Friday, 14 July 2017

ఏపీలో బీర్ బాంబ్


ఆయన ఘనత వహించిన ఆబ్కారీ శాఖకు మంత్రి. కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే... ఫస్ట్ టైమ్ మంత్రి. అనుకోకుండా మంత్రి పదవీ వచ్చేసింది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద దుమ్మురేపిన అనుభవంతో మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా...  అదే రీతిలో మాట్లాడుతున్నారు. మద్యం తాగండి... ఆరోగ్యంగా ఉండండంటూ తెలుగు జనాలకు ఉచిత సలహాలిచ్చేస్తున్నాడు. బీరును హెల్త్‌ డ్రింక్‌గా ప్రమోట్‌ చేస్తున్నామంటూ ఆయన చేసిన ఏపీలో కొత్త వివాదానికి కారణమవుతున్నాయ్.
ఆయనకో ప్రత్యేకత ఉంది. టీచర్ గా ఉంటూ... ఉపాధ్యాయ పాలిట్రిక్స్ ను వంటబట్టించుకొని... ఎమ్మెల్యే స్థాయి దాగా ఎదిగిన జవహర్...  సమీకరణాలతో మంత్రి పదవిని దక్కించుకున్నారు. రాష్ట్రానికి కీలక ఆదాయ వనరైన ఎక్సైజ్ శాఖకు మంత్రిగా ఖ్యాతిని పొందారు. అంత వరకు బాగానే ఉన్నా... అనుకోకుండా... మద్యం అమ్మకాలకు కిక్కిచ్చేందుకు... బీర్ ఓ హెల్త్ డ్రింక్ అంటూ నోరుజారారు. కావాలంటే బీరు హెల్త్‌ డ్రింక్‌ ఎలాగో...  నిరూపిస్తానంటూ కూడా మంత్రి సవాల్‌ చేశారు. బీరు తాగితే ఆరోగ్యం బాగుపడుతుందంటూ రాష్ట్ర ప్రజలకు ఉచిత సలహా ఇచ్చారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలున్నాయంటూ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు సాగిస్తున్నాయ్. బెల్టు షాపులను తొలగించాలంటూ...  నారీ భేరీ మోగిస్తోంది. మరోవైపు మంత్రిగారే... బీర్ పై హెల్త్  కామెంట్స్  చేయడంతో వారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. నోటికి ఎంత వస్తే... అంత  మాట్లాడతారా... ఇదేం పద్ధతంటూ మహిళా సంఘాలు మండిపడుతున్నాయ్. ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ తీరు చూస్తే... మద్యం ద్వారా కాసులు పోగేసుకోవాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్టుగా అర్థమవుతోందన్న అభిప్రాయాన్ని మహిళ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. స్పాట్
ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ కన్పిస్తాయోనని వేచి చూస్తున్న...  ప్రతిపక్ష  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేపనిలో పడింది. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు... రోజా ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. లిక్కర్‌ సిండికేట్‌ ఓనర్లంతా కలిసి కేబినెట్‌ సమావేశం పెట్టుకున్నటుందని... సుప్రీంకోర్టు తీర్పును బాబు సర్కారు ధిక్కరిస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. నీరు-మీరు కార్యక్రమంలా నీరు-బారు కార్యక్రమం చేపట్టారంటూ రోజా ధ్వజమెత్తారు.  మెడికల్‌ షాపుల్లో కూడా బీరు అమ్మేలా సర్కారు దూకుడు పెంచేలా ఉందని ఆమె ఫైరయ్యారు.
అదే సమయంలో తాము మద్యంపై సరికొత్త విధానాన్ని తీసుకురాబోతున్నామని...  త్వరలో జరగనున్న పార్టీ ప్లీనరీ వేదికపై పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రకటిస్తారంటూ ఆమె చెప్పారు.  మద్యం పాలసీని వెనక్కు తీసుకోకపోతే లిక్కర్‌ షాపులను ధ్వంసం చేస్తామంటూ ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం రోడ్ల వెంబడి నగరాల్లో, పట్టణాల్లో మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించి... రోడ్లను డీ నోటిఫై చేయనున్నామని, బైపాస్‌ రోడ్లను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పడంపైనా విమర్శలు రేగుతున్నాయ్.  మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడబోమంటూ ప్రభుత్వ పెద్దలు లెక్చర్ల మీద లెక్చర్లు ఇస్తుంటే... మంత్రి గారు మాత్రం మద్యాన్ని బలేబాగా ఎంకరేజ్ చేస్తున్నారు.

No comments:

Post a Comment