖను పట్టించుకోని కేంద్రం... ఈడీపై జగన్ ఫిర్యాదు పెట్టుకున్నాకే కదలిక మొదలైందంటూ ఇచ్చింది. ఈడీ తనను వేధిస్తుందని మోదీ ముందు మొర పెట్టుకున్నారా లేదా... అంటూ కథనాన్ని పేర్కొంది. వాస్తవాలను దాచిపెడ్తున్నారంటూ విమర్శించింది.
ఇదీ వరస... అటు ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ టీవీ చానెల్... ఇటు సాక్షి మీడియా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్టుగా కన్పిస్తోంది. తనను అప్రదిష్టపాల్జేసేందుకు సీనియర్ జర్నలిస్ట్ వేమూరి రాధాకృష్ణ నిర్వహిస్తున్న ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానెల్ ఇష్టానుసారం కథనాలను ప్రసారం చేస్తున్నాయని జగన్ పార్టీ  చాన్నాళ్ల నుంచి విమర్శలు చేస్తోంది. అయితే తాజాగా మోదీని కలిసిన తర్వాత జగన్ పార్టీకి వస్తున్న మైలేజ్ ను తట్టుకోలేకే ప్రజల్లో అనుమానాలు కలిగేలా కథనాలు అందిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
టీడీపీకి వత్తాసు పలుకుతున్న అధికారులపై ప్రధాని మోదీకి జగన్ ఫిర్యాదు చేశారన్న జగన్ పార్టీ... ఇప్పడు టీడీపీకి మద్దతిస్తూ... తమను భ్రష్టు పట్టిస్తుందన్న ఆరోపణలతో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానెల్ పై నిషేదం విధించింది.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కొన్నాళ్లూ మీడియా వార్ నడిచింది. అది కొన్నాళ్ల తర్వాత సద్దుమణిగింది. ఏపీలోనూ కొన్ని మీడియా సంస్థలపై తాత్కాలికంగా నిషేదం జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు ఏపీలో మొదలైన వార్ వచ్చే రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.... 

No comments:

Post a Comment