Friday, 14 July 2017

బాబ్రీ మస్జిద్ కూల్చివేత కేసులో అభియోగాల నమోదు

బాబ్రీ మస్జీద్ కూల్చివేత ఘటన విషయంలో ఆ ముగ్గురికి ఉచ్చు బిగిస్తోంది. బాబ్రీ మస్జిద్ కూల్చివేత కేసులో మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతిలపై     అభియోగాలు నమోదు చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు పరిగణలోకి తీసుకొని...  క్రిమినల్ కేసులను నమోదు చేసింది. అభియోగాల నమోదు తర్వాత నేతలందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బాబ్రీ మస్జిద్ కూల్చివేత ఘటనపై సీబీఐ కోర్టు నేరాభియోగాలను నమోదు చేసింది. 1992లో జరిగిన బాబ్రీ కూల్చివేత ఘటనకు కుట్ర కేసు మరోసారి సంచలనమవుతోంది. కేసుకు సంబంధించి ముగ్గురి నేతల  పాత్రకు సంబంధించి ఎలాంటి క్రిమినల్ పాత్ర లేదన్న వాదనను కోర్టు తిరస్కరించింది. కేసు విచారణను రెండేళ్లలో పూర్తి చేయాలని సీబీఐని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అయితే ముగ్గురు నేతలు రోజువారీ విచారణ కోసం కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదని తెలిపింది. 25 ఏళ్లలో 89 ఏళ్ల ఎల్కే అద్వానీ రెండోసారి కేసు విచారణ కోసం కోర్టు మెట్లెక్కారు.
అంతకు ముందు కోర్టుకు హాజరయ్యేందుకు లక్నో చేరుకున్న ఎల్కే అద్వానీని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ పుష్పగుచ్చం అందించి పలకరించారు. అయితే అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి తన పాత్ర ఏమీ లేదని... ఎలాంటి కుట్ర జరగలేదని... ఎమర్జెన్సీ కాలంలో ఏ జరిగిందే అప్పుడు కూడా అదే జరిగిందని కేంద్ర మంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ అగ్రనేతలకు పార్టీ నుంచి సైతం మద్దతు లభించింది. పార్టీ నేతలందరూ... నిర్దోషులుగా బయటపడతారని... కేసులో వారికెలాంటి సంబంధం లేదని కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు.
నేరాభియోగాలు చేయాలని సుప్రీం కోర్టు... సీబీఐ కోర్టుకు  నెల రోజులు గడువిచ్చింది. అద్వానీతో సహా కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారందరిపైనా అభియోగాలు నమోదు చేసి.. రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కరసేవకులు మసీదు కూల్చివేత సమయంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకుగాను నేతలందరూ విచారణ ఎదుర్కొంటున్నారు. క్రిమినల్ కేసుతోపాటు, విద్వేషాలు రెచ్చగొట్టిన కేసుకు సంబంధించి రెండూ వేర్వేరు కేసులుగా కాకుండా రాయ్ బరేలీ కోర్టు నుంచి లక్నో కోర్టుకు కేసును ట్రాన్సఫర్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
2001లో సీబీఐ కోర్టు అద్వానీతో సహా నేతలందరిపై అభియోగాలను కొట్టివేసింది. కూల్చివేత కేసు, విద్వేష ప్రసంగం కేసును వేర్వేరుగా భావిస్తూ... కోర్టు తీర్పిచ్చింది. 2010లో అలహాబాద్ హైకోర్టు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అభియోగాలు నమోదు చేయడం వల్ల పార్టీ సీనియర్ నేతలపై ఎలాంటి ప్రభావం చూపదని బీజేపీ ఎంపీ, న్యాయవాది సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలు, నిజాలు వెలుగుచూడటానికి ఇదే మంచి తరుణమని ఆయన అన్నారు. అయితే బాబ్రీ మస్జిద్ కూల్చివేత కుట్రే కాదని... కోర్టు తుది ఉత్తర్వు తర్వాతే స్పందిస్తానని  ఆర్‌ఎస్ఎస్ నేత ఎం.జి.వైద్య అన్నారు. బాబ్రీ మస్జిద్ కూల్చివేత ఘటనకు సంబంధించి గత నెలలో సుప్రీం కోర్టు అభియోగాలను తిరిగి నమోదు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. బాబ్రీ కూల్చివేత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించిందని... పేర్కొంది. కేసును     25 ఏళ్లుగా విచారణ జరపడాన్ని తూర్పారబట్టింది. జాయింట్ ట్రయల్ చేయలేకపోతున్నామన్న కారణంతో విచారణను వాయిదా వేయడం దారుణమని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. సాంకేతిక సమస్య సాకుగా చూపిస్తూ... కేసును వాయిదా వేయడం సమంజసం కాదని కోర్టు పేర్కొంది. ఆ తర్వాత అద్వానీ దేశ వ్యాప్తంగా రామమందరం కోసం తీసుకొచ్చిన ఉద్యమం భారతీయ జనతా పార్టీకి దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది.

No comments:

Post a Comment