Friday, 26 May 2017

భాగ్యనగరంలో సరగోసీ కల్లోలం


భాగ్యనగరంలో ఏదైనా సాధ్యమే...  కొందరికి... అవును నేను చెబుతున్నది నిజమా... తెలుగు సినిమా హీరోలు చెప్పే డైలాగ్ ను ఇక్కడ చెప్పుకోవాలి. దేనికైనా ఓ రేటు. అవును ఇక్కడ పైసలుంటే ఏ పనైనా ఇట్టే అయిపోతుంది. అది ఎంత పెద్ద పనైనా సరే...  చేసేందుకు ఓ టీం...  ఓ నెట్ వర్క్ ఎల్లప్పుడూ రెడీ. హైదరాబాద్ లో జరుగుతున్న సరగోసి నిబంధనలకు నీళ్లొదిలేస్తోంది.  కాసులు విదిలిస్తే కనేందుకు మనుషులు సిద్ధం... ఆ మనుషుల్ని వలేసి పట్టుకునేందు ముఠాలూ సిద్ధం... వారిని కంట్రోల్ చేసేందుకు ఓ నెట్ వర్కూ సిద్ధం...
హైదరాబాద్ లో ఇప్పుడు సరగోసి విధానం కల్పతరువులా మారింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం వాణిజ్యపరంగా సరగోసిని వినియోగించడం నిషేదించడంతో...  ఇప్పుడు సరగోసి ఒక సిక్రీట్ బిజినెస్ గా మారింది. కేంద్ర చట్టంతో వాణిజ్య పరంగా సరగోసి నిషేదించబడినప్పటికీ... ఆసుపత్రులు, సంతానోత్పత్తి కేంద్రాలు మాత్రం తమ వికృత క్రీడను కొనసాగిస్తున్నాయ్. ఎజెంట్లను నియమించుకొని... అమాయక మహిళలకు ఆశ చూపిస్తూ... పల్లెటూరి మహిళలను  సరగొసి రొంపిలోకి దింపుతున్నారు. ఎక్కువగా అనుమానం రాకుండా ఉండేందుకు నగరంలోని శివారు ప్రాంతాల్లో ఈ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. బాలానగర్ , సురారం ప్రాంతాల్లో ఈ దందా ఎక్కువగా జరుగుతోంది. పెళ్లిగాని మహిళలకు పెద్ద ఎత్తున డబ్బులు ఎరచూపి ఎజెంట్లు ఈ పనులు కానిచ్చేస్తున్నారు. 18 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిని ఇందుకు సిద్ధం చేస్తున్నారు. తల్లికావాలని కోరిక ఉన్న పలువురు మహిళలకు సుమారు రూ. 4 నుంచి 5 లక్షల వరకు ఆశ చూపి... వారు గర్భం దాల్చేలే చేస్తున్నారు. ఇందుకు ఫ్యాక్టరీల్లో పనిచేసే అమాయక యువతులు టార్గెట్ అవుతున్నారు. నెలకు రూ. 8 వేలు అంతకన్నా తక్కువ జీతం సంపాదించేవారందరూ...  పెద్ద మొత్తంలో వచ్చే డబ్బుకు దాసోహమవుతున్నారు. నెలకు 8 వేల రూపాయలంటే ఏడాదికి లక్ష... అదే గర్భం దాల్చితే... 9 నెలలకే నాలుగు లక్షలు అంటే సుమారు నెలకు రూ. 45 వేలు. ఇంత మొత్తంలో డబ్బులు వారు ఏం చేసిన సంపాదించడం కష్టమే. అందుకే అమాయక పల్లెటూరి మహిళలు ఇందుకు సిద్ధమవుతున్నారు.  సరగోసీ ద్వారా బిడ్డల్ని కనే తల్లులకు ముఖ్యంగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో మొత్తంలో కాసులు ముట్టజెప్తున్నారు. హైదరాబాద్ లో ఈ విధానం కింద తల్లులకు సుమారు రూ. 4 లక్షల వరకు ఇస్తుండగా, బెంగళూరులో, ముంబాయిలో రూ. 4 లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు అందిస్తున్నారు.
పెద్ద మొత్తంలో డబ్బు  ఎజెంట్లకు ఆసుపత్రుల నుంచి లభిస్తుంటే... ఎజెంట్లు వారి కమిషన్ మినహాయించుకొని సరగొసీ మహిళలకు డబ్బులను అందిజేస్తున్నారు. చిత్రమైన విషయమేమంటే... పెద్ద ఎత్తులో మహిళలను ఆకట్టుకుంటున్న ఏజెంట్లు నగరంలో వివిధ పత్రికల్లో వేరే పేర్లతో ప్రకటనలు ఇస్తూ...  టోల్ ఫ్రీ నెంబర్లతో మహిళలకు ఎరవేస్తున్నారు.  ఎవరైతే మహిళలు డబ్బులు అవసరముంటుందో... తేలిగ్గా డబ్బు సంపాదించొచ్చన్న ఆశ ఉన్న మహిళలు ఇందుకు సిద్ధమమవుతుండటంతో ఎజెంట్లకు కాసుల వర్షం కురుస్తోంది.
చట్టం ఏం చెబుతోంది. సరోగసి విధానం ద్వారా బిడ్డలను కనే విషయంలో కేంద్రం ఏం చెబుతోంది. ఐవీఎఫ్ కేంద్రాలు ఏం చేస్తున్నాయ్. చట్టంలో ఉన్న లొసుగులే ఐవీఎఫ్ కేంద్రాలకు కాసులు కురిపిస్తున్నాయా... ఐవీఎఫ్  కేంద్రాలు చట్టాన్ని ఏవిధంగా వాడుకుంటున్నాయ్...  కేంద్రం ప్రభుత్వం తెచ్చిన బిల్లు ప్రకారం... ఇప్పటి వరకు మహిళలకు స్వచ్చంధంగా గర్భాన్ని దాల్చాల్సి ఉంటుంది. డబ్బు అన్న ప్రస్తావన గర్భం దాల్చిన మహిళలకు ఇవ్వడమన్నది అస్సలు జరక్కూడదని చట్టం చెబుతోంది. అయితే ఎవరైతే సరోగసి ద్వారా వేరేవారి గర్భాన్ని అద్దెకు తీసుకుంటున్నారో వారు... ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చు... ఇతర ఖర్చులను భరించాల్సి ఉంటుంది. కేంద్రం 2010లో తీసుకొచ్చిన ఎ.ఆర్.టి. అసిస్టెడ్ రిప్రొడెక్టివ్ టెక్నాలిజీ డ్రాఫ్ట్ నిబంధనల ప్రకారం... వాణిజ్యపరమైన గర్భందాల్చేందుకు కొంత మేర వెసులుబాటును సాకుగా చూపిస్తూ... ఇన్ వెట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్)  కేంద్రాలు పుట్టుగొడుగుల్లా వెలుస్తున్నాయ్. అయితే ఇది చట్టం కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం డ్రాఫ్ నిబంధనలతో సంతానోత్పత్తి కేంద్రాలు జనాల జేబులకు చిల్లులుపెడుతున్నాయ్. చాలా ఐవీఎఫ్ కేంద్రాలు అక్రమంగా నడుస్తున్నాయ్. పెద్ద డబ్బులను ఆశ చూపించి... గర్భం దాల్చితే తలరాత మారిపోతుందని... 9 నెలలు రిస్కు తీసుకుంటే చాలంటూ వారిని ఈ రొంపిలోకి దించుతున్నాయ్. అయితే ఇప్పుడు సరగొసీ ద్వారా బిడ్డలను కన్న పిల్లల ఆరోగ్యానికి గ్యారెంటీ ఎవరూ ఉండరు. బిడ్డను కన్న తల్లికి తన పని పూర్తైపోతుంది. ఆసుపత్రులు సైతం బిడ్డను ఎవరైతే సరోగసి కోరుకుంటున్నారో వారికి అప్పజెప్పి చేతులు దులిపేసుకుంటారు. ఇక ఎజెంటు గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. నా పని... మీకు బిడ్డను కనివ్వడం వరకే... ఆ తర్వాత దేవుడిదే దయా అంటూ చల్లగా ఎజెంట్లు జారుకుంటున్నారు. గత ఏడాది కేంద్రం సరోగసి రెగ్యులేషన్ బిల్లు 2016ను కేబినెట్ ఆమోదించింది. అయితే ఈ బిల్లు పూర్తిగా వాణిజ్యపరంగా గర్భం దాల్చడాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. అయితే ఇది చట్టం కావాల్సి ఉంది. చట్టం కాకపోవడంతో అక్రమార్కులకు, ఐవీఎఫ్ సెంటర్లకు ఇది వరంగా మారింది. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఎజెంట్లు, ఐవీఎఫ్ కేంద్రాలు అమాయకులను ఇష్టానుసారం దోచుసుకుంటున్నాయ్. సంతానం అవసరం ఒకరిది. డబ్బు అవసరం మరొకరిది. ఇద్దరి అవసరాలను క్యాష్ చేసుకునేందుకు అటు ఆసుపత్రులు... ఇటు ఎజెంట్లు కావాల్సిన విధంగా ప్రణాళికలు రూపొందించేస్తారు.
దేవుడు చల్లంగా చూసి బిడ్డలను ప్రాసాదించాలంటూ మొక్కుకునే వారిని మనం చూశాం. అయితే ఇక్కడ కొంత మంది తల్లిదండ్రులు తమకు పిల్లలు పుట్టకపోయినప్పటికీ... తమకు పుట్టబోయే బిడ్డలు అందంగా పుట్టాలంటూ కోరికల చిట్టా విప్పుతున్నారు. ఇది ఏజెంట్లకు, కాలేజీ అమ్మాయిలకు పెద్ద ఎత్తున కాసులు కురిపిస్తోంది. అండం విడుదలయ్యే సందర్భంగా ఒక గంట ముందు ఆసుపత్రులకు వెళ్లొస్తే రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు వస్తుంటే వద్దనుకునేవారెవరుంటారు. తాజాగా పరిశోధనల ప్రకారం మహిళా ఎగ్ డోనర్స్ కోసం ఏజెంట్లు, ఆసుపత్రులు పెద్ద ఎత్తున శోధన మొదలుపెట్టాయి.  ఎవరు దొరుకుతారా... మనకు అనుకూలమైనవారంటూ లెక్కలు వేసుకుంటున్నారు. వాణిజ్యపరంగా గర్భం దాల్చడాన్ని నిషేదించాలని కేంద్రం యోచిస్తున్న తరుణంలో... ఆరోగ్యకరమైన మహిళలకు, అందమైన మహిళల కోసం ఐవీఎఫ్ కేంద్రాలు ఎజెంట్లను పురమాయిస్తున్నాయ్. మహిళా ఎగ్ డోనర్లకు చెల్లించే మొత్తం రూ. 20 వేల నుంచి ప్రారంభమవుతోంది. అదే డిగ్రీ చదువుకున్న, కాలేజీ చదువుతున్న అమ్మాయిలకైతే ఆ మొత్తం రూ. 30 నుంచి 40 వేల దాకా ఉంది. బాగా అందమైన అమ్మాయిలు, చదువుకున్న అమ్మాయిలకైతే ఈ మొత్తం రూ. 40 వేల నుంచి 50 వేల వరకు ఇచ్చేందుకు సైతం  ఏజెంట్లు రెడీ అవుతున్నారు. సంతానం కోసం వచ్చేవారి అవసరాలను, అభిరుచులను బట్టి... తాము పెద్ద మొత్తంలో ఎగ్ డోనర్స్ కు డబ్బులు ఎర వేస్తున్నట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఏజెంట్లు వివరిస్తున్నారు. 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిలను ముంబయి, బెంగళూరు, చెన్నై వరకు వెళ్లేందుకు మంచి మొత్తాలను ఆఫర్ చేస్తున్నారు. ఇందుకు గాను వారికి రూ. 20 వేల నుంచి రూ. 25 వేలు, రూ 30 వేల వరకు కూడా ముట్టజెబుతున్నారు. అదే సమయంలో అందమైన అమ్మాయి కేరళ నుంచి కావాలనుకుంటే వారికి రూ. 50 వేల వరకు నజరానా అందించేందుకు ఐవీఎఫ్ కేంద్రాలు ఎజెంట్లను రంగంలోకి దించేస్తున్నాయ్. ఇందుకోసం అమ్మాయిలు ఫోటోలను పంపించాల్సి ఉంటుంది. అదే ముంబయి, పూణే ప్రాంతాల్లో ఎగ్ డోనర్  చేసే అమ్మాయిలకు రూ. 30 వేల నుంచి 40 వేల మొత్తాన్ని అందిస్తున్నారు.  ఎగ్ డోనర్  చేసే అమ్మాయిల రుతు స్రావం సమయం పూర్తయ్యాక అండాలను సేకరిస్తారు.
ఐవీఎఫ్ కేంద్రాల దందా కొన్నిసార్లు పతాక స్థాయిలోకి వెళ్తోంది. సంతానం కోసం వచ్చే తల్లిదండ్రులు వారి అభిరుచులకు సంబంధించి తెలుసుకోవడం... వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రేట్లు ఫిక్స్ చేయడం కామనైపోయింది. కేవలం సంతానం కోసమే వచ్చిన జంటలకు ఐవీఎఫ్ కేంద్రాలు, ఎజెంట్లు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయ్. ఎగ్ డోనర్స్ చేసే మహిళల విషయంలో ఎజెంట్లు, ఐవీఎఫ్ కేంద్రాలు కొన్ని రకాల పంథాలను అనుసరిస్తున్నాయ్. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆయా జంటలకు కావాల్సిన పిల్లను అందించేందుకు ఎగ్ డోనర్ గా ఉన్న మహిళలను దోపిడీ చేస్తున్నారు. ఈ కోవలోనే... ఏ పాటిజివ్ బ్లడ్ గ్రూపు ఉన్న మహిళలను అన్వేషించేందుకు మరికొంత మంది ఎజెంట్లు ఇంకొన్ని దారులు వెదుక్కుంటారు. వారికి ప్రత్యేకంగా సొమ్ములు ముట్టజెప్పేందుకు ఎజెంట్లు రెడీ అవుతారు. ముందుగా ఎగ్ డోనేషన్ చేసే మహిళలు వారి ఆరోగ్య సంబంధమైన ఫుల్ డేటాను ఎజెంట్లుకు అందించాల్సి ఉంటుంది. రంగు, ఎత్తు, బరువు, బ్లడ్ గ్రూపు, వివాహం అయిన మహిళలైతే వివాహనమోదు ధ్రువపత్రాన్ని సైతం సమర్పించాల్సి ఉంటుంది. మరికొంత మంది ఇంకొంచెం ముందుడేగిసి తమ కొర్కెల చిట్టా విప్పేస్తారు. అప్పటికే తల్లులుగా ఉన్న కొంత మంది మహిళల విషయంలో వారి పిల్లల ఫోటోలను సైతం పంపించాల్సిందిగా కోరుతున్నారు. ఇలా చేయడం ద్వారా  తమకు ఐవీఎఫ్ పద్దతిలో పుట్టబోయే బిడ్డలు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఎక్కువ శాతం ఎగ్ డోనర్ గా ఉన్న మహిళలు వారు అజ్ఞాతంలోనే ఉంటారు. వారి ఐడెంటిటీని బయటకు చెప్పడానికి ఇష్టపడరు. మరికొన్ని సార్లు నకిలీ ఏజెంట్ల బారినపడి మోసపోయే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఉండటం ఆందోళన కలిగించే విషయం. కొన్నిసార్లు మహిళలకు అండం దానం చేయడం కోసం మైనర్ సర్జరీలు చేసినప్పుడు తలెత్తే పరిణామాల విషయంలో నకిలీ ఎజెంట్లు మహిళలను మోసం చేయడం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది.
2016 సరోగసి చట్టం ఏం చెబుతోంది. సరోగసి విధానంలో నిబంధనలు ఎలా ఉన్నాయ్... ఐవీఎఫ్ కేంద్రాలు ఏం చెబుతున్నాయ్... నియంత్రణ, నిబంధలకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన 2016 సరోగసి బిల్లు ప్రకారం వాణిజ్యపరమైన గర్భం దాల్చడాన్ని నిషేదించింది. న్యాయబద్ధమైన, సమంజసమైన భావనగా మాత్రమే గర్భం దాల్చమన్న ప్రక్రియ జరగాలి... కేవలం 23 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు, 26 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉన్న పురుషులు మాత్రమే ఈ విధానం ద్వారా సంతానాన్ని కోరుకోవచ్చు. సరోగసి ద్వారా సంతానాన్ని కోరుకునే దంపతులు భారతీయులై ఉండాలి. వారి వివాహం చేసుకొని ఐదేళ్లు పూర్తయి ఉండాలి. అదే సమయంలో సరగోసీ ద్వారా సంతానాన్ని కోరే దంపుతులకు సంతానం లేకుండా ఉండటమే కాక, దత్తత తీసుకున్న చరిత్ర కూడా ఉండకూడదు. అంతకుముందు సరోగసి ద్వారా సంతానాన్ని కూడా కనరాదన్న నిబంధన విధించారు. ఒకవేళ సరోగసి ద్వారా సంతానాన్ని కన్నప్పుడు ఆయా బిడ్డలు అనారోగ్యంగా ఉండటం, మతిస్థిమితంతో ఉండటం... ఆరోగ్యంగా ఫిట్ గా లేకుండా ఉండటం, బతకడం కష్టసాధ్యమైనప్పుడు.... సరోగసి ద్వారా మరోసారి సంతానాన్ని కనే వెసులుబాటు చట్టం కల్పిస్తోంది. సరోగసి ద్వారా గర్భం దాల్చే మహిళ... పిల్లలు కనాలని కోరుకుంటున్న మహిళకు దగ్గర రక్తసంబంధం కలిగి ఉండాలి. వారి వయస్సు కూడా 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అదే సమయంలో సరోగసి ద్వారా కన్న బిడ్డకు సాధారణంగా కనే బిడ్డలకు ఉన్న పూర్తి హక్కులు లభిస్తాయ్.
మరోవైపు తల్లిదండ్రులు కాలేకపోయిన అనేక మంది సరోగసి విధానం కావాల్సిందేనంటూ స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ ఉద్యమాన్ని సైతం మొదలుపెట్టారు. తల్లిదండ్రులుగా మాతృప్రేమను పొందాలనుకున్నవారు... సరోగసి విధానం లేకుంటే... బిడ్డలను కనాలన్న కోరిక ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. సరోగసి కోసం ఆన్ లైన్ ఉద్యమం మొదలైంది. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిబంధనల ప్రకారం వాణిజ్యపరమైన గర్భం దాల్చడమన్నది నిషేదం. అయితే బిడ్డలను కనలేని వారి బాధ ఎవరికి తెలుస్తుందన్న అభిప్రాయాన్ని ఆన్ లైన్ లో పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇందుకోసం చట్టాన్ని సవరించాలని కూడా వారు కోరుతున్నారు. మారుతున్న ఆధునిక టెక్నాలజీ ప్రకారం తల్లిదండ్రులయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు సరోగసి వద్దంటారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో అక్రమాలు  ఎక్కడ జరుగుతున్నాయో ప్రభుత్వ యంత్రాంగాలకు బాగా తెలుసనని... అలాంటప్పుడు అక్రమాలకు అడ్డుకట్టవేసి... నిజమైన సరోగసి విధానాన్ని అనుమతించాలని వారు కోరుతున్నారు. గత ఏడాది నవంబర్ 2016లో ప్రవేశపెట్టిన సరోగసి బిల్లు ప్రకారం... మహిళలను దోపిడీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సరోగసి ద్వారా గర్భం దాల్చేవారికి మెడికల్ బిల్లులు మాత్రమే ఇవ్వాలని కూడా బిల్లులో పేర్కొన్నారు. సరోగసి తల్లికి ఏజెంట్లుగానీ, ఐవీఎఫ్ కేంద్రాలు కానీ అణాపైసా చెల్లించారదని చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. నిబంధనలు ఎంతో కఠినంగా ఉన్నప్పటికీ... బిడ్డలు లేని తల్లిదండ్రులు... సరోగసి విధానం ద్వారా బిడ్డలను కన్నప్పుడు వారికి నిజమైన మాతృ ప్రేమ వర్ణించడం సాధ్యమవుతుంది. సమాజంలో ఈసడించుకునే మనషులు మధ్య జీవించి ఉన్న అనేక మంది గోడ్రాలంటూ... మీకు పిల్లలు లేరా అంటూ చేసే కామెంట్లతో అనుభవించిన క్షోభ ఒక్కసారి తమకు పుట్టిన బిడ్డలను చూసుకున్నప్పుడు మర్చిపోవడం తేలికవుతుంది.
మరోవైపు వాణిజ్యపరమైన గర్భాన్ని అడ్డుకోవద్దంటూ కూడా పలువురు నెటిజెన్లు కేంద్రానికి విజ్ఞాపనలు పంపిస్తున్నారు. ఎవరికైనా డబ్బు అవసరం ఉంటుంది. అయితే అది ఇష్టానుసారం కాకుండా... ఒక నిబంధన, క్రమ పద్ధతి ప్రకారం చెల్లింపులు జరిపితే నష్టమేంటని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొంత మది సరోగసి విధానంలో కేవలం రక్తసంబంధీకులే కాకుండా... స్నేహితులు, తమకు మద్దతిచ్చేవారిని కూడా సరోగసి అనుమతించాలని పలువురు కోరుతున్నారు.
ఎన్నో వ్యయప్రయాసలకు కారణమవుతున్న సరోగసి విషయంలో కొందరు సెలబ్రిటీలు ఇష్టానుసారం వ్యవహరించడాన్ని కచ్చితంగా అడ్డుకోవాలి. పిల్లల్ని కనే యంత్రాలుగా సరోగసి తల్లులను చూడటం సమంజసం కాదు. ఇందుకు నిఘా వ్యవస్థలు, యంత్రాంగాలు వారి పని వారు చేయాలి. చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటున్నవారు... సరోగసిని కూడా తమ ఇష్టానుసారం చేస్తుండటం... విమర్శలకు తావిస్తోంది. సెలబ్రిటీలు పిల్లల్నికనడానికి సరోగసి విధానాన్ని అవలంబించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. సృష్టికి ప్రతిసృష్టి జరుగుతున్న తరుణంలో పిల్లలు లేనివారి కోసం పిల్లలను కంటున్న ఈ పద్దతిలో సెలబ్రిటీలు ఎలాంటి కష్టం లేకుండా...  పిల్లల్ని కంటున్న  తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. క్రేజ్ కోసం పిల్లల్ని సరోగసీ ద్వారా కనడం చట్ట విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. డబ్బుంటే అన్నీ చేసుకోవచ్చన్న అభిప్రాయాన్ని పెద్దలు తగ్గించుకోవాలి. ప్రకృతి సిద్ధంగా జరగాల్సిన పనులకు అవసరం ఉన్నా... లేకపోయినా అసహజపద్దతిలో చేయాలని చూడటం సమంజసం కాదన్న భావన ఉంది. సాధారణంగా ఎన్నో వ్యయప్రయాసలతో కంటున్న బేబీలను సాధారణ డెలివరీ వరకు వేచి చూసే పరిస్థితి ప్రస్తుతానికి చాలా తక్కువగా ఉంది. నార్మల్ డెలవరీలో ఉండే కాంప్లికేషన్స్ ఎక్కువ కాబట్టి ఎక్కువ సార్లు పిల్లలను ఆపరేషన్ చేసి మాత్రమే ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఆ తల్లులకు వస్తున్న కాంప్లికేషన్లు ఎక్కువగా ఉంటున్నాయ్. పిల్లలు పుట్టిన తర్వాత ఆ తల్లులను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.  ఒకసారి సిజేరియన్ చేసుకున్నవారికి కాంప్లికేషన్స్ జీవితాంతం వచ్చే ప్రమాదం పొంచి ఉంది. సెలబ్రిటీలో విషయంలో ఈ విమర్శలు ఎక్కువవుతున్నాయ్. కన్నవారికి ఉన్న మమకారం పెంచినవారికి ఉంటుందా అన్న అభిప్రాయాన్ని కూడా ఎక్కువవుతోంది. మానవశాస్త్రవేత్తలు సైతం ఇలాంటి పరిస్థితులను ఖండిస్తున్నారు. సరోగసి ద్వారా పిల్లలను కనడమన్నది ఒకరకంగా అవయవదానం తరహాలోనే ఉందన్న అభిప్రాయాన్ని కొంత మంది వైద్యులు చెబుతున్నారు. బతికున్నవారి వారి కుటుంబ సభ్యులకు ఏవిధంగా అవయవదానం చేస్తున్నారో... సరగోసీ కూడా అలాగే ఉండే దానికి సర్ధకత చేకూరుతుందని... డబ్బుల కోసమే ఈ ప్రక్రియకు సహకరించడమన్నది దారుణమని నిపుణులు  హెచ్చరిస్తున్నారు.
అదే సమయంలో వ్యవస్థలో సమస్యలుంటే... వాటిని పరిష్కరించాలి కానీ... మొత్తం సరోగసి విధానంలో కొత్త చిక్కులు క్రియేట్ చేయోద్దన్న అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం సరగొసీ చేసుకునే విధానాన్ని నిర్వహిస్తున్న ఐవీఎఫ్ కేంద్రాలను నియంత్రించాలే కానీ... నిషేదం మాత్రమే పరిష్కారం కాదని అంటున్నారు. నిషేదమంటే... అండర్ గ్రౌండ్ వ్యాపారాన్ని ప్రోత్సహించడమే అవుతుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. చట్టంలో ఉన్న లొసుగులను నిరోధిస్తూ... బలమమైన చట్టం ద్వారా అక్రమాలకు కళ్లెం వస్తే సరోగసి అర్థం పరమార్థం లభిస్తుంది.

No comments:

Post a Comment