Friday, 14 July 2017

ఖతర్నాక్ ఖతార్


మూడక్షరాల పేరు...  ఇప్పుడు  గల్ఫ్ దేశాల్లో కల్లోలానికి కారణమవుతోంది. గల్ఫ్ దేశాలన్నీ  ఆ దేశాన్ని మూకుమ్మడిగా ఏకాకిని చేస్తున్నాయ్. తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తోందంటూ ఆ దేశంపై ఒంటికాలిపై లేస్తున్నాయ్. ఇరాన్ తో ఆ దేశం అంటకాగుతున్నాయంటూ కూడా ఆ దేశాలు మండిపడుతున్నాయ్. అయితే సోదర దేశాలది కేవలం అపోహేనని... తాము ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పని చేయలేదంటూ ఆ దేశం చెప్పుకొస్తోంది. వివాదాల రారాజు ట్రంప్ మాత్రం అంతా నావల్లేనంటూ మరోసారి కొత్త గేమ ఆడుతున్నాడు.  అవును ఆ దేశమే ప్రపంచంలోనే నెంబర్ వన్ ధనికదేశం. ఆ దేశమే ఖతార్. తీవ్రవాదమంతా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నిధులతోనే జరుగుతోందన్నది ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే ఎవరి ప్రయోజనాలు వారివి... ఎవరి లెక్కలు వారివి. అందుకే అందరూ తామ సేఫ్ గేమ్ ఆడితే సరిపోతుందనుకుంటున్నారు. సౌదీ పెద్దన్న పాత్రలో ఖతార్ పై తీసుకున్న నిర్ణయంతో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆగమయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ధనిక దేశంపై సహచర దేశాలు సాగిస్తున్న వార్ ఎలాంటి షేప్ తీసుకుంటుంది? ఖతార్ పరిణామాలు భారత్ పై ఎలాంటి పాత్ర చూపెడతాయ్? సౌదీ దేశాలు ఖరత్నాక్ నిర్ణయం వెనుక దాగున్న పరిణామాలేంటి?
ఖతార్ విషయంలో అసలేం జరిగుతోంది. అందరూ ఒక్కటై ఖతార్ ను ఎందుకు వెలేస్తున్నారు. అందరిదీ ఒక మతం. అందరూ సోదర సమానులు.  అయితే అందరూ కలిసి ఆ చిన్న దేశంపై ఎందుకుపడుతున్నారు.? సంబంధాలు తెంచుకోవాల్సిన పరిస్థితులు ఎందుకొస్తున్నాయ్. ఖతార్ పరిణామాలు ఖతర్నాక్ గా ఎందుకు మారాయ్? పర్షియన్ గల్ఫ్ లో ఖతార్ కీలక దేశం. ఖతార్ ప్రపంచ ఆర్థిక శక్తులు ఒకటిగా వెలుగొందుతోంది. అయితే ఆల్ ఆఫ్ ద సెడన్ ఖతార్ తో సంబంధాలు తెంచుకుంటున్నట్టుగా పలు అరబ్ దేశాలు ప్రకటించాయ్. మొన్నటి వరకు మిత్రులుగా ఉన్న దేశాలు ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయాయ్. సోదర దేశాలకు శత్రువుగా ఉన్న ఇరాన్ కు మద్దతిస్తున్నారంటూ ఖతార్ పై అరబ్ దేశాలు మండిపడుతున్నాయ్. ఖతార్ పర్యాటకులు దేశం విడిచివెళ్లాలని  రెండు వారాల గడువు ఇచ్చేలా పరిస్థితులు మారిపోయాయ్. సౌదీ అరేబియాతోపాటు, బహ్రైన్, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలతో సరిహద్దులు కలిగి ఉంది. అదే సమయంలో ప్రపంచంలోనే కీలక విమానయాన సంస్థలు ఎమిరేట్స్, ఇతిహాద్ రెండూ ఖతార్ కు విమానాలు నడపబోమంటూ తేల్చిచెప్పాయ్. ఇప్పటికే ఖతార్ కు అరబ్ దేశాల నుంచి రాకపోకలు దాదాపు నిలిచిపోయాయ్. స్థానికంగా ఉన్నవారు ఖతార్ చేరుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఖతార్ కు భౌగిళికపై పైభాగంలో ఇరాన్... దిగువన సౌదీ దేశాలున్నాయ్. ఖతార్ కు చమురు నిల్వలు కుప్పలుతెప్పలుగా ఉన్నప్పటికీ... ఆహార పదార్థాలను మాత్రం వంద శాతం చుట్టుపక్కల దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. నిత్యం తినే ఆహార పదార్థాలు, నీటికి కూడా ఆ దేశం పక్క దేశాల నుంచి తెప్పించుకోవాల్సిందే... అందుకే తాజా ఆంక్షలతో ఆ దేశం నేనే పాపం ఎరుగనంటోంది. అనుమానంతోనే వేధిస్తున్నారంటూ కహానీ చెప్తోంది. ప్రపంచంలో ఏ దేశంలో లేనివిధంగా చమురు నిల్వలు ఖతార్ సొంతం. అయితే  అదే సమయంలో  ఖతార్ పర్షియ్ గల్ఫ్ లో ఉండటంతో ఆ చమురు నిల్వలన్నీ కూడా ఇరాన్, పాకిస్తాన్, రష్యా మీదుగా ప్రపంచదేశాలకు సరఫరా చేయాలి. అదే సమయంలో ఇరాన్ మంచి సంబంధాలను కలిగి ఉండాల్సిన అవసరం ఖతార్ కు ఎంతగానో ఉంది. అయితే అరబ్ దేశాలన్నీ కూడా ఇరాన్ వైఖరిపై మండిపడుతున్నాయ్. షియా ముస్లిం తీవ్రవాదులను తమపైకి ఉసిగొల్పుతున్నాయంటూ ఆ దేశాలు ఇరాన్ విషయంలో కఠినవైఖరి అవలంబిస్తున్నాయ్. అయితే ఖతార్ ది భిన్నమైన పరిస్థితి. అయితే అదే సమయంలో తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని... ఇది కేవలం ఆపోహేనని ఖతార్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వివరించింది. తాము ఇరాన్ కు మద్దతివ్వడాన్ని కానీ, తీవ్రవాదాన్ని పెంచిపోషించడం లేదంటూ ఆ ప్రకటనలో ఖతార్ పేర్కొంది. కేవలం అవాస్తవాల ఆధారంగా తమను ఏకాకిని చేస్తున్నారంటూ స్పష్టం చేసింది. సంబంధాలైతే తెంచుకున్న దేశాలు...
రాయబారులనుగానీ, ఖతార్ పౌరులపై నిషేధం మాత్రం విధించకపోవడం విశేషం. ఇప్పటి వరకు  అమెరికాకు అత్యంత సన్నిహిత దేశంగా మెలుగుతున్న ఖతార్ విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అమెరికా దన్ను... గల్ఫ్ దేశాల సహకారంతో ప్రపంచ ఆర్థిక శక్తిగా అవతరించిన ఖతార్... 2022లో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్  నిర్వహణ బాధ్యతలను తీసుకొంది. ప్రపంచ వ్యాప్తంగా మిలటరీ బేస్ లు కలిగి ఉన్న అమెరికాకు ఖతార్ లోనే అతిపెద్ద బేస్ ఉంది. ఇక్కడ దాదాపు పది వేల మంది సైనికుల స్థావరాన్ని అమెరికా కలిగి ఉంది. ఎంతో కీలకమైన విషయంలో కటువుగా ఉంటే ఖతార్... అమెరికన్ ఇంటరెస్ట్ విషయంలో మాత్రం ఉదారంగా వ్యవహరిస్తోంది. అందుకే అమెరికా ఇరాక్ విషయంలో యుద్ధ సమయంలోనూ... ఆప్ఘనిస్తాన్ యుద్ధ సమయంలోనూ, లిబియాపై దాడులు  సందర్భంగానూ ఖతార్ మిలిటరీ బేస్ ను ఎక్కువగా వినియోగించుకొంది. అంతటి మిత్రదేశంపై ఇప్పుడు సోదర దేశాలు తీవ్రవాదం ముద్రవేయడం వెనుక అసలు విషయమేంటి?
అమెరికా ప్రపంచ పెద్దన్న పాత్రలో తమ ప్రయోజనాలకు భంగం కలిగించని రీతిలో వ్యవహరిస్తూ... స్వప్రయోజనాలే ఎజెండాగా పనిచేస్తూ వస్తోంది. తీవ్రవాదాన్ని తనకు అనుకూలంగా నిర్వచించడంలోనూ అమెరికా స్టైలే వేరు... తనకు నచ్చితే పోరాటయోధుడు... తనకు నచ్చకపోతే తీవ్రవాది... ఇదే ముద్రతో  ప్రపంచాన్ని అమెరికా వణికిస్తోంది. ఖతార్ విషయంలో అసలేం జరుగుతోంది. తీవ్రవాదంతో ఖతార్ చేతులు ఎందుకు కలుపుతోంది. తీవ్రవాదులకు ఖతార్ నుంచి భారీగా నిధులు వరద పారుతోందన్న అనుమానం తీవ్రవాదంబారిన పడిన పలు దేశాలకు ఆలస్యంగా తెలుస్తోంది. అయితే అంతమాత్రాన ఆదేశం నుంచి వస్తున్న చమురు లెక్కలు ఆ దేశాలను మరో విధంగా ఆలోచించుకోనివ్వలేదు. సున్నీ, షియా డామినేషన్లు ఓవైపు జరుగుతుంటే ఖతార్ మాత్రం ఖతర్నాక్ గా ఆలోచించడం మొదలుపెట్టింది. తన పక్కనే ఉన్న ఇస్లాం దేశాలతో సఖ్యతగా ఉంటూనే... అదే సమయంలో ఇస్లామిక్ దేశాలకు బద్ధ శత్రువునై ఇజ్రాయెల్ తోనూ ఆదేశం అంటకాగుతుంది.
ఖతార్ కు 1971లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం లభించింది. ఖతార్ విస్తీర్ణం 11,437 చదరుపు కిలో మీటర్లు... ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ అంత విస్తీర్ణం ఉంటుంది. 2016 జనాభా లెక్కల ప్రకారం ఖతార్ జనాభా 26 లక్షల 75 వేలు. ఆ జనాభాలో 25 శాతం మంది భారతీయులు. ఖతార్ జాతీయులు కేవలం 12 శాతమే. బంగ్లాదేశీయులు 10.7 శాతంగా ఉన్నారు. ఇక పాకిస్తానీయులు 4.8 శాతం ఉండగా... ఇక చుట్టు పక్కల దేశాల నుంచి ఖతార్ వచ్చి నివాసముంటున్న వారి జనాభా 52 శాతంపైనే...  ఖతార్ నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున మారకద్రవ్యం లభ్యమవుతోంది. సహజవనురుల్లో ప్రపంచంలోనే అత్యధిక సంపన్న దేశంగా ఖతార్ వెలుగొందుతోంది. ప్రపంచదేశాలకు పెద్ద ఎత్తున లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ అందిస్తున్న  దేశంగా ఖతార్ నిలుస్తోంది.
ప్రస్తుతం ఖతార్ ను పాలిస్తున్న ఎమిర్...  తమిమ్ బిన్ హమద్ అల్ థాని  ... 2013 జూన్ 25న పాలన బాధ్యతలను చేపట్టారు. రాజకీయ పార్టీలు ప్రారంభించడం... ట్రేడ్ యూనియన్లను ఏర్పాటు చేయడం ఖతార్ లో నిషేధం. షరియా చట్టం  ప్రకారం ఖతార్ ను దేశ ఎమిర్లు పాలిస్తుంటారు. అల్ థనీ కుటుంబ ఏలుబడిలో ఖతార్ పాలన సాగుతోంది. 1825 నుంచి వారి కుటుంబ సభ్యులే ఖతార్ ను పాలిస్తున్నారు. ఖతార్ లెజిస్ లేటివ్ కౌన్సిల్ లో 45 సభ్యుల్లో 30 మంది సభ్యులను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకునేలా 2003లో రాజ్యాంగ సవరణ చేసింది. 98 శాతం మంది ప్రజలు ఈ నిర్ణయాన్ని ప్రజాభిప్రాయసేకరణ... రిఫరెండమ్ ద్వారా ఆమోదించారు. ఆప్ఘనిస్తాన్ తాలిబాన్లను గుర్తించిన నాలుగు దేశాల్లో ఖతార్ కూడా  ఒకటి. తాలిబాన్లు ఖతార్ లో రాయబారి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడంతోపాటు... ఆదేశానికి కావాల్సిన చమురును సైతం దిగుమతి చేసుకునేలా సహకరించింది. ఇరాన్ తో ఖతార్ అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. అమెరికాలోని కీలక పత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం... గల్ఫ్ దేశాల్లో తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశాల్లో ఒకటిగా విదేశాంగ నిపుణులు అభివర్ణిస్తుంటారు. తీవ్రవాదులపై దాడులు విషయంలో చర్యలు తీసుకోడానికి ఆదేశం అంతగా ఇష్టపడన్న అభిప్రాయం పలు దేశాల్లో ఉంది. సిరియాలోని ముస్లిం బ్రదర్ హుడ్ కు ఖతార్ మద్దతివ్వడంపై సౌదీ అనుకూల దేశాలతో సహా, బ్రిటన్ వ్యతిరేకిస్తూ వచ్చాయ్. ఇదే కారణంతో మార్చి, 2014లో బహ్రైన్, యూఏఈ, సౌదీ దేశాలు... ఖతార్ తో సంబంధాలు తెంచుకున్నాయ్. అయితే కొంత కాలం తర్వాత ఖతార్ పై నిషేధాన్ని అరబ్ దేశాలు ఎత్తివేశాయ్. అయితే తిరిగి అదే ఆరోపణలతో మరోసారి ఖతార్ పై వేటు వేస్తున్నాయ్. తాజా నిర్ణయం వెనుక అమెరికా అందండలున్నాయా... అమెరికా మొత్తం వ్యవహారంలో తలదూర్చుతుందా... ఇరాన్ కు మద్దతు... సాకు ఇప్పుడు ఖతార్ పై వేటుకు కారణమవుతుందనిపిస్తోంది.
ఖతార్ పై సౌదీ పెత్తనం చెలాయించాలనుకుంటుందా? లేక గల్ఫ్ దేశాలన్నీ కూడా తన మాట వినాలనుకుంటున్నాయ్... ఇరాన్ పై సౌదీ అక్కసెందుకు? సౌదీ, ఇరాన్ రెండు కత్తులు ఒక వరలా ఇమడవా? మధ్యలో ఖతార్ ఎందుకు తలదూర్చుతోంది? మధ్యలో అమెరికా పాత్ర ఎంత? అమెరికాకు గల్ఫ్ దేశాలపై ఇంటరెస్ట్ తగ్గిపోతుందా? ఖతార్ ఇప్పుడో ఆర్థిక ప్రబల శక్తి. ఒళ్లంతా బంగారముంటే తింటానికి తిండి కావాలి కదా... అదే సూత్రం ఇప్పుడు ఖతార్ కు వర్తిస్తోంది. ఖతార్ నేలపై ప్రపంచంలో ఎక్కడా లేనన్ని చమురు నిల్వలున్న దేశం పూట గడవాలన్నా కానీ ఇతర అరబ్ దేశాలపై ఆధారపడాల్సిందే. అయితే అరబ్ దేశాలల్లో ఎవరి రాజకీయం వారిది. ఎవరి ఇష్టం వారిది. అయితే వారికి కావాల్సింది మాత్రం రాజకీయంగా తమ ప్రాబల్యమే కొనసాగడం. గల్ఫ్ కంట్రీల్లో విస్తారంగా చమురు నిల్వలుండటంతో వారికి పన్నుల వేయాల్సిన అవసరం కూడా లేకుండాపోతోంది. గల్ఫ్ దేశాల్లో యంగర్ జనరేషన్ లో ఆలోచనలు మారుతున్నాయ్. రాయల్ ఫ్యామిలీ వారసత్వం నడిచిపోతున్నప్పటికీ... జనంలో పొలిటికల్ కోరికలు పెరుగుతున్నాయ్. అయితే వాటికి మతాన్ని జోడించి వారి ఇష్టానుసారం ఆయా వ్యక్తులను మార్చేస్తున్నారు. వారికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉండాలి. కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి లేదు. వర్క్ చేయడానికి ప్రపంచ దేశాల నుంచి జనం వస్తారు. సంపదలో కొంత భాగాన్ని కూలీగా ఇచ్చేస్తే ఆదాయమంతా ప్రభుత్వానిదే కదా... సౌదీ అంటే ఇరాన్ కు పడదు. ఇరాన్ అండే సౌదీకి పడదు. శాంతి ఒప్పందమంటే ఇరాన్ కు ఇష్టమైనప్పటికీ... అందుకు సౌదీ మాత్రం ముందుకురాదు. ఇరాన్ తో మాకెందుకా... వారు షియాలు... మేం  సున్నీలం... వారికంటే మేం ఎక్కువన్న భావన వారిలో ప్రబలంగా కన్పిస్తుంది. దీనికి కారణం అపరిమితమైన వనరులే. కావాల్సినంత డబ్బు చేతుల్లో తిరుగుతోంది. అంతా మా పెత్తనం ఉంటున్నప్పుడు వారు మాకెందుకన్న భావన వారిలో ఉంది. సౌదీ అరేబియాలో టూరిజం నుంచి కూడా భారీగా విదేశీ మారదకద్రవ్యాన్ని పొందుతోంది. అయితే ఈ పవర్ అంతా నిలవాలంటే అందుకు టే మతం ముసుగు కావాలి. ప్రస్తుతం సౌదీలో రాజ్యమేలుతున్న రాజవంశీకులు... అల్ సౌద్ మతాచార్యుల కుటుంబీకులను పెళ్లి చేసుకోవడం వల్ల... 1570 నుంచి కొత్త పాలన మొదలైంది. అంతకుముందు... గల్ఫ్ దేశాలన్నీ టర్కీ ఎంపైర్ లో భాగంగా ఉండేవి... రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పలు దేశాలు ఆవిర్భవించాయ్. జెరూసలేంను మాత్రం బ్రిటన్ కంట్రోల్ లో ఉంచుకుంది. ఆ తర్వాత ఆ దేశం ఇజ్రాయెల్ గా మారిపోయింది.
గల్ఫ్ దేశాల్లో పలు దేశాల్లో  సున్నీల ప్రాబల్యంలో ఉండగా... మైనార్టీ దేశాలు షియాల ఆధీనంలో ఉన్నాయ్. ఇక ఇరాన్ షియా డామినేషన్లో కొనసాగుతోంది. ఇరాక్ లో మైనార్టీ  నేత సద్దాం హుస్సేన్ సున్నీ తెగకు చెందినప్పటికీ... మెజార్టీ జనాబా షియాలు. ఇటీవల కాలంలో అంతర్యుద్ధాలు యెమెన్, సిరియాలో ఎక్కువగా జరుగుతున్నాయ్. సిరియాలో ఉన్న లీడర్ షియా తెగకు చెందిన అసద్. అక్కడ సున్నీలు అసద్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. యెమెన్ లో షియా, సున్నీ సమస్యతో నిత్యం రక్తతర్పణం జరుగుతోంది. ఇదే సమయంలో సున్నీలు మెజార్టీగా ఉండే ఖతార్ అసద్ కు మద్దతివ్వడంపైనా సౌదీ ఎప్పట్నుంచో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఇటీవల ఇరాన్ పార్లమెంట్ పై జరిగిన దాడి ఘటనకు ఐఎస్ నేతృత్వంలోని తీవ్రవాదులు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇరాన్ పార్లమెంట్ పై దాడి చేయడం ద్వారా ఆ దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్న సంకేతాలను తీవ్రవాదులు పంపించారు. ఇటీవల ఇరాన్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న నేపథ్యంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాడుల ద్వారా ఆ దేశానికి తీవ్రవాదులు హెచ్చరికలు పంపించారు. తాజాగా ఖతార్ పై సంబంధాలు తెగదెంచుకోవడం వెనుక కూడా ఇలాంటి కారణాలే ఉన్నాయ్. అయితే ఖతార్ తన పని తాను చేసుకుంటూ... ప్రపంచంలోని పలు దేశాల్లోని పరిణామాలపై స్పందిస్తూ ఉంటుంది. తాజాగా తమకు తెలియకుండా ఖతార్ ఇరాన్ తో సన్నిహితంగా మెలగడాన్ని సౌదీ అరేబియా తట్టుకోలేకపోతోంది. పొగ లేకుండా నిప్పు రాజుకోదు కదా... ఖతార్ ఏదో చేస్తోంది. ఇరాన్ కొత్త అధ్యక్షుడుగా హసన్ రోహనీ ఎన్నికకావడం.... ఆ దేశంతో సన్నిహితంగా ఖతార్ మెలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవడమే తాజా అలజడికి కారణంగా చెబుతున్నారు.
మరోవైపు గల్ఫ్ దేశాల విషయంలో అమెరికా పంథా మారుతోంది. గతంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న చమురుపై కన్నేసిన పెద్దన్న ఇప్పుడు చమురు రాజకీయాలకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారు. ఒబామా ఏలుబడిలోనే
ఈ వ్యవహారాన్ని ప్రారంభించిన ఆదేశాలు నాడు ఇరాన్ తోనూ సంబంధాలు పునరుద్ధరించుకున్నాయ్. సొంతంగా పెద్ద ఎత్తున చమురు నిల్వలున్న అమెరికా ఇకపై గల్ఫ్ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవాలన్న ఆలోచనకు స్వస్తి పలుకుతున్నాయ్. ఇరాక్ లో తగిలిన ఎదురుదెబ్బలు, ఆప్ఘనిస్తాన్ విషయంలో ముందడుగు పడకపోవడం... సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం అన్నింటా... లాభం కంటే నష్టమన్న భావన అమెరికాలో కన్పిస్తోంది.
ఖతార్ విషయంలో గల్ఫ్ దేశాలు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నాయ్. ఖతార్ తీవ్రవాదాన్ని ఏవిధంగా పెంచి పోషిస్తుందో కూడా వివరించేలా... తీవ్రవాద గ్రూపులు, తీవ్రవాదులకు మద్దతిస్తున్న విషయాన్ని సైతం ఓ ప్రకటనలో వెల్లడించాయ్. ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదాన్ని నిరోధించేందుకు భావజాలవ్యాప్తిని నిరోధిస్తున్నామని చెబుతున్న ఆ దేశం... తీవ్రవాదులకు ప్రత్యక్షంగా... పరోక్షంగా సహకారం అందిస్తోందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. తాము తీవ్రవాదాన్ని పెంచిపోషించడం లేదంటూ ఖతార్ చేసిన ప్రకటనను గల్ఫ్ దేశాలు తీవ్రంగా తప్పుబట్టాయ్. ఉగ్రవాదం ఎగిసిపడుతున్న పలు దేశాలల్లో ఖతార్ ఇస్తున్న మద్దతు మూలంగానే తీవ్రవాదం పెచ్చుమీరుతోందని అంటున్నారు. మొన్నటిదాకా త‌మ పొరుగు దేశంగా, అంత‌కుమించి మిత్రదేశంగా భావిస్తూ వ‌చ్చిన ఖ‌త‌ర్‌ను గ‌ల్ఫ్ దేశాలు ఎందుకు వెలి వేశాయో కార‌ణం తెలుస్తోంది. ఖ‌తార్‌ 12 ఉగ్రవాద గ్రూపుల‌తో అనుబంధం ఉంద‌న్న విషయం రుజువవుతోంది. ప్రపంచదేశాల్లో ఉన్న సుమారు 59  మంది ఉగ్రవాదుల‌తోనూ ఖతార్ సంప్రదింపులు నిర్వహిస్తోంద‌న్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ఇదే విషయాన్ని పలు గల్ఫ్ దేశాలు ఒక ప్రకటనలో స్పష్టం చేశాయ్. తీవ్రవాదులను కట్టిడి చేసే విషయంలో మరో ఆలోచన ఏదీ కూడా లేదని... వారికి నిధులు అందకుండా చేయడం... వారిని చట్టం ముందు నిలబెట్టడం ఒక్కటే పరిష్కారమని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదుల‌కు ఆర్థిక స‌హ‌కారాన్ని అందించ‌డ‌మే కాకుండా.. వారికి ఆశ్రయాన్ని కూడా ఇస్తోంద‌ని నాలుగు గ‌ల్ఫ్ దేశాలు నిప్పులు చెరుగాయ్. ఇప్పటికే రాకపోకలపై నిషేధం విధించిన ఆ  దేశాలు వచ్చే రోజుల్లో ఖతార్ పై మరిన్ని ఆంక్షలు విధించాలన్న యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఖతార్ లో ఉన్న తీవ్రవాదులు ప్రపంచ వ్యాప్తంగా పలు విధ్వంసాలకు కారణమవుతున్నారని చెబుతున్నారు.  స‌ద్ అల్ కాబి, అబ్ద్ అల్‌-ల‌తీఫ్‌-అల్‌-క‌వారి అనే ఇద్దరు ఉగ్రవాదుల పేర్లు అమెరికా పెంట‌గాన్ హిట్‌లిస్ట్‌లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస‌క్తి క‌లిగించే ఇంకో విష‌యం ఏమిటంటే- ఈ జాబితాలో ఉన్న 59 మంది ఉగ్రవాదులు, 12 ఉగ్రవాద సంస్థల మూలాలు బహ్రెయిన్‌, ఈజిప్ట్‌, లిబియాల్లో ఉన్నాయ్.
మరోవైపు నాలుగు అరబ్ దేశాలు చేస్తున్న అసత్య ప్రచారం దారుణమని ఖతార్ విదేశాంగ మంత్రి అభిప్రాయపడ్డారు. తమపై ఆంక్షలతో దిగొస్తామంటూ సౌదీ సహా పలు దేశాలు భావిస్తున్నాయని... తమపై వారి ఒత్తిడి ఎంత మాత్రం పనిచేయదని ఖతార్ విదేశాంగ మంత్రి చెప్పారు. తమ విదేశాంగ విధానంలో ఎలాంటి మార్పూ కూడా రాబోదని తెగేసి చెబుతోంది. తీవ్రవాదులకు మద్దతివ్వబోమంటూ ఎన్నో సార్లు  రాతపూర్వక ఒప్పందాలు  కుదుర్చుకున్న ఖతార్ ఎన్నోసార్లు ఆ ఒప్పందాన్ని వయలేట్ చేశాయని  అరబ్ దేశాల నాలుగు దేశాల ప్రతినిధులు సంయుక్త ప్రకటనలో ఆరోపించారు. మాజీ హోంశాఖ మంత్రితో సహా పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు, రాజకుటుంబంలోని పలువురు తీవ్రవాదులతో అంటకాగుతున్నారని వారు విమర్శించారు.
భారత్ పై ఖతార్ ప్రభావమేంటి ? గల్ఫ్ దేశాల విషయంలో భారతదేశం లెక్కలేంటి? ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఎక్కువగా గల్ఫ్ దేశాల్లో ఎందుకు నివశిస్తున్నారు. గల్ఫ్ దినార్లకు డాలర్లకంటే ఎక్కువ క్రేజ్ ఎందుకు వస్తోంది. భారతదేశం గల్ఫ్ దేశాల విషయంలో ఎలాంటి పాత్ర పోషించబోతోంది? గల్ఫ్ దేశాల్లో ప్రతీ దేశంలోనూ భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ, కువైట్, బహ్రైన్, ఇరాన్ తోపాటు పలు అరబ్ దేశాల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఖతార్ లో  జనాభా 26 లక్షలుంటే అందులో 6 లక్షల మంది భారతీయులున్నారు. గల్ఫ్ దేశాల్లో పెద్ద ఎత్తున నివశిస్తున్న భారతీయులు... భారీగా బంగారాన్ని  తమ వెంట తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం బంగారంపై పది నుంచి 20 శాతం మేర బంగారంపై ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్ పోర్ట్ డ్యూటీ వేయడం వల్ల దాని ధర ఇప్పుడు లభించేదానితో పోల్చుకుంటే వారికి 10 శాతానికి పైగా తగ్గుతోంది. అదే దళారులు 5 శాతం మార్జిన్ తో గాలం వేస్తారు. చట్టబద్ధంగా దుబాయ్ నుంచి వచ్చేవారు... ఒక్కోసారి కేజీ బంగారాన్ని తెచ్చుకునే వీలుంది. 5శాతం డ్యూటీ కడుతే బంగారం వారి సొంతమవుతుంది.  సొంత అవసరాల కోసం తెచ్చుకుంటున్నాం. అయితే ఆ బంగారమంతా... షాపులకు వచ్చేస్తుంది. ప్రభుత్వానికీ ఎలూగూ పన్నులు కడుతున్నామని ఫీలవుతారు.  బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే... ముస్లిం దేశాలతో సంబంధాలు అంతగా ఉండవన్న భావన ఉండగా... భారత్ మాత్రం గల్ఫ్ దేశాలతో మంచి సంబంధాలను నెరపుతోంది. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గల్ఫ్ దేశాల్లో భారత్ దేశానికి మాంచి గుర్తింపు తీసుకొస్తున్నారు. ఇటీవల యూఏఈలో పర్యటించిన మోదీ... అక్కడ ఆ దేశంతో భారత్ సంబంధాలను గుర్తుచేయడం... ఆ తర్వాత రోజుల్లో రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ ను ఆహ్వానించడం ద్వారా భారత్ స్నేహహస్తాన్ని అందించింది. యూఏఈతోపాటు అన్ని అరబ్ దేశాలతో భారత్ ఎప్పట్నుంచి సత్సంబంధాలను సాగిస్తున్న విషయం దీని ద్వారా మోదీ మరోసారి ప్రపంచానికి గుర్తుచేశారు.
ఇదే సమయంలో భారత్ ఎవరిపక్షమన్న విషయం ముఖ్యంకాదన్న విధానాన్ని పాటిస్తోంది. ఎందుకంటే భారత్ అన్ని అరబ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటోంది. భారత్ దిగుమతి చేసుకునే చమురులో 50 శాతం గల్ఫ్ దేశాలనుంచే వస్తోంది. ముఖ్యంగా సీఎన్జీ గ్యాస్ అంతా కూడా ఈ ప్రాంతం నుంచి వస్తోంది. యెమన్, లిబియా దేశాల్లో అలజడి సందర్భంగా... చమురు దిగుమతికి సంబంధించి భారత్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఖతార్ ఎయిర్ వేస్ నుంచి భారత్ కు వారానికి 24 వేల మంది  రాకపోకలు సాగిస్తారు. దీని వల్ల ఆయాదేశాలు ఖతార్ పై విధించిన నిషేధంతో భారతీయులకు సమస్యలు ఎదురవ్వవొచ్చు.  ప్రతి దేశంతో మనం సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయ్. శత్రువుల విషయంలోనూ సుహృద్భావమే భారత్ విధానం... పొరుగు దేశంతో సమస్య ఉన్న నేపథ్యంలో మనం వాటి చుట్టూ ఉన్న దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించడం విశేషం.  ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదం దెబ్బతో బెంబేలెత్తిపోతున్న ముస్లిం దేశాలు ఆ ప్రమాదాన్ని నిరోధించుకోవాలని భావిస్తున్నాయ్. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష. ఈ నానుడి ఇప్పుడు ముస్లిం దేశాలకు స్పష్టంగా తెలిసివ స్తోంది. మొన్నటి వరకు ప్రపంచదేశాల్లో తీవ్రవాద అలజడులచో బిక్కచచ్చిపోతుంటే వారు మాత్రం కిమ్మనకుండా... వారికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు వారి కొంపలు కొల్లేర్లవుతుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. తీవ్రవాదులకు మతం, ప్రాంతం ఉండదని... తీవ్రవాదం... ఎప్పటికీ తీవ్రవాదమేనని... వారికి ప్రాణాల విలువ తెలియదని భారతదేశం ప్రపంచ వేదికలపై ఎప్పట్నుంచో ఎలుగెత్తిచాటుతోంది. సీమాంతర తీవ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని చవిచూసింది. తీవ్రవాద చర్యలు నిత్యకృత్యమైపోతున్నాయ్. ప్రత్యక్షంగా ఎవరి విషయంలో జోక్యం చేసుకొని భారత్ పై మాత్రం పొరుగుదేశం రాజేస్తున్న అలజడి ఎన్నో సమస్యలకు కారణమవుతోంది.
మొన్నటి వరకు మన పొరుగు దేశానికి మద్దతిచ్చిన పలు దేశాలు... ఇప్పుడు ఆలోచనలో పడుతున్నాయ్. తీవ్రవాదాన్ని పెంచి పోషించిన పొరుగుదేశానికి గల్ఫ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తూ వచ్చాయ్. మతసంస్థల నిర్వహణ కోసం తొలుత వచ్చిన నిధులు తర్వాత తీవ్రవాదలకు అందాయ్. తమకు సమస్య లేదన్న భావనతో తీవ్రవాదాలను పెంచిపోషించిన గల్ఫ్ దేశాలకు ఇప్పుడిప్పుడే ఆ రుచి తెలుస్తోంది. అయితే అది అనేకరూపాలు సంతరించుకొంది. తీవ్రవాదాన్ని పెంచిపోషించిన  పాకిస్తాన్ లో ఇప్పుడు టెర్రరిజం భూతం రోజు రెండంకెల సంఖ్యలో ప్రాణాలను బలికొంటోంది. అమాయక విద్యార్థులను సైతం పొట్టనబెట్టుకునే పరిస్థితి వస్తోంది. పాకిస్తాన్ తర్వాత తీవ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆప్ఘనిస్తాన్ లో నిత్యం రక్తపు ప్రవాహం పారుతూనే ఉంది. అక్కడ్నుంచి ఆ తీవ్రవాదం ఇప్పుడు అరబ్ దేశాలకు పీచమణుస్తోంది. తిరుగుబాటుదారులతో పలు ఇస్లాం దేశాలు కకావికలమైపోతున్నాయ్. ఇరాక్ లో సద్దాం దిగిపోయిన దశాబ్దా కాలమవుతున్నా అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది.
ఇక ఈజిప్టు, లిబియాలో తీవ్రవాదు అమయాకుల ప్రాణాలను బలిగొంటోంది. టర్కీ రావణకాష్టంలా మారిపోతోంది. సౌదీలోనూ తీవ్రవాదులు తమ ప్రభావం ఎక్కువుతోంది. అయితే షియాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయ్. ఆఫ్రికా ఖండంలోని ముస్లిం దేశాల్లో తీవ్రవాదం పెచ్చరిల్లుతోంది.  నైజీరియా, కెన్యా, సోమిలియా, అల్ ఫరూక్ తో సహా పలు దేశాల్లో దాడులు జరిగాయ్. ఈ దాడుల్లో అమాయకులు నిత్యం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా ఇరాన్ పార్లమెంట్ తో సహా మూడు చోట్ల తీవ్రవాద దాడులు జరిగాయ్. ఈ దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక అమెరికాలో ట్విన్ టవర్స్ పై మొదలైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయ్. ఇటీవల ఐరోపాదేశాలను టార్గెట్ గా చేసుకొని ఐఎస్ తీవ్రవాదులు విధ్వంసం సృష్టిస్తారు. నాడు అల్ ఖైదా రూపంలో తీవ్రవాద దాడులు జరిగితే... ఇప్పుడు జస్ట్ నేమ్ చేంజ్ . ఐఎస్ పేరుతో ఇప్పుడు దాడులు జరుగుతున్నాయంతే. భావజాలం మాత్రం ఒక్కటే. జీహాద్... పవిత్ర యుద్ధం. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం సామ్రాజాన్ని విస్తరించాలన్న కాంక్షే.
ఖతార్ పై అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. అయితే ఖతార్ తీవ్రవాదులకు మద్దతిస్తున్న విషయం వారికి ఇప్పుడే తెలిసిందా? అన్ని తెలిసిన అమెరికా ఇప్పుడు ఖతార్ పై నిషేధాన్ని సమర్థించడమంటే దేనికి నిదర్శనం... తాలిబాన్ ను సృష్టించిదెవరు? ఐఎస్ తీవ్రవాదికి ఆధ్యులెవరు? సున్నీ, షియాల లొల్లికి మించి గల్ఫ్ దేశాల మధ్య ఆధిపత్యం ఎక్కువవుతోందా? విచ్చలవిడిగా చమురు ఉత్పత్తులతో జీవితాలను కొత్తపుంతలు తొక్కించిన అరబ్ దేశాలు భవిష్యత్ భయంతో బెంబెలెత్తిపోతున్నాయ్. తాను సృష్టించిన అల్ ఖైదా... లాడెన్ రూపంలో తమను వెన్ను విరిచిన విషయాన్ని అమెరికా మర్చిపోవచ్చు.. ఇప్పుడే అదే కోరలు అరబ్ దేశాల్లో ఐఎస్ పేరుతో విజృంభిస్తూ.... ప్రపంచానికి సవాల్ విసురుతున్నాయ్. ఈ అలజడంతా ఖతార్ పాపమేనంటూ సర్దిపెట్టుకుంటే విపత్తు పెనువిప్తతుగా దారీతీస్తుంది. ఈ విషయంలో భారత్ ఆతిచూతి వ్యవహరించాల్సిందే. ఎందకంటే గల్ఫ్ దేశాల నుంచి మనకు వస్తున్న చమురు... గల్ఫ్ దేశాల నుంచి మన వాళ్లకు లభిస్తున్న ఉపాధి మనకు ముఖ్యం. అంతకు మించి అక్కడ నివశిస్తున్న మనవాళ్ల భద్రత మనకు ప్రధానం.     

No comments:

Post a Comment