ఆంధ్రప్రదేశ్ లో యుద్ధం మొదలైంది. ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది. చంద్రబాబును ఢీ కొట్టే కార్యాచరణతో జనంలోకి దూసుకెళ్లేందుకు జగన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. చంద్రబాబు చెప్పిన హామీలను నిలబెట్టుకోరంటూ పదేపదే విమర్శిస్తున్న జగన్... బాబు సర్కారు ఇప్పుడు చేస్తున్న అనేక పథకాలపై సరికొత్త క్లారిటీ ఇచ్చే పనిచేశారు. ఓవైపు నిధులు సంక్షోభంతో తల్లడిల్లుతున్న ఏపీలో జగన్ మాత్రం సంక్షేమ వరద పారిస్తానంటున్నారు. నాడు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పథకాలను ప్రకటించిన చంద్రబాబు... ఎన్నికల తర్వాత... పథకాల అమలు విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రాన్ని 30 ఏళ్లు పాలించాలన్న కోరిక ఉందంటూ అసలు విషయాన్ని ప్లీనరీ వేదికా చెప్పుకొచ్చాడు. ఏపీలో ఇప్పటికే బలమైన అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు ఓవైపు సంక్షేమ పథకాలు మరోవైపు పాదయాత్ర... ఇంకోవైపు ఎన్నికల ఎక్సపర్ట్ పీకేతో ప్రణాళికలు ఇవీ... వెరసి జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తయారు చేసుకుంటున్న సరంజామా... ఎన్నికల కోసం జగన్ అనుసరిస్తున్న వ్యూహాలేంటి? బాబు ప్రతివ్యూహాలేంటన్నదానిపై రాజ్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్
జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలుపు కోసం మూడంచెల సూత్రాన్ని అమలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బలతో రాటుదేలిన జగన్... ఈసారి ఎట్టి స్థితిలో పవర్ దక్కించుకోవాల్సిందేనన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. గురిచూసి కొడితే తప్ప ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని తెలుసుకున్న జగన్... అందుకు ముందస్తు ఏర్పాట్లలో బిజిబిజీగా ఉన్నారు.
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల నిర్వహణకు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ... అక్కడి పరిణామాలు... వేగంగా మారిపోతున్నాయ్. ఇప్పటికే రెండు వర్గాల మధ్య బలమైన పోరాటం జరుగుతున్న నేపథ్యంలో... అధికార పీఠాన్ని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు శతధా ప్రయత్నిస్తుంటే... పోయినచోటే వెదుక్కోవాలన్న ఆలోచనతో వైసీపీ అధినేత జగన్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో బాబు గెలుపు కోసం వదిలిన అస్త్రాలకు మరింత పదను పట్టి జనంలోకి వదిలారు జగన్. అక్టోబర్ 27నుంచి 3 వేల కి.మీ పాదయాత్ర నిర్వహించనున్నట్టు జగన్ ప్రకటించారు.
ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే యాత్ర... శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. రాష్ట్రంలో పాదయాత్రల సీజన్ మరోసారి ప్రారంభం కాబోతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఓదార్పు యాత్ర ద్వారా అన్ని జిల్లాలను చుట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పాదయాత్ర అంటూ మరోసారి జనం గుమ్మాల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. నాడు చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. చంద్రబాబుపై ఎన్నికల్లో వైఎస్ విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సర్కారును గద్దె దింపి... అధికారాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబు పాదయాత్ర చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2817 కి.మీ పాదయాత్రను 208 రోజుల పాటు చేశారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ 3 వేల కి.మీ పాదయాత్ర చేయనున్నట్టుగా ప్రకటించి సంచలనం సృష్టించారు. గతంలో జగన్ సోదరి సైతం 2819 కి.మీ పాదయాత్ర చేశారు. అధికారంలోకి రాగానే తమ పార్టీ చేపట్టబోయే 9 కార్యక్రమాలను జగన్ ప్రకటించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ ప్రణాళిక జోరందుకుంటున్న నేపథ్యంలో జగన్ మాత్రం అందుకు భిన్నంగా... రైతుల సంక్షేమం కోసం ప్రణాళికలను ఆవిష్కరించారు.
వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం కింద... 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ రూ. 50 వేలు అందిస్తామని చెప్పారు.
ఏటా మే నెలలో రూ.12 వేల 500 చొప్పున రైతులకు చెల్లిస్తామని... ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 86% మంది రైతులకు అంటే... 66 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని జగన్ తెలిపారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతోపాటు, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు రూ.2 వేల కోట్ల ఫండ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇక
రాష్ట్రంలో 89 మంది లక్షల డ్వాక్రా మహిళల కోసం వైఎస్‌ఆర్ ఆసరా పథకం ఏర్పాటు చేసి... మహిళల రుణాలను మాఫీ చేయడంతోపాటు... సున్నా వడ్డీకే రుణాలు అందిస్తామన్నారు.
వయో వృద్ధులకు నెలవారీ పెన్షన్ రూ. 1000 నుంచి రూ. 2 వేలకు పెంచుతామని తెలిపారు. పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి పథకం కింద
ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు రూ. 500 చొప్పున
ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు రూ. 750 చొప్పున, ఇంటర్ విద్యార్థులకు రూ.1000 చొప్పున నేరుగా తల్లికే నిధులు అందేలా కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని నిరు పేదల కోసం 25 లక్షల ఇళ్ల నిర్మిస్తామన్నారు. పేదల వైద్యం కోసం
ఆరోగ్యశ్రీకి అవసరమైన బడ్జెట్ అందిస్తామన్నారు. ఎన్ని నిధులు అవసరమయితే అన్ని నిధులు అందించడంతోపాటు... కుటుంబ పోషకుడు శస్త్ర చికిత్స చేయించుకుంటే... విశ్రాంతి సమయంలో పరిహారం ఇస్తామన్నారు. కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్ ఇస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తిగా అమలు చేస్తామన్నారు. ప్రతి పేద విద్యార్థికి ఖర్చుల కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటూ మరో కార్యక్రమాన్ని వివరించారు.
పోలవరం సహా అన్ని ప్రాజెక్ట్‌లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు.
మూడు దశల్లో మద్యనిషేధం అమలు చేస్తామన్నారు. మొదటిదశలో దుకాణాల సంఖ్య తగ్గించి... బెల్టుషాపులపై ఎత్తేస్తామని చెప్పారు. మద్యం ధరల భారీగా పెంచి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తామన్నారు.
రెండో దశలో పేద మధ్యతరగతికి అందుబాటులో లేకుండా చేస్తామన్నారు.
మూడో దశ లో త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అందుబాటులో
ఉండేలా చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామని వివరించారు జగన్. గత ఎన్నికల్లో ఎంతో సానుకూలతను జగన్ తనకు అనుకూలంగా మలచుకోవడంలో విఫలమయ్యారు. బాబు విచ్చలవిడిగా సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినప్పటికీ... జగన్ మాత్రం ఆచితూచి వ్యవహరించారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కార్యాచరణతో రంగం సిద్ధం చేసుకున్నారు. బాబును ఓడించాలంటే... సంక్షేమంలో నాలుగు ఆకులు ఎక్కువ చదువుకోవాలన్న ఆలోచనలోకి జగన్ వచ్చేశారు. అందుకే చంద్రబాబు ఎక్కడ విఫలమవుతున్నారో... అక్కడ విజయం సాధిస్తామంటూ జగన్ లెక్కలు వేసేసుకుంటున్నారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్సార్ అమలు చేసిన రీతిలో సంక్షేమాన్ని తీసుకెళ్తామంటూ జగన్ తేల్చిచెబుతున్నారు. తనకు 30 ఏళ్ల పాటు ఏపీ సీఎంగా కొనసాగాలన్న లక్ష్యం ఉందని... తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో కూడా పెట్టుకునేలా పాలన సాగిస్తానంటున్నారు. ఓవైపు సంక్షేమానికి తెరదీస్తూనే మరోవైపు పాదయాత్ర బాటను జగన్ పట్టారు. పాదయాత్ర గతంలో రెండు సార్లు క్లిక్కయ్యింది. ఒకసారి చంద్రబాబును ఓడించడంలో వైఎస్ విజయం సాధిస్తే... కాంగ్రెస్ పార్టీని, జగన్ ను తట్టుకొని నిలబడటానికి బాబు పాదయాత్ర చేశారు. రెండు పాదయాత్రలు గ్రౌండ్ లెవల్లో వర్కౌట్ అయ్యాయ్. అదే బాటలో ఇప్పుడు జగన్ కూడా పయనిస్తున్నారు. బాబు సర్కారు చెబుతున్న అసత్య ప్రచారాలను, పబ్లిసిటీ స్టంట్లను జనంలోకి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశమని... రాజన్న పాలన కావాలంటే తనకే ఓటేయాలన్న అభిప్రాయాన్ని జనంలో కలిగిస్తానంటున్నారు. ఈ రెండు అంశాలు నాణానికి ఒకవైపుతే మరోవైపు ఎన్నికల మాంత్రికుడు ప్రశాంత్ కిషోర్ తో గెలుపు తీరాలకు చేరుకోవచ్చని జగన్ తలపోస్తున్నారు. అందుకే పార్టీ నేతలందరికీ పీకేను పరిచయం చేసి... ఎవరికి ఎలాంటి సహాయం కావాలో కూడా అంచనా వేస్తున్నారు.
ప్లీనరీ వేదికపై రాష్ట్ర ప్రజలకు వైఎస్ ఫ్యామిలీతోనే భరోసా కలుగుతుందని అభిప్రాయాన్ని జగన్ కలిగించారు. తన పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుందో విడమర్చి చెప్పారు జగన్. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సర్కారు ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని... సంక్షేమమంటే వైఎస్ హయంలో జరిగింది మాత్రమేనని... తన తండ్రిలా సంక్షేమాన్ని ప్రజలు అందించాలంటే... వైసీపీకే ఓటేయాలంటూ జగన్ ప్లీనరీ వేదికగా కుండబద్ధలు కొట్టారు. ప్లీనరీ వేదికపై ఈసారి జగనన్న వదిలిన బాణం షర్మిల సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చే ఎన్నికల్లో షర్మిల సైతం రంగంలోకి దిగబోతున్న సంకేతాలను జగన్ ఇచ్చారు.
గత ఎన్నికల్లో గెలుపు ఎంత కష్టమైందో బాబుకు చాలా బాగా తెలుసు. ఎన్నికల్లో విజయం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో బాబుకు కళ్ల ముందు కన్పిస్తూనే ఉంటాయ్. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నో పథకాలను ప్రారంభించిన బాబు... అవే తన గెలుపుకు సోపానాలవుతాయన్న నమ్మకంతో ఉన్నారు. ఓవైపు పోలవరం, మరోవైపు రాజధాని నిర్మాణం రెండూ కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపు బాట పట్టిస్తాయని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నమ్మకంతో ఉన్నారు. మరోసారి తనదే విజయమన్న భావనలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉన్నారు. రాష్ట్రంలో చేస్తున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తనకు విజయం కట్టబెడతాయని నారా వారు ఊహల పల్లకిలో ఉన్నారు. ఇంతకంటే ఎవరూ కూడా ఏమీ చేయలేరని... తాను కాబట్టి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోగలుగుతున్నానన్న అభిప్రాయాన్ని బాబు జనంలోకి తీసుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగు కోసం ఎక్కని గడప, దిగని గడప అన్న తేడా లేకుండా కష్టపడతానున్నానని బాబు చెబుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని నిర్మాణం కోసం ఎంతగా శ్రమిస్తుందో కూడా బాబు ప్రజలకు అర్థమయ్యేలా విడమర్చి చెబుతున్నారు. ప్రపంచ దేశాలన్నింటిలో తిరిగి... పెట్టుబడులు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. భాగస్వామ్య సదస్సులు నిర్వహిస్తూ... ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల పారించాలన్న వ్యూహాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థిక లోటుతో సతమతమవుతున్నప్పటికీ... రూ. 24 వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేయడమంటే మామూలు విషయం కాదని బాబు పదేపదే చెబుతున్నారు. ఎన్నికల హామీలో భాగంగా రైతులను ఆదుకోవాలని రైతుల కోసం తాను లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేస్తున్నట్టుగా బాబు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రుణమాఫీ మూడు విడత వరకు మాత్రమే వచ్చింది. అయినప్పటికీ... రైతుల కోసం ప్రభుత్వం... లోటు బడ్జెట్లోనూ చేయూతనిస్తుందన్న అభిప్రాయాన్ని బాబు ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నికల్లో బాబు డ్వాక్రా మహిళల రుణాల మాఫీ గురించి కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్నారు. ఆ తర్వాత డ్వాక్రా మహిళలకు మూలనిధి పెట్టుబడి సమకూర్చుతున్నామంటున్నారు. అదే సమయంలో ఫీజు రీఇంబర్స్మెంట్ రూపంలో విద్యార్థులకు ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్యలకు ఫీజు చెల్లింపులను కొనసాగిస్తున్నమని టీడీపీ సర్కారు చెబుతోంది. ఎన్టీఆర్ వైద్య సేవతో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని... వైద్య చికిత్సతోపాటు, ఆరోగ్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నామని... పేదలకు ఇంతకంటే చేసేదేం ఉంటుందని సర్కారు స్పష్టం చేస్తోంది. అదే సమయంలో 45 లక్షల మంది వృద్ధులు, వితంతువుల కోసం నెలకు వెయ్యి రూపాయల పింఛన్ల అందిస్తున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. అప్పటి వరకు రూ. 200 గా ఉన్న పింఛన్ ను ఒకేసారి ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు ఇస్తున్నామని... ఇంత మొత్తంలో దేశంలో ఎక్కడా పింఛన్ల కార్యక్రమం లేదని సర్కారు ఘనం ప్రకటించుకుంటోంది. తెల్లకార్డు ఉన్న హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవలకు పండుగ కానుకలు ఇచ్చి సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చామని బాబు భావిస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు, ఉచిత విద్యుత్ అందించడం ద్వారా రైతుల జీవితాల్లో వెలుగులు నింపామని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. కరువు విలయతాండవం చేస్తున్న సమయంలోనూ పంటలకు రక్షిత తడులు అందించామని, పట్టిసీమ ప్రాజెక్టును ఏడాది కాలంలో పూర్తి చేసి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రైతుల పంటలను కాపాడామని సర్కారు వివరిస్తోంది. ఇక కాపులకు వెయ్యి కోట్లతో కార్పోరేషన్ ద్వారా అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని... పేద కాపులకు విద్యా, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ... మరెవరికీ సాధ్యం కానీ రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం వివరిస్తోంది. ఇక కేంద్రం నిర్వహించాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం తీసుకొని శరవేగంగా పనులను కానిస్తుందని... 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి 13 జిల్లాలకు తాగునీరు, సాగునీటికి సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం నుంచి నిధుల రావడం ఆలస్యమవుతున్నా... తాము మాత్రం రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధలను కేటాయిస్తున్నామంటోంది. ఇక రాజధాని ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా గుర్తించి ఇప్పటికే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలను పూర్తి చేసింది. త్వరలోనే రాజధాని నిర్మాణ ఆకృతులను ఖరారు చేసిన... రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తామంటూ బాబు సర్కారు స్పష్టం చేస్తోంది. ఇంతకంటే ఎవరైనా ఏం చేస్తారన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది.
బాబు సర్కారు మీద రాజకీయంగా ఉన్న అతిపెద్ద సవాలు కాపు రిజర్వేషన్లు. ఇప్పటికే కాపు రిజర్వేషన్లకు సంబంధించి బీసీ కమిషన్ నివేదక కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వం... 2019 ఎన్నికల్లో కాపు రిజర్వేషన్ల ఫలాలను ఆ ప్రజలకు అందించి... రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూస్తోంది. అయితే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే... బీసీల నుంచి ప్రతిఘటన రాకుండా చూసుకోవాలన్న ఉద్దేశంలో కూడా బాబు సర్కారు ఉంది. చాలీచాలని నిధులతో పాలన సాగిస్తున్నా... చేయగలిగినదానికంటే ఎక్కువ చేస్తున్నామన్న అభిప్రాయాన్ని సర్కారు ఇస్తోంది. నాడు చంద్రబాబు సర్కారుపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని పాదయాత్ర ద్వారా వైఎస్సార్ తనకు అనుకూలంగా మలచుకున్నాడు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనతో విసిగిపోయిన ప్రజలను చంద్రబాబు పాదయాత్ర ద్వారా చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లడంతోపాటు... విభజన తర్వాత వైసీపీని ఎదుర్కొనేందుకు తలపండిన చంద్రబాబు అనేకరకాలుగా సమరం సాగించి విజయం సాధించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విసిరిన సవాలుకు... మరికొన్ని అస్త్రాలను జనంలోకి వదలాలన్న భావనలో బాబు ఉన్నారు. 2009లో మహాకూటమి గట్టి... బాబు ఎన్నో హామీలిచ్చినప్పటికీ... వైఎస్ మాత్రం... చేస్తున్న కార్యక్రమాలను మరింత పకడ్బంధీగా అమలు చేస్తానని మాత్రమే చెప్పేవారు. ఆల్ ఫ్రీ బాబును నమ్మొద్దనేవారు వైఎస్. ఇప్పుడు ప్రతిపక్ష జగన్ పార్టీ సంక్షేమ పథకాలకు చంద్రబాబు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.
ఒకటి మాత్రం నిజం. చంద్రబాబునాయుడు జనంలో ఇప్పుడు తనకో ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. జగన్ తనకు ఎంత మాత్రం సరిపోరని... తన అనుభవమే... ఏపీ అభివృద్ధికి పెట్టుబడిగా పెడుతున్నానని బాబు భావిస్తున్నారు. తనకు అనుకూలమైన ప్రాంతంలో కూర్చొని పాలన సాగించడం వల్ల... తన సామాజికవర్గం నుంచి కూడా తనకు గట్టి మద్దతు లభిస్తుందని బాబు నమ్మకంగా ఉన్నారు.
అనుకూలంగా ఉన్న పరిణామాలను మరింత అనుకూలంగా మలచుకోవడం... ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను అనూకులంగా మలచుకోవడంలో బాబును మించినవారు మరొకరు ఉండరు. అది ఎన్నోసార్లు రుజువైంది. అది ఎన్టీఆర్ నుంచి ప్రభుత్వ పగ్గాలు దక్కించుకోవడం కానీ... బీజేపీతో జట్టు కట్టి 2014లో తిరిగి అధికారాన్ని దక్కించుకోవడం గానీ... బాబు గారు రూటే సెపరేటు. గెలవడానికి బాబు చేసే జిమ్మిక్కులు మరెవరికీ చేతకావంటే ఆశ్చర్యపోవాల్సిందే... ! నాటి పరిస్థితులు నేడు ఉన్నాయా? విభజన తర్వాత పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకోవాలని ఆరాటపడ్డ ఇద్దరు నేతల్లో సీనియారిటీని విజయం వరించింది. ఓవైపు బీజేపీతో జట్టుకట్టడం... మరోవైపు పవన్ కల్యాణ్ ను తనకు మద్దతుగా నిలబెట్టుకోవడం... ఇలాంటి ఎన్నో ట్విస్టులు... 2014 ఎన్నికల్లో టీడీపీ విజయానికి ఎన్నో కారణాలుగా నిలిచాయ్. అదే సమయంలో రైతు రుణమాఫీ సైతం చంద్రబాబుపై రైతుల్లో నమ్మకం కలిగించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుకు చంద్రబాబు రుణమాఫీ సంజీవనిలా కన్పించింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి రైతు రుణమాఫీ చేయడం అసాధ్యమంటూ కుండబద్ధలు కొట్టడం మనకు తెలిసిందే. బాబు రుణమాఫీ చేస్తానంటుంటే... జగన్ వద్దంటున్నాడేంటన్న అభిప్రాయం కూడా జనంలో కలిగింది. మొత్తం బాబు రుణమాఫీ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు కురిపించింది. బాబుకు రుణమాఫీతోపాటు రాష్ట్ర విభజన కూడా కలిసొచ్చిందని చెప్పొచ్చు. బయటకు సమైక్యవాదాన్ని విన్పించినప్పటికీ... రాష్ట్ర కలిసు ఉంటే... చంద్రబాబు అధికారం దక్కించుకోవడం కలగా మిగిలిపోయేది. రాష్ట్రం విడిపోవడం వల్లే తెలుగుదేశం పార్టీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో విజయం సాధించింది. నాడు ఎన్నికల్లో గెలవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య పల్లవి అందుకున్నప్పటికీ... ఎన్నికల్లో పూర్తి స్థాయి ఫలితాలను రాబట్టలేకపోయింది. రెండు కళ్ల సిద్ధాంతమంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన బాబు...తర్వాత ఏపీకి కాంగ్రెస్ పార్టీ అన్యాయమంటూ గర్జించారు. బాబు ఎన్నికల చతురత ముందు జగన్ నిలువలేకపోయాడని చెప్పవచ్చు. ఓవైపు ఎన్నికల్లో గెలిచేందుకు వరాలిస్తూనే... మరోవైపు గెలుపు కోసం బాబు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాడు. జగన్ మాత్రం గెలుపు నాదేనన్న ధీమాలో ఉండి... ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తనకు దన్నుగా ఉన్న మైనార్టీలు, ఎస్సీ ఓట్లు ఎక్కడ పడవోనన్న బెంగ జగన్ లో ఉండేది. ఎన్నికలయ్యాక చూస్తామంటూ గొప్పలు పోయాడన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే అదే సమయంలో చంద్రబాబు... తనతో పొత్తు పెట్టుకుంటే ఎంపీ స్థానాల్లోనూ తేలిగ్గా గెలవొచ్చన్న సంకేతాలను బీజేపీకి అందించారు. అదే సమయంలో జనసేన పార్టీ అంటూ ప్రారంభించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మద్దతు బాబు పొందగలిగారు. పవన్ కల్యాణ్ టీడీపీ నేతల కోసం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా... తన సామాజికవర్గం బలంగా ఉన్న రెండు జిల్లా్ల్లో టీడీపీకి మంచి ఫలితాలు రాబట్టడంలో విజయం సాధించాడు. అదే సమయంలో జగన్ మాత్రం గెలుపు తనదేనన్న ధీమాలో చేసిన చిన్న చిన్న తప్పులను చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకున్నాడు. నాడు చాలా మంది రాయలసీమ నాయకులు జగన్ ఇంటి ముందు క్యూ కడితే వారెవరినీ కూడా పట్టించుకోలేదన్న అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. వారంతా తర్వాత టీడీపీలో టికెట్లు దక్కించుకొని ఎన్నికల్లో విజయం సాధించడాన్ని చాలా మంది గుర్తుచేస్తున్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న ఒక మంత్రి సైతం తన గ్యాంగ్ అంతటినీ పార్టీలోకి తెస్తానంటూ జగన్ తో రాయబారం కుదిర్చినప్పటికీ... ఆయన పెద్దగా స్పందించలేదన్న అభిప్రాయం నాడు మీడియాలో చక్కర్లు కొట్టింది. వారంతా టీడీపీలో చేరడంతోపాటు, ఎన్నికల్లోనూ విజయం సాధించిన పరిస్థితిని ఒక్కసారి అంచనా వేయాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో స్థానం సంపాదించలేకపోయిన పలువురు నేతలు... టీడీపీలో చేరి... ఆ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించి మంత్రులుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా ఎన్నికల్లో చంద్రబాబుపై జగన్ వెనుకబడిపోవడానికి ఎన్నో కారణాలను చెప్పుకోవచ్చు. గతంలో చెప్పినట్టుగా... ఎన్నికల్లో గెలవడం ఎంత తేలికో... ఓడిపోవడం కూడా అంతే తేలికన్నది... జగన్ కు ఈ ఐదేళ్లలో బోధపడిందని చెప్పవచ్చు. రాజకీయాలంటే వ్యాపారమన్న భావనలో జగన్ ఉండేవారన్న అభిప్రాయాన్ని నాడు... జగన్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన అనేక మంది నేతలు చెప్పేవారు. వ్యాపారంలో విజంయ సాధించడమన్నది కొన్ని కారణాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే రాజకీయాల్లో విజయం సాధించడమన్నది సవాలక్ష పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సూత్రాన్ని ఇప్పుడు జగన్ తెలుసుకున్నారనుకోవాలి. అందుకే... అన్ని వైపుల నుంచి చంద్రబాబు సర్కారుపై సమరానికి సిద్ధమయ్యారు. దేశ వ్యాప్త పరిస్థితులు కూడా ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం కన్పిస్తోంది. మోదీ వన్ నేషన్ వన్ ఎలక్షన్లంటూ ఫీలర్లు ఇప్పటికే వదిలారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మోదీ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాలు బయటకు కన్పించని గందరగోళంలో ఉన్నాయ్. లోక్ సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగితే ఇబ్బందన్న అభిప్రాయం కూడా నేతల్లో ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ముందస్తుకు వెళ్తే వచ్చే లాభమేంటి? నష్టమేంటన్న ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయ్. అయితే బాబు మాత్రం బీజేపీతో కలిసే ముందుకు సాగాలనుకుంటున్నట్టుగా పలు సార్లు స్పష్టత ఇచ్చారు. అయితే బీజేపీతో వైసీపీ సైతం సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. బీజేపీ ఢిల్లీలో తమకు బలాన్ని పెట్టుబడికగా చూపించి ఏపీలో మరింత వాటా కోసం గట్టిగా డిమాండ్ చేసే అవకాశం సుస్పష్టం. ఇలాంటి పరిస్థితుల్లో జరిగే రాజకీయ ఘర్షణ కూడా ఏపీ పాలిటిక్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటి వరకు రాజకీయ సన్నద్ధతను ఎంత మాత్రం ప్రకటించలేదు. పార్టీ నిర్మాణం కూడా అనుకున్నంత వేగంగా ముందుకు కదలడం లేదు. నాయకులు కూడా ఎవరూ జనసేన వైపు అడుగులు వేస్తున్నట్టుగా కన్పించడం లేదు. తాజా సర్వేల్లోనూ పవన్ ప్రభావం అంతంత మాత్రమేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. పవన్ ప్రత్యేక హోదా విషయలో బీజేపీని దుమ్మెత్తిపోస్తున్నాడు. అదేసమయంలో టీడీపీ విషయంలో ఆతితూచి వ్యవహరిస్తున్నాడు. పొత్తుల కలయిక ఎలా ఉన్నా... జగన్ ను కట్టిడి చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. పొత్తుల మాంత్రికుడు ప్రశాంత్ కిషోర్ జగన్ విషయంలో ఎలాంటి పాచిక విసురుతాడో వేచి చూడాలి.
గత ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలి... తెలుగు ప్రజల అభిమానం చూరగొనాలి. ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవాలి. 30 ఏళ్ల సీఎంగా కొనసాగాలి. ఇది వైసీపీ అధినేత జగన్ వైసీపీ ప్లీనరీ సందర్భంగా చేసిన నినాదం. అయితే చంద్రబాబు సర్కారు మాత్రం తమను ఓడించడం జగన్ కు సాధ్యం కాదంటోంది. బాబు బాట ఇప్పుడు ఏపీకి శ్రీరామ రక్ష అంటోంది. ఎన్నికల్లో విజయమంటే పీకేలు, కులాల లెక్కలే కాదు. మరెన్నో ఉన్నాయంటోంది. అయితే బాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒక వర్గం వారికే ఎక్కువగా అందుతున్నాయని... వాటి వల్ల మరో వర్గం ప్రజల్లో ధీమా లేదన్న అభిప్రాయమూ ఉంది. అదే వైఎస్సార్ కు, బాబుకు మధ్య తేడా అని... అందుకే తనను గెలిపించాలంటూ జగన్ ఏపీ ఓట్లను కోరుతున్నాడు.
No comments:
Post a Comment