Friday, 14 July 2017

భారత్ జట్టు కోచ్ ఎంపిక-ట్విస్ట్ లు

క్రికెట్ లెక్కలు
క్రికెట్ ఆటపై లెక్కలు ఎప్పుడూ పక్కాగా ఉండవ్. నచ్చితే అందలం... నచ్చకుంటే అధఃపాతాళం క్రికెట్లో ఆటలో ఎప్పుడూ అంతే. క్రికెట్ అంటేనే కాసులు గలగలలు. క్రికెట్ ఆట కోసం పరితపించిన కుంబ్లే ఇప్పుడు స్టాండ్స్ లో కూర్చుంటే... జాలీ బాయ్ క్రికెట్ కోచ్ గా ఖరారయ్యాడు. ప్లేబాయ్... భారత్ జట్టుకు  క్రికెట్ కోచ్ గా ఎంపికైపోయాడు. అయితే మొన్నటి వరకు కోచ్ గా ఉన్న కుంబ్లే ఒక్కడే బాధ్యతలు చేపట్టినప్పటికీ...  ఇప్పుడు కొత్తగా నలుగురు కోచ్ లు భారత్ జట్టుతో కలిసి పనిచేయబోతున్నారు.  ముందుగా కోచ్ కు మాత్రమే ఇంటర్వ్యూలు కోరిన బీసీసీఐ, క్రికెట్ అడ్వైజరీ కమిటీ సూచనలకు తలొగ్గి బ్యాటింగ్ , బౌలింగ్ కోచ్ లను నియమించింది.
కోచ్ ఎవరో ఖరారు కాలేదంటూ బీసీసీఐ పెద్దలు గప్ చుప్ అంటున్న సమయంలోనే మీడియాలో కోచ్ ఖరారంటూ వార్తలు రావడం సంచలనం సృష్టించింది.  పెద్దల లెక్కలు కుదరడంతో ప్రకటన వచ్చేసింది. ఆట ఎప్పుడూ   క్రీడాకారులు ఆడేవారు. అయితే కొచ్చే ఫ్రేమ్ లో ఇప్పుడు ఆడేందుకు కోచ్ లు సిద్ధమయ్యారని చెప్పుకోవాలి. భారత్ జట్టు కోచ్ ఎంపిక తాజా పరిణామాలపై ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్

కోచ్ ఎంపిక కాలేదని... కోచ్ ఎన్నుకోవడానికి టైమ్ కావాలని... కోచ్ నియామకం అంత వేగంగా తీసుకునేది కాదంటూ సెలక్షన్ కమిటీ సభ్యుడు, భారత మాజీ కెప్టెన్ గంగూలీ ప్రకటన చేసిన 24 గంటలు గడవకముందే.... కోచ్ గా రవిశాస్త్రిని ఎంపిక చేస్తూ... బీసీసీఐ ప్రకటన చేసింది. రవిశాస్త్రి టీంఇండియా కోచ్ నియామకం... దారి తీసిన మొత్తం పరిణామాలను ఓసారి పరిశీలిద్దాం...
భారత్ జట్టు కోచ్ ఎంపిక చాలా గందరగోళానికి కారణమయ్యింది. గెలుపు మాంత్రికుడుగా పేరొందిన అనిల్ కుంబ్లే కోచ్ గా కొనసాగుతున్న సమయంలోనే... కోచ్ కావాలంటూ ప్రకటన వచ్చి సంచలనం సృష్టించింది.
అప్పటి వరకు కుంబ్లే, కోహ్లీ మధ్య పెద్దగా లొల్లి లేదనకుంటున్న సమయంలో... అకస్మాత్తుగా ఇద్దరి మధ్య పెద్ద అగాధమే ఏర్పడిందంటూ వార్తలు వచ్చాయ్. అదే సమయంలో కుంబ్లే, కోహ్లీ మధ్య సయోధ్య కోసం రెండు వైపుల నుంచి ప్రయత్నాలు జరిగినప్పటికీ... అవి ఫలించలేదు. ఇద్దరి మధ్య గ్యాప్ ను అంతకంతకూ పెంచాయ్. గ్యాప్ తగ్గలేనంత పెరగడంతో... కోచ్ పదవి నుంచి కుంబ్లే తప్పుకున్నాడు. వెస్టిండీస్ టూర్ వరకు కొనసాగాలంటూ బోర్డు చెప్పినప్పటికీ... కుంబ్లే వాటిని ఖాతరు చేయలేదు. కోచ్ ఎంపిక పనిలో నిమగ్నమైన క్రికెట్ అడ్వైజరీ కమిటీ... వేట మొదలుపెట్టింది. దిగ్గజ క్రీడాకారులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ జట్టు కోచ్ ఎంపిక విషయంలో సుధీర్ఘ కసరత్తు చేశారు.
ఈనెల 10న కోచ్ పదవికి ఇంటర్వ్యూలు జరగ్గా టీం ఇండియా కోచ్ ప్రకటన వెలువడుతుందని అందరూ భావించారు. అయితే కోచ్ ప్రకటన మాత్రం రాలేదు. కోచ్ ఎంపిక ఇప్పటికిప్పుడు అయ్యేది కాదనన అభిప్రాయాన్ని గంగూలీ విన్పించాడు. అయితే బోర్డు మాత్రమే... క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఆలోచనతో విభేదించింది. కోచ్ పదవి ఇక ఎంత మాత్రం ఖాళీగా ఉండరాదన్న నిర్ణయానికి వచ్చింది. మీర ఎవరిని సెలక్ట్ చేశారో చెప్పాలంటూ సీఏసీ సభ్యులను బోర్డు విస్పష్టంగా కోరింది. ఎందుంకేట...  కోచ్ ఎంపిక విషయాన్ని ఎక్కువ కాలం సస్పెన్స్ లో ఉంచాలని బోర్డు భావించలేదు. అది జట్టుకు, ఆటగాళ్లకు మంచిది కాదనన అభిప్రాయంలో బోర్డు ఉంది.
ప్రకటన చేయడానికి ముందే వచ్చిన లీకులతో అప్రమత్తమైన క్రికెట్ పాలన మండలి... ఉత్కంఠకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో రవిశాస్త్రిని భారత్ జట్టు కోచ్‌గా ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం రాత్రి ప్రకటించింది. మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఎంపికకాగా.. విదేశీ పర్యటనలకు రాహుల్‌ ద్రవిడ్‌ బ్యాటింగ్‌ సలహాదారుగా నియమించినట్టుగా పేర్కొంది. గతంలో భారత్ జట్టుకు టీం డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి తొలిసారిగా జట్టుకు కోచ్ గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కోచ్ ఎంపికకు సంబంధించి కూలంకుషంగా చర్చించింది. మంగళవారం క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ , భారత్ జట్టు కెప్టెన్ కోహ్లీతో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. మొత్తం కోచ్ ఎంపిక ప్రాసెస్ కు సంబంధించిన సమాచారాన్ని కోహ్లీతో సభ్యులు చర్చించారు. శాస్త్రి, సెహ్వాగ్ గురించి ముగ్గురు సభ్యులు కోహ్లీతో చర్చించారు. అయితే అప్పటి వరకు తన అభిప్రాయాన్ని బలంగా రుద్దని కోహ్లీ... కోచ్ గా తమకు రవిశాస్త్రే కావాలని పట్టుబట్టారు. దాంతో ఇక సీఏసీ సభ్యులకు మరో నిర్ణయం చెప్పడానికి అవకాశం లేకుండాపోయింది.  క్రికెట్ అడ్వైజరీ కమిటీకి కోచ్ ఎంపిక అంత వీజీగా ముగియలేదు. శాస్త్రి, సెహ్వాగ్ మధ్య గట్టి పోటీ వచ్చిందన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే కెప్టెన్ కోహ్లీ రవిశాస్త్రి విషయంలో మొగ్గుచూపడంతో... ఇక అందరూ కోహ్లీ నిర్ణయానికి మొగ్గు చూపారు.
కోచ్ ఎంపికగా రవిశాస్త్రి విషయంలో క్రికెట్ మండలిలో కీలకంగా వ్యవహరిస్తున్న గంగూలీకి కొన్ని అభ్యంతరాలున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో టెండుల్కర్,  గంగూలీ ని కన్విన్స్ చేసినట్టుగా చెబుతున్నారు. సచిన్ మొదట్నుంచి జట్టు సభ్యుల కోరికను మన్నించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాడు.  2019 ఐసీసీ వరల్డ్ కప్ వరకు రవిశాస్త్రి టీం కోచ్ గా వ్యవహరించనున్నట్టు బీసీసీఐ తేల్చి చెప్పింది. బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ ను ఎంపిక చేయాలంటూ రవిశాస్త్రి ప్రతిపాదించగా... గంగూలీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్టుగా సమాచారం.  అయితే అప్పటి వరకు శాస్త్రిని, తీవ్రంగా విభేదిస్తున్న మాజీ కెప్టెన్ గంగూలీ... తెరపైకి బౌలింగ్, బ్యాటింగ్ కోచ్ లను తీసుకొచ్చాడు. బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ను, బ్యాటింగ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ అవసరమన్న అభిప్రాయాన్ని బీసీసీఐకి కలిగించాడు.  జహీర్ జట్టుకు ఇప్పుడెంతో అవసరమన్న అభిప్రాయాన్ని గంగూలీ కుండబద్ధలు కొట్టాడు. అదే సమయంలో బంగార్ ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్ గా ఉన్నప్పటికీ...  భారత్ జట్టు విదేశీ టూర్ల సమయంలో అందుబాటులో ఉండాలని కోరింది.
జట్టుకు జహీర్ ఖాన్ సేవలు ఎంతో అవసరమని గంగూలీ కమిటీ ముందు స్పష్టంగా చెప్పాడు. కోచ్ విషయంలో సౌరవ్ ఏవిధంగా రాజీ ధోరణి అనుసరించే... అదే విధంగా... బౌలింగ్ కోచ్ విషయంలోనూ గంగూలీ నిర్ణయాన్ని కమిటీ సభ్యులు ఆమోదించినట్టుగా తెలుస్తోంది. జహీర్ ఖాన్ ఇప్పుడు జట్టులో ఉనన సభ్యులందరితో మంచి సంబంధాలు కలిగి ఉండటం.... బౌలింగ్ విషయంలో అసాధారణ పాఠవాలు కలిగి ఉండటం కూడా కలిసొచ్చిన పరిణామంగా చెప్పవచ్చు.  
గెలిచిందెవరు... నిలిచిందెవరు... కోచ్ గా రవిశాస్త్రిని నియమించుకోవాలని పంతం పడుతున్న కోహ్లీ ఎట్టకేలకు తన మాటే నెగ్గించుకున్నాడు. కోచ్ ఎంపిక సలహా మండలిని కాదని... బోర్డు పెద్దల ద్వారా తన మాటకే జై కొట్టించుకున్నాడు కోహ్లీ. ఓవరాల్ గా  క్రికెట్ పెద్దలు కెప్టెన్ మాటకే విలువిచ్చారు. రవిశాస్త్రి నియామకానికి పచ్చజెండా  ఊపారు.
కోహ్లీ ఇప్పుడు దూకుడు మీద ఉన్న భారత్ జట్టు నాయకుడు. కోహ్లీ విజయాల సారధిగా నిలిచిపోవాలని కలలు గంటున్నాడు. గత ఏడాదిగా భారత్ జట్టు ఎన్నో విజయాల్లో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. మరెన్నో పరాజయాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. అయితే కోహ్లీ కోచ్ కుంబ్లే విషయంలో అనేక రిజర్వేషన్లన్నట్టుగా కన్పించింది. కుంబ్లే స్ట్రిక్ట్ గా ఉంటాడని... కుంబ్లే కోచింగ్ తీరుపై జట్టు సభ్యులంతా గుస్సాగా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే కోచ్ గా కుంబ్లే రికార్డు స్థాయిలో సాధించిన విజయాలు పక్కకపోయే విభేదాలు ముందుకు వచ్చాయ్.
అప్పటి వరకు కుంబ్లే, కోహ్లీ మధ్య సఖ్యత కుదుర్చాలని చూసిన బీసీసీఐ, సీఏసీ సభ్యులు లెక్కలు ఫలింలేదు. ఇద్దరి మధ్య అసాధారణ రీతిలో గ్యాప్ ఉందన్న అభిప్రాయం నెలకొనడంతో ఇక బోర్డు సభ్యులంతా చేసేదేం లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. కోచ్ ఎంపికకు గడువును పొడిగించారు. అప్పటి వరకు రేసులో ఉన్న సెహ్వాగ్, టామ్ మూడీ పేర్లు ప్రముఖంగా విన్పించాయ్. రవిశాస్త్రి బరిలోకి దిగడంతో ఇద్దరు వెనక్కిపోయారు. అయితే సెహ్వాగ్ విషయంలో గంగూలీ ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ...సచిన్ వారించడంతో దాదా వెన్కకి తగ్గాడు. అదే సమయంలో శాస్త్రికి చెక్ పెట్టేందుకు కొత్త ఫార్మూలాను బయటకు తీశాడు. ముల్లును ముల్లుతోనే తీయాలన్న లెక్కను
గంగూలీ ఇంప్లిమెంట్ చేశాడు. బౌలింగ్ కోచ్ గా తనకు అనుకూలడని రవిశాస్త్రి రికమండ్ చేయడంతో... ఆ ప్రతిపాదనపై సౌరవ్ కస్సుమ్నాడు. జహీర్ ను అనుకోకుండా జట్టు టీంలోకి తీసుకొచ్చాడు. సాధారణంగా...  జట్టు కూర్పు విషయంలో కెప్టెన్, కోచ్ కీలకం. వారి చెప్పిందే జరుగుతుంది. అయితే ఇప్పుడు జహీర్ రోల్ ఎలా ఉంటుందన్న అభిప్రాయం క్రీడా వర్గాల్లో నెలకొంది.
జహీర్ ఖాన్ జట్టులోకి రావడం ఎంతో బలమన్న అభిప్రాయం బీసీసీఐలోనూ ఉంది. అందుకే దాదా నిర్ణయానికి బోర్డు పెద్దలు ఠక్కున ఓటేశారు. 38 ఏళ్ల జహీర్ ఖాన్ 92 టెస్టు మ్యాచ్ లలో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. 200 వన్డే మ్యాచ్ లు ఆడిన జహీర్ 282 వికెట్లను పడగొట్టాడు. టెస్టుల్లో 311 వికెట్లను కూలగొట్టాడు. ప్రస్తుతం ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కెప్టెన్, బౌలింగ్ కోచ్ గా జహీర్ నేతృత్వం వహిస్తున్నాడు.  అయితే అదే సమయంలో రవిశాస్త్రి అధికారాలను క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఏవిధంగా పరిమితి విధిస్తుందంటూ కామెంటేటర్ హర్ష భోగ్లా ట్విట్ చేయడం విశేషం. విదేశీ పర్యటనల్లో బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్ ఉంటే... రవిశాస్త్రి టీం డైరెక్టర్ బాధ్యతలు తప్ప చేయడానికి ఏమీ ఉండదన్న అభిప్రాయాన్ని భోగ్లే వ్యక్తం చేశాడు.  ఇదే అభిప్రాయాన్ని మరికొంత మంది నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు.  అయితే... జహీర్ ఎంపికకు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి మాట్లాడుతూ... ప్రస్తుతం భారత్ జట్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్లందరికీ... ఎంతగానో ఉపయోగపడతాడంటూ... వ్యాఖ్యానించడం విశేషం. గత రెండేళ్లుగా జహీర్ ఎంతో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నట్టుగా కితాబిచ్చాడు.
గతంలో భారత్ జట్టు డైరెక్టర్ గా కొనసాగుతున్న సమయంలో...  కోచ్ గా ఎంపిక కావాలన్న కృతనిశ్చయంతో ఉన్న రవిశాస్త్రి ఆశలపై క్రికెట్ అడ్వైజరీ కమిటీ నీళ్లు చల్లింది. అదే సమయంలో భారత్ జట్టుకు సుధీర్ఘకాలం కుంబ్లే కోచ్ గా ఎంపికవుతాడని భావిస్తున్న తరుణంలో... జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండు యాధృచ్ఛికమే అనుకోవాలి. గతంలో ఇంటర్వ్యూకు హాజరు కాలేదని శాస్త్రి విషయంలో గంగూలీ వీటో చెప్పాడు. రవిశాస్త్రి కోచ్ కావాలన్న కృతనిశ్చయం లేదని... నాన్ సీరియస్ మనిషంటూ నిప్పులు చెరిగాడు. బ్యాంకాక్ లో వేసవి విడిదిలో ఉన్న రవిశాస్త్రి నాడు హాజరు కాకపోవడం కూడా సంచలనం సృష్టించింది. అయితే కుంబ్లే, కోహ్లీ మధ్య మనస్పర్థలు అంతకంతకూ ఎక్కువవుతుండటంతో... మళ్లీ తెరపైకి రవిశాస్త్రి వచ్చేశాడు. జట్టు కోచ్ విషయంలో కుంబ్లేను కూడా దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ కోరగా... కోచ్ రేసులో కుంబ్లే కూడా నిలిచాడు. అయితే ముందుగా కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు చేయలేదు. ఓవైపు కుంబ్లే, కోహ్లీ మధ్య వివాదం, కోచ్ దరఖాస్తుకు సమయం పెంచడంతో రంగంలోకి  శాస్త్రి దిగాడు.
ఆటగాళ్లు ఆడింద ఆట... పాడింది పాట కావాలంటే... జట్టుకు రవిశాస్త్రే కరెక్టన్న అభిప్రాయం విన్పించింది. శాస్త్రి పలు వ్యూహాలు అమలు చేయడంలో దిట్టగా... కెప్టెన్ గాను మంచి గుర్తింపే ఉంది. మాజీ కెప్టెన్ ధోనీతోనూ,  కోహ్లీతో రవిశాస్త్రికి ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా అడ్వాంటేజ్ గా చెప్పుకోవాలి.

కోచ్ ఎంపిక విషయంలో నాటకీయ పరిణామాలెన్నో చేటుచేసుకున్నాయ్. భిన్న వర్గాలుగా ఉన్న ఇద్దరు ఒకే నిర్ణయం తీసుకోవడం ఎప్పుడూ సాధ్యం కాదు.... అయితే గంగూలీని దారిలోకి తెచ్చేందుకు కోహ్లీ వాడిన బాణం సచిన్ టెండుల్కర్...  కోచ్ ఎంపిక ఎంతో అనూహ్యంగా జరిగింది. హెడ్ కోచ్ కు తోడు తోక కోచ్ ల అంశంపై ఇప్పుడు క్రీడావర్గాల్లో ఆసక్తికర చర్చ జరగుతోంది.
ఉత్కంఠ డ్రామా తర్వాత కోచ్ గా రవి శాస్త్రి ఎంపికపై భారత్ జట్టు మాజీ ఆటగాళ్లు అభినందనలు తెలిపారు.  ట్రేజర్ బుల్లెట్ అంటూ రవిశాస్త్రికి అభినందనలు వెల్లువెత్తాయ్. కోచ్ గా రవిశాస్త్రి తొలి విదేశీ పర్యటన శ్రీలంకతో ఆటబోతోంది. మూడు టెస్టు మ్యాచులు, ఐదు వన్డే మ్యాచులతోపాటు, ఒక ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లతో జులై 26 నుంచి ప్రారంభం కాబోతోంది.  జహీర్ ను టీం బౌలింగ్ కోచ్ గా నియమించడం తనకు సంతోషాన్నిచ్చిందని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. తాజా బాధ్యతల్లో విజయంసాధించాలని కోరుకుంటున్నానన్నాడు. ఆల్ రౌండర్ సురేష్ రైనా సైతం జహీర్, రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ కు అభినందనలు తెలిపాడు. ముగ్గురి నేతృత్వంలో టీం ఇండియా మంచి ఫలితాలు రాబడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అదే సమయంలో కుంబ్లేకు జహీర్ ఖాన్, ద్రవిడ్ అవసరం లేకపోయిందని... రవిశాస్త్రికి మాత్రం ఇద్దరి అవసరం ఉందంటూ శిషిర్ హట్టాంగ్డే పేర్కొన్నాడు. ఇక జహీర్ ను బౌలింగ్ కోచ్ గా నియమించడం అద్భుతమంటూ మాజీ భారత్ జట్టు బ్యాట్సమెన్ మహ్మద్ ఖైప్ అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి నేతృత్వంలో టీం పనితీరు మెరుగవ్వాలని కోరుకుంటున్నట్టుగా చెప్పాడు. ఇకనైనా టీం సభ్యులు క్రికెట్ పై ఫోకస్ పెట్టాలని చురకలంటించాడు.
టీం ఇండియాకు త్రిమూర్తులు కలయిక బలాన్నిస్తుందని రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ అసోసియేషన్ సైతం రవిశాస్త్రి, జహీర్ కు  అభినందనలు తెలియజేసింది. 2005 నుంచి టీం ఇండియా కోచ్ గా ఎంపిక కావాలని ప్రయత్నిస్తున్న టామ్ మూడీ నిరీక్షణకు తెరపడలేదన్న అభిప్రాయాన్ని క్రికెట్ ప్రియులు వ్యక్తం చేశారు.  టీం ఇండియా ప్రధాన కోచ్‌ ఎవరవుతారన్న ఉత్కంఠ నెలకొన్నప్పటికీ... బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్‌ ఎంపిక అనూహ్య పరిణామంపై క్రీడాభిమానుల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. భారతదేశానికి సేవలందించిన అత్యుత్తమ బౌలర్లలో జహీర్ కు మంచి పేరుంది. పదునైన బౌలింగ్‌తో జట్టుకు ఎన్నో అపురూప విజయాలు అందించాడు. ధోని నాయకత్వంలో భారత్ జట్టు టెస్టు జట్టుల్లో నెంబర్ 1 కావడంలో జహీర్ పాత్ర కీలకమైనది. జహీర్ తాను బౌలింగ్ లో రాటుదేలుతున్న సమయంలో జట్టులోని సహచర బౌలర్లకు మార్గనిర్దేశం చేసేవాడు. అయితే గాయాల కారణంగా... జట్టుకు కీలక సమయంలో నాయకత్వం వహించలేకపోయాడు జహీర్.
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా కెరీర్ ప్రారంభించిన రవిశాస్త్రి అనతికాలంలోనే జట్టుకు ఆల్ రౌండర్ గా విశేష సేవలందించాడు. 1981 లో న్యూజీలాండ్ తో టెస్టుల సందర్భంగా జట్టులోకి ప్రవేశించాడు. స్పిన్ బౌలింగ్ ఆడటంలో జోష్ చూపించే శాస్త్రి, ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కోవడంలో మాత్రం తడబడేవాడు. రవిశాస్త్రి ఆటగాడిగా, టీం ఇండియా కెప్టెన్ గా అద్భుత  ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. 151 టెస్టు మ్యాచ్ లు ఆడిన శాస్త్రి 3830 పరుగులు చేశాడు. టెస్టుల్లో 35.79 సగటు కలిగి ఉన్నాడు. ఆ రోజుల్లో టీం ఇండియాకు కొరతగా ఉన్న ఆల్ రౌండర్ల సమస్యను కొంత వరకు శాస్త్రి తీర్చాడని చెప్పవచ్చు. 150 వన్డే మ్యాచులలో ఆడిన శాస్త్రి మొత్తం 3108 పరుగులు సాధించాడు. 129 వికెట్లను కూల్చాడు. వన్డేల్లో శాస్త్రి సగటు 36.4గా ఉంది. టెస్టు మ్యాచుల ప్రారంభంలో 10 నెంబర్ ఆటగాడిగా బరిలో దిగేవాడు.
1985 ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ లో శాస్త్రి తొలిసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సీరిస్ లో 182 పరుగులు సాధించిన శాస్త్రి, 8 వికెట్లను కూల్చి... అద్భుత ప్రదర్శనకు గాను ఆడి గార్ ను అందుకున్నాడు. 1984-85 రంజీ సీజన్లో ముంబయ్ తరపున ఆడిన శాస్త్రి ఢిల్లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 91 పరుగులకు 8 వికెట్లు కూల్చి రికార్డు సృష్చించాడు. చాలా కెప్టెన్ల వద్ద డిప్యూటీగా పనిచేసిన శాస్త్రి  1987-88లో తొలిసారిగా వెస్టిండీస్ పై మద్రాస్ లో జరిగిన మ్యాచ్ లో జట్టును విజేతగా నిలిపాడు. క్రికెటర్ గా స్వార్థపరుడన్న అభిప్రాయం చాలా మంది రవిశాస్త్రి గురించి విన్పించేవారు. ఎవరైనా జిడ్డు ఆడాలంటే అది రవిశాస్త్రి తర్వాతేనన్న అభిప్రాయం దేశంలో నెలకొంది. అయితే ఆ తర్వాత రోజుల్లో హార్డ్ హిట్టింగ్ విషయంలోనూ కొంత విజయం సాధించాడని చెప్పవచ్చు. మొకాలి నెప్పితో జట్టు నుంచి రవిశాస్త్రి వైదొలగాల్సిన పరిస్థితి వచ్చింది. 1992లో 30 ఏళ్ల వయసులోనే క్రికెట్ కు శాస్త్రి గుడ్ బై చెప్పాడు.
అయితే జట్టుకు గుడ్ బై చెప్పిన రవిశాస్త్రి, క్రికెట్ పై ఉన్న మమకారంతో కామెంటేటర్ గా విశేష గుర్తింపు పొందాడు. 2007లో రవిశాస్త్రిని తాత్కాలిక టీం ఇండియా కోచ్ గా బీసీసీఐ నియమించింది. గ్రెగ్ చాపెల్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో రవిశాస్త్రి కొంతకాలం కోచ్ గా సేవలందించాడు. 2014లో టీం ఇండియా డైరెక్టర్ గా మళ్లీ జట్టులోకి వచ్చాడు. 2016 ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ముగిసే వరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగాడు.  
డంకన్‌ ఫ్లెచర్‌ ప్రధాన కోచ్‌గా ఉండగానే 2014 నుంచి 2016 వరకు టీమ్‌డైరెక్టర్‌గా వ్యవహరించిన శాస్త్రి... ఆటగాళ్ల అభిమానాన్ని చూరగొన్నాడు. ఆటగాళ్లకు ఫ్రీడమ్ ఇవ్వడం... వారితో కరుగా మాట్లాడటం కూడా శాస్త్రికి తాజాగా కోచ్ ఎంపికలో కలిసొచ్చిందని చెప్పవచ్చు. రవిశాస్త్రి బాధ్యతల నుంచి పారిపోడని, విమర్శలకు వెరవడు, మాతో ఉంటే... మాలో ఉత్సాహం ఉంటుందంటూ కోహ్లీ... రవిశాస్త్రి గురించి అనేకమార్లు  చెప్పాడు కూడా.
ఊహాగానాలకు, ఉత్కంఠకు తెరదించుతూ టీం ఇండియా కోచ్‌ రేసులో చివరికి రవిశాస్త్రే గెలిచాడు. గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ...  కుంబ్లే స్థానంలో అతణ్ని ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. జట్టు డైరెక్టర్‌గా పనిచేసిన శాస్త్రికి ఆటగాళ్లతో మంచి సమన్వయం ఉంది. గంగూలీ మొత్తం వ్యవహారాన్ని కొంత పెండింగ్ లో ఉంచడంతో...  వినోద్‌ రాయ్‌ నేతృత్వంలోని బీసీసీఐ పరిపాలకుల కమిటీ రంగంలో దిగి...  కోహ్లీతో మాట్లాడి కొత్త కోచ్‌ తక్షణం ప్రకటించాలని కోరింది. సెహ్వాగ్‌ గట్టిపోటీ దారుగా నిలిచినా చివరికి శాస్త్రికే పదవి దక్కింది. సీఏసీ శాస్త్రి, వీరూలతో పాటు టామ్‌ మూడీ, రిచర్డ్‌ పైబస్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లను కూడా ఇంటర్వ్యూ చేసింది. 2019 ప్రపంచకప్‌ వరకు కొత్త కోచ్‌లు పదవుల్లో ఉంటారు.  ద్రవిడ్‌ కొన్ని నిర్దేశిత విదేశీ పర్యటనలకు బ్యాటింగ్‌ సలహాదారుగా పని చేస్తాడు.
కొత్త కోచ్‌ నియామకంపై సీఏసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై ఇంకా చర్చిస్తోంది. అందరి లాగే మాకు కూడా కొత్త కోచ్‌ ఎవరో తెలుసుకోవాలనుంది. తప్పుడు సమాచారం ఇవ్వొద్దంటూ... అని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి చెప్పడం... మీడియా కథనాల్లో నిజం లేదని చెప్పిన కొద్దిసేపటికే... కోచ్ ఎంపిక విషయంలో మీడియా వార్తలే నిజమయ్యాయ్. క్రికెట్‌ సలహా కమిటీ సిఫారసు మేరకే రెండేళ్ల కాలానికి, అంటే 2019 వరకు రవిశాస్త్రిని ప్రధాన కోచ్‌గా, జహీర్‌ ఖాన్‌ను బౌలింగ్‌ కోచ్‌గా నియమించాం. భారత జట్టు విదేశీ పర్యటనలకు.. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలకు వెళ్లినపుడు ద్రవిడ్‌ బ్యాటింగ్‌ సలహాదారుగా వ్యవహరిస్తాడని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా పేర్కొన్నారు.
రాహుల్‌ ద్రవిడ్‌ను విదేశీ పర్యటనల కోసం టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ సలహాదారుగా నియమించారన్న సమాచారం బయటికి రాగానే.. ప్రస్తుతం బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న బంగర్‌పై వేటు పడినట్లే అని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ బంగర్‌ను ఆ పదవిలో కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది.  ద్రవిడ్ కేవలం కీలకమైన విదేశీ పర్యటనలకు మాత్రమే అందుబాటులో ఉంటాడని చెప్పుకొచ్చింది.
జట్టుకు కోచ్ ప్రాధాన్యత 1990లకు ముందు పెద్దగా లేదనే చెప్పాలి. కోచ్ లేకుండానే భారత్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకొంది. అయితే 1990 తర్వాత క్రికెట్ లో పెరిగిన వేగాన్ని అందుకునేందుకు క్రికెట్ దేశాలన్నీ కోచ్ అస్త్రాన్ని వదలాయ్. భారత్ సైతం అంతకు ముందు టీం మేనేజర్ తో సరిపెట్టేది. అయితే 1990లో తొలిసారిగా బిషన్ సింగ్ బేడీని కోచ్ గా బీసీసీఐ ప్రకటించింది. మొదట్లో జట్టుకు కోచ్ లేకుండానే రంగంలోకి దిగిన భారత్ జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తరహాలో కోచ్ నియామకానికి పచ్చజెండా ఊపింది. జట్టులో ఉత్తేజాన్ని నింపి విజయాలు సాధించేందుకు కోచ్ కీలకమన్న అభిప్రాయానికి బోర్డు వచ్చింది. తొలుత స్వదేశీ కోచ్ కు జై కొట్టిన బీసీసీఐ 2 వేలు సంవత్సరం తర్వాత విదేశీ కోచ్ ఎక్సెపిరిమెంట్లు చేసింది. భారత్ జట్టుకు ఇప్పటి వరకు 15 మంది కోచ్ లుగా బాధ్యలు నిర్వర్తించారు.  అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లో 1926 మే 31న భారత్ గుర్తింపు పొందగా... టెస్టు జట్టులోకి వచ్చింది 25 జూన్ 1932. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఇంగ్లాండ్ జట్టుతో భారత్ ఏడు టెస్టు మ్యాచ్ లలో పాల్గొన్నప్పటికీ...  స్వాతంత్ర్యం వచ్చాక ఆస్ట్రేలియాతో భారత్ జట్టు తొలిసారిగా 1947-49లో ఆడిన మ్యాచ్ ల నుంచే ఆడిన ఆటకే ప్రాధాన్యత సంతరించుకొంది. 1983లో భారత్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత క్రికెట్ ప్రపంచంలో భారత్ ధ్రువతారగా ఆవిర్భవించింది. తొలుత భారత్ జట్టుకు మేనేజర్ మాత్రమే ఉండేవాడు. అయితే కోచ్ వేట 1991 తర్వాత మొదలైంది. 1990లో తొలిసారిగా భారత్ జట్టు కోచ్ గా బిషన్ సింగ్ బేడీ నేతృత్వం వహించారు. ఆ తర్వాత  అబ్బాస్ అలీ బేగ్  1991-92 కాలంలో కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత భారత్ జట్టుకు కోచ్ గా అజిత్ వాడేకర్ వ్యవహరించాడు. ఆయన సుదీర్ఘకాలం పాటు కోచ్ గా వ్యవహరించాడు. 1992-96 మధ్య నాలుగేళ్ల పాటు కోచ్ గా కొనసాగాడు. ఆ తర్వాత సందీప్ పాటిల్ ఏడాది మాత్రమే బాధ్యతలు నిర్వర్తించాడు. పాటిల్ తర్వాత అన్షుమన్ గౌక్వాడ్ 1997-99, 2000 సంవత్సరాల్లో కోచ్ గా వ్యవహరించాడు.
భారత్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కోచ్ గా నియమించినప్పటికీ... ఆయన స్వల్ప కాలమే కోచ్ గా కొనసాగాడు.  ఆ తర్వాత న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ జాన్ రైట్ 2000 నుంచి 2005 వరకు చాన్నాళ్లు కొచ్ గా జట్టుకు సేవలందించాడు. తొలి విదేశీ కోచ్ గా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ కోచ్ గా వివాదాస్పదమయ్యాడు. 2005-07 మధ్య కాలంలో జట్టుకు నేతృత్వం వహించిన చాపెల్, గంగూలీ మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గమంది. ఆ తర్వాత కాలంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ గారీ కిరస్టన్ కోచ్ గా భారత్ కు చిరస్మరణీయమైన విజయాలను అందించాడు. 1983 తర్వాత భారత్ జట్టు మరోసారి వరల్డ్ కప్ గెలవడం, ట్వంటీ 20ల్లోనూ విజయం సాధించడం విశేషం. కిరస్టన్ సలహా మేరకు డంకన్ ఫ్లెచర్ ను నాడు బీసీసీఐ కోచ్ గా కొనసాగించింది. ఆయన 2011-15 వరకు నాలుగేళ్ల పాటు కోచ్ గా సేవలందించాడు. ఆ తర్వాత రవిశాస్త్రి టీం డైరెక్టర్ గా రెండేళ్లు కొనసాగాడు. ఆ తర్వాత కోచ్ గా కుంబ్లే రంగ ప్రవేశం చేసి భారత్ జట్టును అటు టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ శిఖరాగ్రాన కూర్చోబెట్టాడు. అయితే కోచ్, కెప్టెన్ లొల్లితో... కుంబ్లే పదవికి గుడ్ బై చెప్పగా... మరోసారి రవిశాస్త్రికి జట్టుకు నేతృత్వం వహించే ఛాన్స్ ద్కకింది. ఒక్కటి మాత్రం స్పష్టం. మోడర్న్ క్రికెట్లో కోచ్ ప్రాధాన్యత పెరిగింది. అది టెస్టు మ్యాచులలో కానీవ్వండి, 50 ఓవర్ల అంతర్జాతీయ మ్యాచులకు సంబంధించి గానీ, ట్వంటీ 20 మ్యాచులకు గానివ్వండి. కోచ్ ప్రాధాన్యతలో దూసుకుపోతున్నాడు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా... కోచ్ తో కలిసి ఆయా బోర్డులు తీసుకోవాల్సిన వచ్చింది. బీసీసీఐ కూడా అదే విధంగా వ్యవహరిస్తూ వచ్చింది.  కోచ్ రాకతో క్రికెట్లో అప్పటి వరకు ఉన్న పాత పద్ధతుల స్థానంలో కొత్త పద్ధతులొచ్చాయ్. క్రికెట్లో దూకుడు అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. కొన్ని సార్లు కోచ్ లు కేక అంటూ దూసుకుపుతుంటే... మరికొన్ని సార్లు... కోచ్ ల వల్లే ఓటమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయ్. అదే పంథాలో కోచ్ లకు, కెప్టెన్లకు, జట్టు సభ్యులకు మధ్య విభేదాలు పొడచూపుతున్నాయ్. ఇవన్నీ వైఫల్యాలు ఎక్కువైనప్పుడు బయటకు వచ్చేవి. అయితే కుంబ్లే భారత్ జట్టు కోచ్ గా అద్భుత విజయాలను సొంతం చేసుకున్నప్పటికీ... ఆయన ఆటగాళ్లతో అనకువగా వ్యవహరించలేదంటూ వివాదం రేగింది.

No comments:

Post a Comment