Friday, 14 July 2017

అమరావతి ప్రపంచ బ్యాంక్ ఫిర్యాదు


ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆంధ్రులకు ఎన్నో అంచనాలున్నాయ్. పాలకులు ప్రజలకు అలాంటి సంకేతాలనిచ్చారు. తెలుగునేలపై స్వర్గం సృష్టిస్తామంటూ హామీల జనం ఊసుల్లోకి తీసుకెళ్లారు.     ఇప్పటికే రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్ లో 33 వేల ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు పూర్తి స్థాయి నిర్మాణాల దిశగా ముందుకు    అడుగులు వేస్తోంది. అయితే ఒక్కసారిగా ప్రపంచ బ్యాంక్ కు రాజధాని ప్రాంత రైతులు చేసిన ఫిర్యాదు... అమరావతి రాజధాని విషయంలో సరికొత్త వివాదానికి కారణమవుతోంది.
అ అంటే అమ్మ... అ అంటే అమరావతి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రాజధాని నిర్మాణాన్ని చేపట్టింది. ఇంద్రుడు ఏలిన అమరావతి తెలుగు ప్రజల సౌభాగ్య రేఖ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధానిని కోల్పోయిన బాధ లేకుండా ఉండేలా రాజధాని నిర్మాణం చేపడుతున్నట్టుగా సీఎం ప్రకటించారు. ప్రపంచం మొత్తం గర్వించేలా ఆంధ్రుల  రాజధానిని నిర్మించనున్నట్టు ఆయన చెప్పారు. అందుకు తన మేధస్సే పెట్టుబడని కూడా బాబుగారు స్పష్టం చేశారు. అమరావతి బ్రాండ్ నేమ్ ప్రచారం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పర్యటించివచ్చారు. సింగపూర్ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి అనేక ప్రణాళికలను రూపొందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పథకం ద్వారా 34,416 ఎకరాల భూమిని సమీకరించింది. వాటిలో మూడు వేల ఎకరాలు మినహా భూమి అంతా సీఆర్డీఏ ఆధీనంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిని వరల్డ్ క్లాస్ రాజధానిగా నిర్మించేందుకు ముఖ్యమంత్రి అనేక రంగాల నిపుణులతో దఫదఫాలుగా చర్చించారు. ఏపీ రాజధానిలో పరిపాలన నగరానికి 2,702 ఎకరాలు, ఆర్థిక నగరానికి 5,168, న్యాయ నగరానికి 3,438, పర్యాటక నగరానికి 11,574, విజ్ఞాన నగరానికి 8,547, ఎలక్ట్రానిక్స్ నగరానికి 6,582, ఆరోగ్యనగరానికి 6,511, మీడియా నగరానికి 5,107,  క్రీడల నగరానికి 4,150 ఎకరాలు కేటాయించాలని ప్రతిపాదించారు.  రాజధానిని బ్లూ-గ్రీన్ సిటీగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నిర్మాణానికి రూ. 58 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఏపీ రాజధాని అమరావతిలో శాశ్వత భవనాల నిర్మాణాలకు సంబంధించి...  అర్కిటెక్చర్ సంస్థ ఎంపికకు టెండర్లను సీఆర్డీఏ ఈనెల 14వ తేదీన తెరవనుంది.
వచ్చే మూడేళ్లలో రాజధాని నిర్మాణం కోసం రూ. 32,463 కోట్ల ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి నిధులు సమకూర్చేందుకు హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్... హడ్కో రూ. 14,200 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. దాంట్లో భాగంగా మొదటి విడత మొత్తంగా రూ. 1275 కోట్లు చెల్లించింది. ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం తీసుకోడానికి కేంద్రం ఆమోదం తెలిపింది.  రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పినకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.3,300 కోట్ల రుణం తీసుకోవాలని రాష్ట్ర  ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అయితే ఇటీవల ప్రపంచ బ్యాంక్ రుణాలకు సంబంధించి వివాదం రేగుతోంది. లోను మంజూరయ్యే దశలో కొందరు రైతుల లేఖలు రాయడంపై వివాదాస్పదంగా మారింది.
అమరావతి ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే ముందు తాము చేసిన ఫిర్యాదులను పరిశీలించాలని రాజధాని ప్రాంత రైతులు కోరారు. దాదాపు 13 పేజీల ఫిర్యాదును రైతులు పంపారు. ప్రపంచ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు సాగుతోందని వివరించారు. రాజధాని ప్రాంత రైతు సమాఖ్య సభ్యులు తమ అభ్యంతరాలతో ప్రపంచ బ్యాంక్ కు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. రైతులను బెదిరించి, భయపెట్టి దౌర్జన్యపూరితంగా భూములను తీసుకొన్నారని, వాటిని ఇవ్వడానికి నిరాకరించిన వారి భూముల్లో పోలీసు క్యాంపులు ఏర్పాటు చేశారని... వ్యతిరేకించిన రైతులను జైళ్లకు పంపారని ఫిర్యాదులు పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకపోవచ్చని...  ఒప్పందాలకు చట్టబద్ధత లేదన్న అభిప్రాయాన్ని కూడా ఫిర్యాదుదారులు వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి ఆనుకొని కృష్ణా నదికి ఏడాదిలో చాలా రోజులు వరదలు వస్తాయని, ఇప్పుడు కొత్తగా కడుతున్న వంతెనల వల్ల వరద ఇంకా పెరుగే ప్రమాదముందన్న సంకేతాలను వారు ఇచ్చారు. లంక భూముల్లో 600 ఏళ్లుగా దళితులు వ్యవసాయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
రాజధాని ప్రాంతంలో అత్యధిక శాతం రైతులు భూములివ్వగా... మరికొంత మంది ఇంకా భూములను ఇవ్వలేదు. కొందరు రైతులు జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు వెళ్లగా... ఇంకొందరు హైకోర్టులో కేసులు వేశారు. పూర్తి వివరాలతో బహిరంగంగానే కేసులు వేశారు. అయితే తాజాగా...  వరల్డ్ బ్యాంక్ కు రైతులు రహస్యంగా  ఫిర్యాదు సంచలనం రేపుతోంది. ఫిర్యాదు చేసిన వారు మాత్రం తమ పేర్లను బయటపెట్టవద్దంటూ విజ్ఞప్తి చేయండ విశేషం. అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వొద్దంటూ రైతులు ప్రపంచ బ్యాంకుకు స్పష్టం చేశారు. అయితే ప్రపంచ బ్యాంక్ ఫిర్యాదుల వెనుక ప్రతిపక్ష వైసీపీ నేతలున్నారన్న అభిప్రాయాన్ని ప్రభుత్వంలోని కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు రుణం రాకూడదని, అమరావతి అభివృద్ధి ఆగిపోవాలని, చంద్రబాబు రాజధానిని కట్టలేకపోయారని వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసి... ఎన్నికల్లో గెలుపొందాలన్న దురుద్దేశం ఉందన్న అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాల నుంచి విన్పిస్తోంది. అమరావతిలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన రాజధాని నిర్మాణం విషయంలో ప్రజల్లో చాలా అంచనాలున్నాయ్. ప్రభుత్వ ఆలోచనలు ఎన్ని ఉన్నప్పటికీ... రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నిర్ణయాత్మకంగా వ్యవహిరించాల్సిన ప్రభుత్వం... రాజధాని విషయంలో గోప్యత వీడాలి. రాజధాని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో అభిప్రాయాలను వివరిస్తారు. హైదరాబాద్  ను మించి రాజధానిని నిర్మిస్తానంటూ చెబుతున్న తెలుగుదేశం ప్రభుత్వం... మొత్తం వ్యవహారంలో పారదర్శకత ప్రదర్శించాలి. రాజధాని నిర్మాణం బాధ్యతను సీఆర్డీఏకు అప్పగించిన ప్రభుత్వం... ఎన్నో విషయాలకు సమాధానం చెప్పాలి. రూపాయి లేకుండా రాజధాని నిర్మాణం చేస్తున్నట్టుగా సీఎం చంద్రబాబు అనేకమార్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చిన సందర్భం ఆంధ్రప్రదేశ్ లో చూశాం. అయితే రాజధాని విషయంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. అక్రమంగా తీసుకున్న భూములను తిరిగిస్తామంటూ పార్టీ అధినేత జగన్ రైతులకు ఇచ్చిన హామీలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పటికే ఏపీలో ప్రభుత్వం, ప్రతిపక్షం  పోటాపోటీగా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శల్లో రైతులు ఎంత మాత్రం నష్టపోకూడదు. ఎన్నికలు, ఓట్లే కాకుండా రాజధాని కీలకమన్న ఆలోచనతో రాజకీయ పార్టీలు వ్యవహరించాలి.
మూడు పంటలు, నాలుగు పంటలు పండే నేలలో రాజధాని నిర్మాణం చేస్తున్న పాలకులు... రైతల విషయంలో ఎన్నో ఆలోచించి ఉంటారు. వారి నుంచి వస్తున్న విజ్ఞాపనలను, ఫిర్యాదులను ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. తాజాగా ప్రపంచ బ్యాంక్ ఫిర్యాదు విషయానికి అది వర్తిస్తుంది. ఎవరు రాశారు... ఏమి రాశారన్నది కాకుండా... అందులో ఎంత నిజాయితీ ఉంది... అన్న ఆలోచనతోనే ముందడుగు వేయాలి. ప్రతిపక్షం మద్దతుతోనే అలా చేశారన్న  ఆలోచనను పక్కకుబెట్టి... వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి. ప్రపంచబ్యాంక్ విచారణలో ఒకవేళ రైతల అభిప్రాయం అదేనన్న భావన వ్యక్తమైతే పాలకులు అందుకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు దిశానిర్దేశం చేస్తానంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం నాలుగు భవనాలు కట్టే అదే రాజధాని అని చెప్తారని ఎవ్వరూ అనుకోరు. రాజధానికి కావాల్సిన సర్వ హంగులు దిద్ది... అది విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజల భాగ్యరేఖగా చేస్తారనే ఐదు కోట్ల ఆంధ్రులు నమ్ముతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల గనిలా అమరావతి ఉండాలన్నదే అక్కడి ప్రజల కోరిక. మూడేళ్లు పూర్తై పోయింది. ఇంకా ఎన్నికలకు రెండేళ్లే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని ఎంత ముఖ్యమో... అంతకంటే... ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ ముఖ్యమే.  

No comments:

Post a Comment