Friday, 14 July 2017

డీఎస్ భూదాహం


అధికారం మీ కేరాఫ్ అడ్రస్ అయితే వారు మీకు వొంగి వొంగి సలామ్ చేస్తారు. చట్టం వీరికి ఇష్టమొచ్చినట్టుగా ఫ్లెక్సీగా మారుతోంది. సామాన్యులకు చట్టం చట్టంలానే పనిచేస్తోంది... అయితే అసామాన్యులకు  మాత్రం చుట్టమైపోతోంది. అధికార పార్టీ నేత డి శ్రీనివాస్ వ్యవహారంలోనూ ఇదే జరిగింది. ప్రభుత్వ భూముల పేరుతో ఎవ్వరికీ కూడా రిజిస్టర్ చేయని భూములు మన ఘనత వహించిన నాయకుడికి మాత్రం దర్జాగా రిజిస్ట్రేషన్ చేసేస్తారు.  
తెలంగాణలో భూకంప తీవ్రత సునామీలా మారుతోంది. ఏవైపు నుంచి ఏ సంక్షోభం వస్తుందో అర్థం కాక అధికార పార్టీకి వణుకిపోతోంది. ఇప్పటికే మియాపూర్ స్కామ్ ఆ తర్వాత కేకే భూముల వ్యవహారంతో ప్రభుత్వానికి తలబొప్పి కట్టగా... తాజాగా రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ భూమాయ ఇప్పుడు సంచలనం రెకెత్తిస్తోంది. డీఎస్ పేరు ఎప్పుడు ఎన్నికల సీట్లు కేటాయింపు సమయంలోనే బయటకు వచ్చేది. రెండుసార్లు పీసీసీ చీఫ్ గా ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరి... గులాబీ పార్టీలో చక్రం తిప్పుతూ భూస్కామ్ లో చిక్కుకున్నారు.  హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ అసైన్డ్ భూమిని డీఎస్ కొనుగోలు చేశారు. గతంలో ఈ భూమిని కొనుగోలు చేసేందుకు పలువురు ప్రయత్నించినా... అవి ప్రభుత్వ భూములని చెప్పిన అధికారులు... డీఎస్ కొనుగోలు చేసేసరికి... ఎస్ చెప్పేశారు.  మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామ పరిధిలోని గౌడవెల్లి - రాయిలాపూర్ రోడ్డులో సర్వే నెంబరు 221లో 8.9 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ... గిర్మాపూర్ గ్రామంలోని భూమిని  నిరుపేదలకు పంచిపెట్టారు. అయితే ఈ భూమిని 1972-73లలో అదే గ్రామానికి చెందిన బొక్క యాదిరెడ్డి అనే రైతు కొనుగోలు చేశాడు. మూడేళ్ల తర్వాత యాదిరెడ్డి నుంచి... ఆ భూములను సోదరుడు రాజిరెడ్డి కొనుగోలు చేశాడు.  ఆయన మృతి చెందిన తర్వాత ఆ భూములు సాయిరెడ్డి.. బల్వంత్ రెడ్డి.. రఘుపతిరెడ్డి పేర్ల మీద
తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా దఖలుపడే ఆస్తి హక్కుగా 'విరాసత్' చేశారు. అయితే గిర్మాపూర్ భూములు అసైన్డ్ భూములు కావడంతో వాటిని అనుభవించవచ్చుగానీ... అమ్మడానికి మాత్రం అవకాశం ఉండదు. అసైన్డ్ భూమి మీద హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి. ఇతరులకు అమ్మే హక్కు ఉండదు. అందుకే భూములను కొనుగోలు చేసినప్పటికీ అవి కాగితాలపైనే ఉంటాయి కానీ రికార్డుల్లో మాత్రం ఉండవు.  అసైన్డ్ దారుల నుంచి చేతులు మారిన భూమిని వెనక్కి తీసుకునేందుకు అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ తలనొప్పి మాకెందుకనుకున్న వారసులు... ఆ భూమిని అమ్మేస్తే పోలా అనుకొని... రాజ్యసభ సభ్యుడు డీఎస్... ఆయన అనుచరుడు ఎ.వి. సత్యనారాయణ రావుకు 2015లో అమ్మేశారు.
వారసులకు భూమి కేటాయించినప్పుడే... ఆ తరహా విధానం చెల్లదంటూ తేల్చిచెప్పిన రిజిస్ట్రేషన్ అధికారులు... డీఎస్ కు మాత్రం భూములను కట్టబెట్టేశారు. ఆయన ప్రభుత్వంలో పెద్ద మనిషి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడు కావడంతో... రిజిస్ట్రేషన్ చకచకా చేసేశారు. డీఎస్ పేరిట నాలుగు ఎకరాలు.. ఎ.వి. సత్యనారాయణ పేరిట రెండు ఎకరాలు రిజిస్ట్రేషన్ ను మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తతంగాన్ని పూర్తి చేశారు.  అనంతరం ఈ ఏడాది జనవరిలో...  భూములు మావేనన్నట్టుగా అధికారం కట్టబెట్టే... 'మ్యుటేషన్' కోసం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
దీనిపై విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు మ్యుటేషన్ చేయటానికి ససేమిరా అన్నారు. చేతులు మారిన అసైన్డ్ భూముల్ని వెనక్కి తీసుకునేందుకు మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో విషయం బయటకు పొక్కింది. డీఎస్ నాడు ఎకరాన్ని రూ. 14 లక్షలకు కొనుగోలు చేయగా... ఇప్పుడా భూమి... కోటి రూపాయల వరకు పలుకుతోంది. ప్రభుత్వ భూములు పక్కదారి పట్టే అవకాశం లేదంటూ సీఎం కేసీఆర్ కుండబద్ధలు కొడుతున్నప్పటికీ... ఇక్కడ ఎవరి ఇష్టానుసారం వారు... తమ పనులను చక్కబెట్టేసుకుంటున్నారు. 

No comments:

Post a Comment