భారత్, చైనా సరిహద్దుల్లో ఎందుకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఇరుదేశాల మధ్య వివాదాస్పదమైన అరుణాచల్ లేదా లడక్ ప్రాంతాల్లో కాకుండా... ఎలాంటి సరిహద్దు వివాదంలేని సిక్కిం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎందుకు రాజుకున్నాయ్. ఎప్పుడూ ఇరువైపుల పదుల సంఖ్యలో కాపలా ఉండే సైనికుల సంఖ్య ఇప్పుడు మూడువేల మందికి ఎందుకు చేరుకుంది? ఒకసారి 1962లో ఎదురైన పరాభవాన్ని గుర్తుచేసుకోడంటూ భారత్‌ను చైనా హెచ్చరించడం, అప్పటి భారత్‌లాగానే ఇప్పుడూ భారత్ ఉందనుకోవడం పొరపాటంటూ భారత్ కూడా దీటుగా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది? చైనా సరిహద్దుల గుండా మానవ సరోవర యాత్రను కూడా నిలిపేయాల్సిన ఆగత్యం ఏర్పడటం చైనా మాష్ట్దర్ ప్లాన్లో వ్యూహాలుగా భావించాలి.
భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు దేశాల సైన్యం పోటాపోటీగా భారీగా మోహరింపులు జరిగాయ్. సిక్కింలోని డొకాలా కనుమలో భారత ఆర్మీ దళాలు భారీగా మోహ రించడం... చైనా ప్రతిఘటనలు తాజా ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయ్. గత నెలరోజులుగా చైనా-భారత్ సరిహద్దు ప్రాంతమైన సిక్కింలోని డొకాలా వద్ద సమస్యాత్మక వాతావరణం నెలకొంది. 1962 తర్వాత పెద్దఎత్తున ఇరు దేశాలు సైన్యాన్ని మోహరించాయ్. భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డోకా లా ప్రాంతంలో ఇరు దేశాలు భారీగా బలగాల్ని మోహరించి ఢీ అంటే ఢీ అంటున్నాయి. డోకా లాలోని భూటాన్ ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణంతో గొడవ మొదలైంది. భూటాన్‌కు మద్దతుగా భారత్ బలగాలు రంగంలోకి దిగడం చైనాకు కోపం తెప్పించింది. సిక్కిం సెక్టార్‌లో ఉండే డొకాలా కనుమ తమదేశ భూభాగమంటూ చైనా ఇటీవల మ్యాప్ విడుదల చేయడం తర్వాత పరిణామాలు మరింత ఉద్రిక్తతకు కారణమయ్యాయ్. డొకాలా ప్రాంతం భారత్, చైనా, భూటాన్ మూడు దేశాల సరిహద్దులో ఉంటుంది. 2012 నుంచి భారత్ ఈ ప్రాంతానికి బంకర్లను ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తోంది. వాటిని తొలగించాలంటూ గతనెల 1న చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్‌ఏ భారత్ కు సూచించింది. జూన్ 6న రాత్రి సమయంలో చైనా భారత్‌కు చెందిన రెండు బంకర్లను బుల్డోజర్లతో నేలమట్టం చేసింది. ఈ ప్రాంతం తమ భూభాగంలోనిదని, దీనితో భారత్, భుటాన్‌లకు సంబంధం లేదని పేర్కొంది. దీంతో భారత సైన్యం చైనా ఆగడాలను అడ్డుకొంది. మరింత నష్టం జరగకుండా చర్యలు చేపట్టింది. భారత దేశం, భుటాన్, చైనా దేశాల స్ట్రాటజిక్ ట్రై జంక్షన్ విషయంలో భారత్ చెప్తున్న దానికి, భుటాన్ చెప్తున్న దానికి, చైనా వాదనలోని గందరగోళం ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమవుతోంది.
చైనా ఓవరాక్షన్ దెబ్బకు భారత్ దూకుడు ప్రదర్శించింది. డొకాలా కనుమలో అదనపు భద్రత కోసం 20 కిలోమీటర్ల దూరంలోని బలగాలను భారత్ రప్పించింది. చైనా చర్య తర్వాత... భారత్ ప్రతి చర్యగా జూన్ 8న అక్కడ బలగాలను మోహరించింది. అటు చైనా కూడా 141వ డి విజన్‌లో తన సైన్యాన్ని మోహరించింది. 1962 తర్వత నెలరోజులుగా ఇక్కడ రెండు దేశాల సైన్యం భారీగా మోహరింపులు కొనసాగడం ఇదే మొదటిసారని చెప్పాలి. అంతకుముందు 2013లో జమ్ముకాశ్మీర్‌లోని లడక్ డివిజన్ దౌలత్‌బేగ్ ప్రాంతంలో 21రోజులపాటు సైన్యాన్ని మోహరించింది. అప్పుడు చైనా సైన్యం 30కిలోమీటర్లు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. ఆ ప్రాంతం తమదంటూ వాదనకు దిగింది. ఆ తర్వాత తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది చైనా.
1962లో భారత్-చైనా యుద్ధం చోటుచేసుకుంది. 1976లో సిక్కిం భారత భూభాగంలో కలిసింది. నెల రోజుల నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ... భారత్ మేజర్ జనరల్ ర్యాంక్ అధికారి డొకాలా కనుమకు పంపించింది. 1898లో చైనాతో జరిగిన ఒప్పందం మేరకు ఈ సరిహద్దుల్ని ఖరారు చేశారు. అంతర్జాతీయ సరిహద్దుకు 15కిలోమీటర్ల దూరాన ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు బృందాలను ఏర్పాటు చేసిన భారత్ 1962 యుద్ధ సమయంలోనూ హద్దుల చెరిపివేతకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. అయితే కీలకమైన ప్రాంతంలో యుద్ధట్యాంకులు వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మించాలన్నది చైనా ఆలోచన. దీనికి భారత్, భూటాన్ దేశాలు అంగీకరించడంలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో జూన్ రెండవవారంలో చైనాను భారత్ రెండుసార్లు ఫ్లాగ్ మీటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, మూడోసారి సమావేశానికి అంగీకరించిన చైనా, లాల్తెన్ ప్రాంతం నుంచి బలగాలను వెనక్కితీసుకోవాలని చెప్పింది. అందుకు భారత్ అంగీకరించలేదు.
ఈ బంకర్లు భారత్-భుటాన్-చైనా మూడుదేశాల సరిహద్దు అయిన చంబల్‌లోయకు సమీపంలో ఉన్నాయి. భుటాన్-చైనా సరిహద్దు భద్రతాబృందాలకు రక్షణ ఇవ్వడంతోపాటు అవసరాలు ఏర్పడిన సందర్భంలో వాటిని వాడుకునేందుకు వీలుగా 2012లో భారత్ ఈ బంకర్లను ఏర్పాటు చేసింది. జూన్6నాటి రాత్రి రెండు చైనా బుల్‌డోజర్లు భారత బంకర్లను ధ్వంసం చేశాయి. వెనువెంటనే అప్రమత్తమైన భారత సైన్యం చైనా ఆర్మీని నిలువరించింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఇరుదేశాల సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. భారత్ తన సైన్యాన్ని డొకాలా లాల్టెన్ ప్రాంతం నుంచి తొలగించాలని పట్టుబట్టింది. డొకాలా అన్నది భారతీయ నామం. దానిని భుటాన్ డొకలమ్ అని పిలుస్తుంది. కానీ చైనా మాత్రం దానిని డాంగ్లాంగ్ అని పిలుస్తూ తమ ప్రాంతమని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే చైనా కైలాస్ మానససరోవర్ యాత్రికులను అడ్డుకొంది. మొదటి బ్యాచ్‌లోని 47మంది యాత్రికులు టిబెట్ మీదుగా వెళ్లేందుకు నిరాకరించింది. అలాగే మరో 50మంది వీసాలను కూడా రద్దు చేసినట్టు చైనా భారత్‌కు తెలిపింది. దీంతో ఇరు దేశాల మధ్య మరింత అగ్గిరాజేసినట్టయింది. సిక్కిం రూట్‌లో మానససరోవర్ యాత్ర టిబెట్ మీదుగా కొననసాగుతుంది. దీనిని 2015లో ప్రారంభించారు. లేకపోతే యాత్రికులు నాథులా మీదుగా కైలాస్ యాత్రకు 1500 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది. 2008 నవంబర్‌లోనూ చైనా ఇలాంటి ఎత్తుగడలే వేసింది. డొకాలా లోని బంకర్లను నేలమట్టం చేసింది. అప్పుడు కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. భారత్, చైనా, భూటాన్ ఉమ్మడి సరిహద్దుల్లోని కీలక భూభాగమే డోకా లా.. సిక్కిం వైపున ఉన్న ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా భారత్‌కు ఎంతో కీలకం. అయితే ఇక్కడ భూటాన్ అధీనంలో ఉన్న ప్రాంతంలో తేలికపాటి యుద్ధ ట్యాంకులు, పరికరాల్ని మోసుకెళ్లేలా చైనా రోడ్డు నిర్మాణం కొనసాగిస్తోంది. పాత ఒప్పందాల్ని గౌరవించాలని, రోడ్డు నిర్మాణం నిలిపివేయాలని రాయల్ భూటాన్ సైన్యం కోరినా చైనా వినిపించుకోలేదు. రోడ్డు నిర్మాణం పూర్తయితే.. ఈశాన్య భారతంతో మిగతా దేశాన్ని కలిపే బెంగాల్లోని సన్నని ప్రాంతం చికెన్ నెక్ చేరుకునేందుకు చైనాకు వీలవుతుంది. దేశ భద్రత పరంగా ఈ నిర్మాణాన్ని ముప్పుగా భావిస్తోన్న భారత్ వెంటనే రంగంలోకి దిగింది.
చైనా తన భూభాగాన్ని విస్తరించుకోవాలనే కుట్రతో భారత్, భుటాన్ భూభాగాలను తనలో బలవంతంగా కలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య రాకపోకలపై అజమాయిషీ ఉండాలని భావిస్తోంది. 2012నాటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా ఏకపక్షంగా డొకాలా కనుమను తమ భూభాగంగా ప్రకటించుకొని రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. దీనిని భారత సైనికులు అడ్డుకోవడంతో సమస్య మొదలైంది. ఈ ప్రాంతంలో ఎప్పటినుంచో చైనీయులుతమ పశువులకు గడ్డి మేపుతున్నారనీ, ఒకప్పుడు భుటాన్ ప్రజలు ఇక్కడ గడ్డికి రావాలంటే అప్పటి తమ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉండేదని చైనా వాదిస్తోంది. డోకాలా కనుమ తమదేనని చెప్పడానికి ఇంతకంటే రుజువేముంటుందని చెబుతోంది. భవిష్యత్‌లో మానససరోవర్ యాత్ర సాఫీగా సాగాలంటే వెంటనే సైన్యాన్ని వెనక్కి పంపాలని చైనా స్పష్టం చేస్తోంది. మరోవైపు భారత్‌పై దౌత్యపరమైన ఒత్తిడి ని తీసుకొస్తోంది. మా సార్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకు, మా ప్రాంతంలో సైన్యాన్ని మోహరించామని, భారత్ కూడా మా సార్వభౌమత్వాన్ని గౌరవించి మా భూభాగంలోకి వచ్చిన సైన్యాన్ని భారత్ వెనక్కి పిలిపించుకుంటుందని ఆశిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ గతవారం పేర్కొన్నారు. అలాగే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ వూ కియాన్ కూడా భారత్‌కు గట్టి హెచ్చరిక చేశారు. 1962 నాటి యుద్ధం గుర్తుందిగా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్మీ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని హెచ్చరించారు. అంతర్గత భద్రతతోపాటు చైనా, పాకిస్థాన్‌లతో యుద్ధానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై వుకియాన్ మండిపడ్డారు.
అయితే చైనా వాదనపై భారత్ ధీటుగా స్పందించింది. నాటి ఇండియాకు, నేటి ఇండియాకు చాలా మార్పుందని... కేంద్ర రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ... చైనాకు స్పష్టం చేశారు. 1962 ఇండియాకి, 2017 ఇండియాకి చాలా తేడా ఉందని, దానిని చైనా గుర్తించాలని జైట్లీ ఘాటుగా బదులిచ్చారు. డొకాలా ప్రాంతం భుటాన్ భూభాగమని, ఇండియన్ బోర్డర్‌కు దగ్గరా ఉందని, అక్కడ భారత్, భుటాన్ కలిసి భద్రత కల్పించేలా ఒప్పందం కుదిరిందని జైట్లీ వివరించారు. ఇతర దేశాల భూభాగాన్ని ఇండియా ఆక్రమిస్తోందన్న చైనా వాదన పూర్తిగా అబద్దమని ఆయన స్పష్టం చేశారు. అసలు సిక్కిం చరిత్రను ఓ సారి పరిశీలిస్తే... 1861 తరువాత సిక్కిం బ్రిటిషువారి అధీనంలో ఉండేది. 1947లో ప్రజాభిప్రాయం సిక్కింను భారతదేశంలో విలీనం చేయాలని వచ్చింది. అయితే స్వతంత్ర ప్రతిపత్తి కోసం అక్కడి ప్రజలు కోరడంతో... నాటి భారత ప్రధాని నెహ్రూ భారతదేశ రక్షణలో సిక్కిం స్వతంత్ర ప్రతిపత్తిని అంగీకరించాడు. మళ్ళీ ప్రజలలో ఉద్యమం బలపడింది. భారతదేశంలో విలీనం కావాలని 97.5% ప్రజలు తీర్పునిచ్చారు. 1975 మే 16న రాజరికం రద్దయి, సిక్కిం భారతదేశంలో విలీనమైంది. దీనిని అప్పటి చైనా గుర్తించలేదు. చివరకు 2003లో సిక్కింను భారతదేశంలో భాగంగా చూపెడుతూ చైనా అధికారికపటాన్ని విడుదల చేసింది.
చైనా భారత్ విషయంలో ఎందుకు దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఎలాంటి అలజడి లేకపోయినప్పటికీ... ఘర్షణతో చైనా ఆలోచనలు ఏవిధంగా ఉన్నాయ్.
ఓవైపు డొకాలా సరిహద్దు వద్ద రెండు దేశాలకు సరిహద్దు సమస్య జఠిలమవుతుంటే... రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినప్పటికీ... రెండు దేశాల మధ్య రగడ ఆందోళన కలిగిస్తోంది. చైనాతో భారత్ సరిహద్దు 3488 కి.మీ సరిహద్దు భూభాగాన్ని కలిగి ఉంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలపై ఎప్పట్నుంచో డ్రాగన్ కన్నేసింది. అదే సమయంలో... ఆసియాలో చైనా ఆధిపత్యానికి భారత్ సవాల్ విసురడం కూడా ఆ దేశం తట్టుకోలేకపోతోంది. వన్ బెల్ట్... వన్ రోడ్.. ఓబీఆర్ కు మద్దతివ్వకపోవడం కూడా చైనాకి కంటగింపుగా మారింది. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్ విషయంలోనూ భారత్ అభ్యంతరం ప్రకటించడం కూడా చైనా జీర్ణించుకోలేకపోతోంది. అదే సమయంలో అమెరికా, భారత్ కు అత్యంత మిత్రదేశంగా మారడాన్ని కూడా చైనా సహించలేకపోతోంది. భారత్ కు పక్కలో బల్లెంలా మారుతున్న పాకిస్తాన్ విషయంలో చైనా వైఖరిని భారత్ నిర్ద్వంద్వంగా తప్పుబడుతోంది. చైనా... అండదండలతో పాకిస్తాన్ కపట బుద్ధి ప్రదర్శిస్తోందని భారత్ విమర్శిస్తోంది. పాకిస్తాన్ కు అన్ని విధాలా సాయమందిస్తూ... భారత దేశాన్ని సంక్షోభంలోకి నెట్టాలని చైనా కుతంత్రాలు పన్నుతోంది. ఇప్పటికే చైనాలో పోర్టుల నిర్మాణం, వన్ బెల్డ్ వన్ రోడ్, పాకిస్తాన్ తో ఆర్థిక కారిడార్ నిర్మాణం ద్వారా... చైనాను అన్ని విధాలుగా వినియోగించుకుంటూ భారత్ పైకి ఎగదోస్తోంది. అదే సమయంలో... చైనా దూకుడును అడ్డుకునేందుకు భారత్ అన్ని రకాల దౌత్య చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్ విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తుంటే చైనా మాత్రం అడ్డుకుంటోంది. అదే సమయంలో... అమెరికా అంతర్జాతీయ తీవ్రవాదం విషయంలో భారత్ కు సహకరిస్తోంది. అమెరికా పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచుతోంది. చైనా ఆ విషయాన్ని తట్టుకోలేకపోతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భారత్ స్పష్టం చేస్తోంది. అదే సమయంలో అమెరికా పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచడం... ఇటీవల కశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న తీవ్రవాద నాయకుడు సలావుద్దీన్ ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించడం కూడా కీలకమైన విషయంగా గుర్తించాలి. ఉగ్రవాదం విషయంలో అమెరికా కఠిన వైఖరి అవలంబిస్తుంటే... చైనా మాత్రం పాకిస్తాన్ కు వంతపాడుతోంది. మన అభిప్రాయాన్నే అమెరికా కూడా పలు విషయాల్లో వ్యక్తం చేస్తుండటంతో... చైనా జీర్ణించుకోలేకపోతోంది. చైనా మీడియాలోనూ భారత్-అమెరికా సంబంధాలు బలోపేతమంటూ వస్తున్న కథనాలు అక్కడి విధాన నిర్ణేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయ్. ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని గండికొట్టాలని అమెరికా భావిస్తోంది. దాంట్లో భాగంగా భారత్ కు అత్యంత మిత్ర దేశంగా వ్యవహరిస్తోంది. ఇటీవల అమెరికా వెళ్లిన మోదీ ఆ పర్యటనలో రక్షణ, టెక్నాలజీ ఒప్పందాలను కుదుర్చుకోవడాన్ని కూడా చైనా సహించలేకపోతోంది. అన్నింటికీ మించి భారత్ కు గతంలో ఎన్నడూ లేని విధంగా చైనా రెడ్ కార్పెట్ పరవడాన్ని ఆ దేశంలో అసహనం ఎక్కువ కావడానికి కారణమవుతోంది.
ఆసియాలో తన పెద్దన్న... మరెవరూ కూడా చైనా దరిదాపుల్లోకి రాకూడదు. అదే చైనా లెక్క. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న తాను... తన మాట ప్రపంచ దేశాలు వినాలనుకుంటోంది. దాంట్లో భాగంగానే ఆసియాలో చైనా తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనపై దృష్టి సారించింది. భారత్ తో వాణిజ్యంలో దూకుడు ప్రదర్శిస్తున్న చైనా... ఎగుమతులను పెంచేస్తూ... మన దేశం నుంచి విదేశీమారకద్రవ్యా్న్ని రాబట్టుకుంటూ కూడా... మనపైనే అక్కసు ప్రదర్శిస్తుంటుంది. చైనా లెక్క ఒక్కటే... ఆసియాలో బలమైన శక్తిగా తాను మాత్రమే ఉండాలి. భారతదేశం చుట్టూ సమస్యలతో సతమతమవ్వాలి. అదే లక్ష్యంతో చుట్టూ ఉన్న దేశాలను భారత్ పై ఎగదోస్తోంది. ప్రపంచానికి శాంతి, సామరశ్యతను చాటిన మనదేశం... ఎప్పుడూ ఇంత వరకు దురాక్రమణ చేయలేదు. తన భూభాగంలో మరొకరు వస్తే మాత్రం సహించదు. విదేశీ నిబంధనలను ఇంత వరకు ఉల్లంఘించలేదు. దురదృష్టవశాత్తూ మన చుట్టూ ఉన్న అటు చైనా, పాకిస్తాన్ రెండు దేశాలు దీన్ని అలుసుగా చేసుకొని భారత్ భూభాగాన్ని ఆక్రమించడానికి కుయుక్తులు పన్నుతూనే ఉన్నాయ్.
చైనాకు భూదాహం ఎందుకు? విస్తీర్ణంలో పెద్ద దేశం... సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయ్. ప్రపంచంలో ఏదేశానికి లేని అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ... పక్క దేశాలపై డ్రాగన్ దూకుడెందుకు?
ప్రపంచంలోనే అతిపెద్ద భూభాగం కలిగిన చైనా... అతి పెద్ద జనాభాతోనూ తులతూగుతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ... ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోంది. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కలిగిన ఆసియా దేశంగా గౌరవం పొందుతోంది. అదే సమయంలో తన చుట్టూ ఉన్న భాభాగాలను, సముద్ర జలాలను కబళించాలన్న దుష్టపన్నాగాన్ని పన్నుతోంది. ఎక్కడ భూమి వివాదంలో ఉంటే చాలు అక్కడ వాలిపోతోంది. అమెరికాను తోసిరాజని అగ్రరాజ్యంగా ఎదిగేందుకు తహతహలాడుతున్న చైనా- నింగి, నేల, నీరుపై ఆధిపత్యం దిశగా అత్యంత వేగంగా పావులు కదుపుతోంది. చుట్టుపక్కల దేశాల్లో కీలక స్థావరాలు ఏర్పాటు చేసుకొని, భారత్‌ను ఎటూ కదల్లేని స్థితిలోకి నెట్టేందుకు అది పకడ్బంధీ వ్యూహం పన్నుతోంది. శత్రువు శత్రువు మిత్రుడు అన్న సూత్రాన్ని అనుసరిస్తూ ముందుగా పాకిస్థాన్‌ను బలోపేతం చేస్తోంది. బలూచిస్థాన్‌లోని గ్వదర్‌లో భారీ నౌకాశ్రయం నిర్మించడంతోపాటు రెండు జలవిద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలు ఏర్పాటుచేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఇప్పటికే భారీగా సైన్యాన్ని మోహరించిన చైనా- చిట్టగాంగ్, హంబన్‌టోట నౌకాశ్రయాలను నిర్మించి ఇవ్వటం ద్వారా బంగ్లాదేశ్, శ్రీలంకలనూ దారికి తెచ్చుకొంది. నేపాల్, మియన్మార్, మాల్దీవులు, థాయ్‌లాండ్ తదితర దేశాల్లోనూ రేవులు, రోడ్లు, రైల్వే మార్గాల నిర్మాణంలో చురుకైన పాత్ర పోషిస్తోంది. భారత్‌కు చిరకాలంగా మిత్రదేశంగా ఉన్న భూటాన్ సైతం చైనా గాలానికి చిక్కింది. ఆ దేశం పలు విషయాల్లో చైనాపై ఆధారపడటం కూడా భారత్ కు సమస్యగా మారుతోంది. అరుణాచల్ ప్రదేశ్, లడఖ్, నేపాల్, సిక్కిం, టిబెట్‌లలో తన ప్రాబల్యాన్ని మరింత విస్తరించుకోవడం ఈ రెండో వ్యూహం లక్ష్యం. ఉత్తరాన భూభాగం, మిగతా మూడు దిక్కుల్లో సముద్ర మార్గం ద్వారా భారత్‌ను అది దిగ్బంధిస్తోంది. పాకిస్తాన్ మీదుగా చైనా నిర్మిస్తున్న ‘ఒకే బెల్ట్ ఒకే కారిడార్’ ప్రాజెక్టుకు భారత్ భవిష్యత్‌లో అడ్డు రాకూడదని ఉద్దేశంతో వ్యూహాత్మకంగా చైనా దూకుడు వైఖరిని అవలంబిస్తోందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్ మౌలిక సౌకర్యాల నిర్మాణం పట్ల చైనా ఆగ్రహంతో ఉందని, ఆ అగ్రహాన్ని ఇక్కడ చూపిస్తోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. భారత్ సైన్యం ప్రధానంగా సరిహద్దు కదలికలపై దష్టి పెట్టేలా చేసి సిక్కింలోని అపార సహజ వనరులను దోచుకుపోవాలని చైనా చూస్తోందంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో చైనా అణు జలాంతర్గాములు తరచుగా భారత జలాల్లోకి దూసుకొస్తూ, దేశ భద్రతను మరింత ప్రమాదంలో పడేస్తున్నాయి. ఇండియాను దెబ్బ తీసేందుకు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్నీ చైనా ఉపయోగించుకుంటోంది. పాకిస్థాన్, మాల్దీవులు, నేపాల్ తదితర దేశాల్లో సమాచార వ్యవస్థల్ని నిర్వహించడం ద్వారా భారత్‌పై గగనతల నిఘాను చైనా మరింత పెంచింది. ఇరుగు పొరుగు దేశాల్లో ఏ ఒక్కటీ చైనాను కాదని... భారత్ వైపు మొగ్గు చూపేలా పరిస్థితులను అనుకూలంగా మలచుకోవడంలో విఫలం చెందడం విదేశాంగ విధాన వైఫల్యంగా భావించాలి.
చైనా పన్నిన పద్మవ్యూహాన్ని ఛేదించేదెలాగన్నది తీవ్రంగా ఆలోచించాల్సిన తరుణమిది. చైనా వైఖరిని నిశితంగా గమనించిన భారత్... అన్ని విధాలుగా ఆలోచించి ముందడుగేయాలి. మెత్తగా ఉంటే ఎవరికైనా మొత్తబుద్దేస్తుంది. భారత్ విషయంలో ఇప్పుడు చైనా చేస్తోందదే. ఆర్థికంగానూ, సైనికంగానూ ఆ దేశాన్ని ఢీకొనే స్థాయికి ఎదిగినప్పుడే, అది ఒదిగి ఉంటుంది. ప్రభుత్వం తక్షణం కొన్ని చర్యలు చేపడితే పరిస్థితిలో కొంత మార్పు రావచ్చు. లడఖ్‌నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు గల సరిహద్దు ప్రాంతమంతటా విస్తృత స్థాయిలో రోడ్డు, రైలు మార్గాలు ఏర్పరచాలి. సరిహద్దులకు ఆనుకొని పెద్ద సంఖ్యలో వైమానిక స్థావరాలు నిర్మించాలి. పర్వత సైనిక దళాన్ని మోహరించాలి. టిబెట్ సరిహద్దులో చైనా అనుసరిస్తున్న ఆ విధానమే ఇండియాకు ఆదర్శం కావాలి. చైనా నుంచి దిగుమతులపై భారత్ అధికంగా ఆధారపడుతోంది. ముఖ్యంగా కంప్యూటర్లు, సెల్ ఫోన్లు చైనా నుంచి భారత్ కు దిగుమతి అవుతున్నాయ్. దిగుమతులు తగ్గించుకోవడం ద్వారా ఆ దేశంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.
వియత్నాం, జపాన్ వంటి దేశాలతో రాజకీయ, సైనిక సంబంధాలను పెంపొందించుకోవడం- చైనాపై ఒత్తిడి పెంచేందుకు మరోదారి. సైనికంగా చైనాకు ఎదురొడ్డి నిలువలేని నేపథ్యంలో ఇలాంటి ఆర్థిక, దౌత్యపరమైన చర్యలు చేపట్టాలి. సౌత్ చైనా విషయంలో అమెరికా సహకారంతో చైనాకు చెక్ పెట్టాలి. ఇప్పటికే సౌత్ చైనాలో తిష్టవేసిన అమెరికా జలాంతర్గాములు... ఇతర దేశాల సముద్ర జలాల విషయంలో... చైనా జోక్యం సహించబోమని తేల్చి చెప్పింది. భారత్ కూడా ఇదే వాదన విన్పిస్తోంది. ఎవరి జలాలను వారే వినియోగించుకోవాలన్నదే భారత్ విధానం.
భారతదేశం చైనా విషయంలో ఎప్పుడూ దూకుడు ప్రదర్శించలేదు. ఒక్క చైనా ఏంటి? చిన్న చితకా దేశాల విషయంలోనూ అదే వైఖరి అవలంభించింది. ప్రపంచంలో ఏ దేశంపైనా భారత్ ఇంత వరకు దాడి చేయలేదు. ఎవరి అంతరంగిక వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోలేదు. అయితే భారత్ చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా... మన దేశంతో సన్నిహితంగా మెలుగుతూ.... మన నుంచి ప్రయోజనాలు పొందుతూ కూడా మనపైనే అస్త్రాలు ఎక్కుపెడుతున్నాయ్. ఇందుకు డ్రాగన్ దొంగ దెబ్బ కారణం. మన చుట్టూ ఉన్న దేశాలతో భారత్ సోదర సంబంధాలను కొనసాగిస్తోంది. ఏ దేశ ఆంతరింగక వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోకుండా... అందరి పట్ల ప్రజాస్వామ్య వైఖరిని అవలంబిస్తోంది. అయితే చైనా మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. భారత్ కు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న దేశాలను దువ్వుతుంది. మనపై మరింత ఉసిగొల్పుతూ చికాకు కలిగిస్తుంది. ముఖ్యంగా... భారత్ కు శత్రుదేశమైన పాకిస్తాన్ చైనాకు మిత్ర దేశం... భారత్ కు వ్యతిరేకంగా ఆ దేశం ఏం చేసినా చైనా మాత్రం చూసిచూడనట్టుగా వ్యవహరిస్తోంది. మనతో కలిసి వస్తున్న దేశాలను తన దారిలోకి తెచ్చుకునేందుకు తాయిలాల మంత్రాన్ని ఉపయోగిస్తోంది. చైనా చీప్ బుద్ధితో భారత్ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా దేశానికి తీవ్రవాద ముప్పు రోజు రోజుకు ఎక్కువవుతోంది. పాకిస్తాన్ విషయంలో భారత్ వైఖరికి చైనా మద్దతు లభించకపోవడంతో ప్రపంచ దేశాలు తీవ్రవాద విషయంలో ముందడుగు వేయలేకపోతున్నాయ్. పాకిస్తాన్ చైనాకు వ్యూహాత్మక భాగస్వామి. ప్రపంచ తీవ్రవాదానికి పెద్దన్న పోషిస్తున్న గ్రూపులకు పాకిస్తా్న్ మద్దతిస్తున్నా... చైనాకు ఆ వ్యవహారాలు పట్టవ్. ఎందుకంటే... పాకిస్తాన్... చిచ్చు రేపుతుంది భారత్ లో కదా... భారత్ అస్థిరపడితే మాకే లాభం కదా... అందుకు పాకిస్తాన్ కు కావాల్సిన మౌలిక సదుపాయాలను అందిస్తాం. ఆ దేశంలో పోర్టులను నిర్మిస్తుంది. ఆర్థిక కారిడార్లతో వాణిజ్యాన్ని పెంచుతోంది. అదే సమయంలో మన చుట్టూ ఉన్న దేశాలను సైతం దువ్వుతోంది. ప్రపంచదేశాలకు అమెరికా పెద్దన్న పాత్రలో ఎలా ఒదిగిందో... తాను ఆసియా ఖండంలోని అన్ని దేశాలకు బిగ్ బ్రదర్ నన్న భావనలోకి చైనా వెళ్లిపోయింది. అదే కోవలో ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఉత్తర కొరియాను ఎగదొస్తుందీ చైనాయే. చైనా ఆర్థిక దన్ను లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయలేని ఉత్తర కొరియాకు అణ్వాయుధ సంపత్తిని అందిస్తోంది. ప్రపంచదేశాలను రోజుకో రకంగా బెదిరిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు అన్ని విధాలుగా సహకరిస్తూ... అమెరికాను ఇరకాటంలో పడేస్తోంది. విస్తృత ఆర్థిక వ్యవస్థలుగా మన్నన పొందుతున్న జపాన్, దక్షిణకొరియాలపై పరోక్షంగా చైనా యుద్ధాన్ని ప్రకటిస్తోంది. అదీ కూడా తనకు నమ్మకస్తుడైన కిమ్ ద్వారా. ఇలాంటి పరిణామాలు సహజంగా అమెరికాలో చైనా పట్ల ఆగ్రహానికి కారణవుతున్నాయ్. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా కీలక పాత్ర పోషిస్తున్న చైనా విషయంలో అమెరికా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇక్కడే చైనాకు భారత్ నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. కమ్యూనిస్టు దేశమైన చైనా... ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే డ్రాగన్... భారత్ నుంచి ఎంత సానుకూలత దృక్పథం ఎదురవుతున్నా... వ్యతిరేక కోణంలోనే పనిచేస్తోంది. భారత్ ను అస్థిరపర్చేందుకు డ్రాగన్ చేయని కుట్రలు లేవు. ఇటీవల శ్రీలంకతోనూ సంబంధాలను బలోపేతం చేసుకుంటామంటూ అక్కడ పోర్టు నిర్మాణానికి తెగబడింది. అయితే భారత్ దౌత్యవిజయం సాధించడంతో అది వెనక్కి వెళ్లింది. ఎక్కడికక్కడే ఇష్టానుసారం వ్యవహరిస్తూ... భారత్ ను నిలువరించే గేమ్ ప్లాన్ చైనా ఇంప్లిమెంట్ చేస్తోంది.
అయితే ఇటీవల కాలంలో భారత్ ప్రపంచదేశాలతో కొనసాగిస్తున్న దౌత్యపరమైన సంబంధాలు చైనాను ఇరుకునపెడుతున్నాయ్. ముఖ్యంగా అమెరికా ఇప్పుడు భారత్ కు అత్యంత మిత్ర దేశంగా మారడాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. తాజా దూకుడు వెనుక ఉద్దేశం కూడా అదే. భారత్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలన్న ఒకే లక్ష్యంగా డ్రాగన్ దొంగ బుద్ధిని ప్రదర్శిస్తోంది.
ఇదీ చైనా దురాక్రమణ ఎత్తుగడ. తన చుట్టూ ఉన్న దేశాలన్నీ తనకు సాహో అనాలి. ఎవరూ కూడా తన ఆధిపత్యాన్ని విభేదించకూడదు. అందరూ తనిచ్చిన తాయిలాలు తీసుకొని భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించాలి. భారత్ ను అస్థిరపర్చాలి. ఇప్పుడు సిక్కింపై దాడికి తెగబడ్డ డ్రాగన్ రేపు మరో చోట దాడికి సిద్ధపడొచ్చు. చైనా అకృత్యాలను అంతర్జాతీయంగా భారత్ ఎండగట్టాలి. చైనా సాగిస్తున్న ఆర్థిక మాఫియాను కంట్రోల్ లో పెట్టేందుకు భారత్ దూకుడు ప్రదర్శించాలి. ఆసియా ఖండంలో మనకంటూ ప్రత్యేకత సంతరించుకున్న భారత్... చైనా విషయంలో కఠిన వైఖరి అవలంబించాల్సిన సమయం ఆసన్నమైంది.
No comments:
Post a Comment