Friday, 14 July 2017

ధర్నాచౌక్ తరలింపు ఆందోళన


ధర్నా చౌక్ విషయంలో విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. ధర్నా చౌక్ తరలింపు ఆలోచన మానుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఒక ధర్నా చౌక్ ఎత్తి వేస్తే ..నగరమంతా ధర్నా చౌక్ గా మారుతుందని విపక్షాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.  రాష్ట్ర ప్రభుత్వ ధర్నా చౌక్ తరలింపు ఆలోచనపై విపక్షాలు భగ్గుమంటున్నాయ్. ప్రజల ఆందోళనలను, కష్టాలను చెప్పుకునే ధర్నా చౌక్ ను ఇందిరాపార్క్ వద్ద నుంచి తరలించడం అన్యాయమని అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చౌక్ తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఛలో ధర్నా చౌక్ తో సర్కారు మెడలు వంచుతామని నేతలు స్పష్టం చేశారు.  ఇందిరా పార్క్ వద్దే ధర్నా చౌక్ కొనసాగించాలని జేఏసీ ఆధ్వర్యం లో నేతలు గన్ పార్క్ వద్ద మౌన దీక్ష చేశారు. ధర్నా చౌక్ తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేదంటే ..ఈ నెల 15 న ఛలో ధర్నా చౌక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జేఏసీ ఛైర్మన్ కోదండరాం హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే మరింత ప్రజాస్వామ్యం , స్వేచ్ఛ లభిస్తాయని భావించామని...  కానీ టీఆర్ఎస్ సర్కార్ ప్రజల హక్కులను కాలరాస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ధర్నా చౌక్ ను యథావిధిగా కొనసాగించేవరకు పోరాటం ఆపేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రభుత్వ మెడలు వంచైనా ధర్నా చౌక్ తరలింపును అడ్డుకుంటుమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. పేద ప్రజల గొంతుకైనా ధర్నా చౌక్ ను లేకుండా చేయడం దుర్మాగమైన చర్యగా అఖిల పక్ష నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ని కొనసాగించితీరాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో  డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షం లో ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తామంటూ నినదిస్తున్నాయ్.  ప్రతిపక్షాల ఆందోళనల  నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

No comments:

Post a Comment