Friday, 26 May 2017

మోదీ మూడేళ్ల పాలన... మెరుపులు... మరకలు

మోదీ మూడేళ్ల పాలన

సామాన్యుడు అసామాన్యుడయ్యాడు.  సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తి అయ్యాడు. దేశ రాజకీయాల్లో మార్పు అంటూ మోత మోగించాడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ... ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఇప్పుడు దేశాన్ని సింగిల్ హ్యాండ్ తో నడిపించే చోదకుడయ్యాడు. రాజకీయంగా పెను సంచలనాలు సృష్టిస్తూ... తన మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నాడు. ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేస్తానన్న ఎన్నికల హామీ దిశగా పాలనలో కొంత పుంతలు తొక్కిస్తున్నాడు. ప్రపంచదేశాల దృష్టిలో భారతదేశాన్నో ఆర్థిక శక్తిగా నిలబెట్టే ప్రణాళికను ఆవిష్కరిస్తున్నాడు. అన్నింటికీ మించి దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాడు. విమర్శలెన్నున్నా... అన్నింటికీ గెలుపే సమాధానమన్న రీతిలో దూసుకుపోతున్నాడు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా మూడేళ్లు... మూడేళ్ల మోదీ ఏలుబడిలో దేశం ఎన్నో సంచలనాలను నమోదు చేసింది. ఇంటా బయటా జరిగిన మార్పులు ప్రపంచపటంలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశాయ్. మోదీ మూడేళ్ల పాలన మరో ఐదేళ్ల పాలనకు బాటలు వేస్తోందా? మోదీ మేనియా వచ్చే పదేళ్ల వరకు కొనసాగుతుందా? యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ ప్రభ జగద్విఖితమవుతుందా? నిరంకుశంగా వ్యవహరిస్తూ... అన్నింటా తన పంతాన్నే నెగ్గించుకోవాలని చూస్తున్నాడా? పార్టీలో తనను వ్యతిరేకించేవారే లేకుండా చేసుకుంటున్నారా? మూడేళ్ల మోదీ పాలనలో ప్లస్ లేంటి? మైనస్ లేంటి?  లెట్స్ వాచ్ ద స్పెషల్ రిపోర్ట్

మోదీ రాజకీయంగా ఎలాంటి సంచలనాలు ఆవిష్కరించారు. 2014 ఎన్నికల్లో గెలుపు తర్వాత జరిగిన ఎన్నికల్లో మోదీ ఎలాంటి ప్రభావం చూపించారు. ఓటమి నుంచి గెలుపు... గెలుపు నుంచి ఓటమి... ఫైనల్ గా యూపీ ఎన్నికల్లో తిరుగులేని విజయం... రాజకీయంగా మోదీ మార్క్ ఎలాంటి ప్రభావం చూపించింది. రాష్ట్రాల్లో గెలుపు ద్వారా మోదీ బలమైన నాయకుడిగా ఆవిర్భవించారా? గోవా, మణిపూర్ లో వ్యవహరించిన తీరు మోదీలోని అసలు రాజకీయనాయకుడ్ని బయటకు తెచ్చిందా?
2014 ఎన్నికల తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో మోదీ బీజేపీని విజయతీరాలకు చేర్చారు. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్  పార్టీ 8 రాష్ట్రాల్లో ఓటమిపాలైంది. ఆంధ్రప్రదేశ్, అసోం, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. అసోం, హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో  బీజేపీ సొంతగా విజయం సాధించగా, ఏపీ, జే అండ్ కే, మహారాష్ట్రలో భాగస్వామ్యపక్షాలతో కలిసి ఎన్నికల్లో జయభేరి మోగించింది. కేవలం ఒక్క పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. త్వరలో జరగనున్న కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధించాలని బీజేపీ ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తోంది. బెంగాల్ లో తృణముల్ పార్టీ, ఢిల్లీలో ఆప్, బీహార్ లో నితీష్, లాలూ కూటమి, తమిళనాడులో అన్నాడీఎంకే, కేరళలో సీపీఎం విజయాలు సాధించాయ్. ఈ నాలుగు రాష్ట్రాలు తప్పించి మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ గణనీయమైన విజయాలను సొంత చేసుకొంది.
మోదీని ఇరుకుపెట్టేందుకు క్రియాశీలకంగా మారిన కేజ్రీవాల్ ఇప్పుడు సొంత ఇంటిని రిపేర్ చేసుకునే పనిలో పడ్డారు. పంజాబ్, గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవాలు, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆప్ ఢిల్లీని కాపాడుకుంటే చాలన్నట్టుగా పరిస్థితుల్లో మార్పు వచ్చాయ్. అదే సమయంలో మోదీకి కొరకరాని కొయ్యగా ఉన్న తృణముల్ పార్టీ సైతం నర్మదా చిట్ ఫండ్ స్కామ్ లో పీకల్లోతు కష్టాల్లో ఉంది. అయితే మోదీపై యుద్ధాన్న కొనసాగిస్తానంటూ దీదీ కుండబద్ధలు కొడుతున్నారు. అయితే నితీష్ మాత్రం బీజేపీకి 50-50 దూరంలో ఉన్నట్టుగా కన్పిస్తున్నారు. దాణస్కామ్ లో చిక్కుకున్న లాలూను, నితీష్ నుంచి వేరు చేసే పనిలో మోదీ పడ్డారు. ఒక్కదెబ్బకు రెండు పిట్టల స్టోరీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. భవిష్యత్ లో ప్రధాని కావాలని కలలు కంటున్న నితీష్... తన ఇళ్లు పదిలంగా ఉంటే చాలన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. గతంలో మోదీపై నిప్పులు చెరిగిన నితీష్ ఇప్పుడు  కేంద్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక తమిళనాడు విషయంలో మోదీ ప్రయోగం విఫలమైంది. శశికళను టార్గెట్ చేసిన బీజేపీ... ఆ స్థానంలో పన్నీర్ సెల్వాన్ని కూర్చోబెట్టాలన్న వ్యూహం బెడిసికొట్టింది. అయితే శశికళ జైలుకెళ్లడం, దినకరన్ కేసుల్లో ఇరుక్కోవడం... పళని స్వామి మోదీ అండ్ కో చెప్పినట్టుగా ఒదిగిపోయే అవకాశమూ కన్పిస్తోంది. ఏపీలోనూ అటు మిత్రపక్షంతోనూ, ప్రధాన ప్రతిపక్షంతోనూ డ్యూయల్ లవ్ లో బీజేపీ మునిగితేలుతోంది. జగన్ కేసుల వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. తెలంగాణలో పాగా వేస్తామంటూ బీజేపీ అధ్యక్షుడు ఓవైపు కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తుంటే...  మోదీ మాత్రం కేసీఆర్ సర్కారుపై ప్రేమ చూపిస్తారు.
ఒడిశాపైనా బీజేపీ దృష్టి పడింది. రెండు దశాబ్దాలుగా తిరుగులేకుండా పాలిస్తున్న నవీన్ పట్నాయక్ కు చెక్ పెట్టి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసి... తామే అధికారం చేపట్టాలన్న భావనలో బీజేపీ ఉంది.
ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ కు సీబీఐ, ఈడీలతో మద్దెలదరువు మోత మోగుతోంది. యూపీ ఎన్నికల తర్వాత జాతీయ పార్టీలైన సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీని అస్థిత్వం కోసం పోరాడేలా చేయడంలో మోదీ విజయం సాధించారు.
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినా... ఆ పార్టీకి గోవా, మణిపూర్ లో పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. అయినప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వాలే ఏర్పడేలా గవర్నర్లు వ్యవహరించిన తీరు విమర్శలపాలైంది. అదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో కేంద్రం పాత్రపైనా, గవర్నర్ పాత్రపైనా పెద్ద ఎత్తున విమర్శలు రేగాయ్. ఉత్తరాఖండ్ లో హరీష్ రావత్ సర్కారును పడగొట్టాలని ప్రయత్నించి... బెడిసికొట్టడంతో కేంద్రం యూ టర్న్ తీసుకొంది. రాజకీయంగా మోదీ పంథా ఒక్కటే కన్పిస్తోంది రణమా... శరణమా... అవును శరణమంటే ఓకే... రణమంటే... ఎలా ఉంటుందో ప్రత్యర్థులకు అర్థమైపోతోంది. అందుకే ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థులు సైతం మోదీకి సాహో అనాల్సిందే...
దేశంలో ఇప్పుడు మోదీ గాలికి మిగతా పార్టీలు నామరూపాల్లేకుండా పోతున్న పరిస్థితి. పేరుకు ఎన్డీఏ ఉన్నప్పటికీ... అది అంతా బీజేపీగానే ట్రీట్ చేయబడుతోంది. ఎన్డీఏ పక్షాలకు ప్రస్తుతం 334 ఎంపీ స్థానాలుంటే వచ్చే రోజుల్లో ఆ సంఖ్య ఎంతకు చేరుతుంది... అందులో బీజేపీ పార్టీ  ప్రభ ఎలా ఉండబోతుంది. జనవరిలో ఇండియా టుడే చెప్పిన సర్వే లెక్కలు... ఇతర సర్వేలెక్కలు అంచనాలేంటి?
యూపీ ఎన్నికలకు ముందు పలు సర్వేలు సైతం మోదీ మేనియా ముందు ఎవరూ నిలబడరన్నట్టుగా చెబుతూ వచ్చాయ్. బీజేపీ పార్టీ వరసుగా రాష్ట్రాల్లో విజయం సాధించడం... అన్నింటికీ మించి యూపీలో సాధించిన విజయం ఆ పార్టీకి తిరిగులేని ఆధిక్యాన్ని చూపిస్తోంది. అప్పటి వరకు వచ్చిన సర్వేలు బీజేపీ గతంలో కంటే ఎక్కువ ఎంపీ స్థానాల్లో గెలుచుకోవడం అనుమానమన్నట్టుగా విశ్లేషించగా... అవి యూపీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా మారిపోయాయ్. పలు రాజకీయ పార్టీలు సైతం 2023లో పోటీకి ప్రిపేర్ అవ్వాలని... 2019లో మోదీని కదిలించడం ఎవరి తరమూ కాదన్న అభిప్రాయంలోకి వచ్చేశాయ్.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 360 స్థానాలొస్తాయంటూ సర్వేలు కూడా వస్తున్నాయ్. ఎన్డీఏకు 42 శాతం ఓట్లు వస్తాయని, యూపీఏ 25 శాతం, ఇతరులు 33 శాతం ఓట్లు సాధిస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్డీఏ ఓట్ల శాతం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం 334 సీట్లు ఎన్డీఏ పక్షాలకు లభించగా... అవి 360 స్థానాలు గెలుస్తాయని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలు సాధించే అవకాశముందని... ఇతరులు 123 స్థానాలకు పరిమితమవుతారని అంటున్నారు. ఇవి జనవరి 2017 ఇండియా టుడే అంచనాలు.
తాజాగా యూపీ ఎన్నికల తర్వాత బీజేపీ భారీగా ఎంపీ స్థానాలను గెలుచుకునేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం లోక్ సభలో బీజేపీ బలం 281 స్థానాలు. కాంగ్రెస్ పార్టీ బలం 44 స్థానాలు. అన్నాడీఎంకేకు 37 మంది ఎంపీల బలం ఉండగా, తృణముల్ పార్టీకి 34 లోక్ సభ సభ్యుల బలం ఉంది. బీజేడీ 20, శివసేన 18, టీడీపీ 16 టీఆర్ఎస్ 11 మంది ఎంపీల బలాన్ని కలిగి ఉన్నాయ్. అదే సమయంలో మిత్రపక్షాల నుంచి మరికొన్ని ఎంపీల బలాన్ని పొందాలన్న ఆలోచనలో బీజేపీ పెద్దలున్నారు. ఆ పార్టీ అధికారంలో భాగస్వామ్యులుగా ఉన్న చోట్ల మరికొన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించడం ద్వారా సొంతగా 300 స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ ఉంది.
మొత్తంగా మీడియా మేనేజ్మెంట్ మోదీకి బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. మీడియాలో తనకు వ్యతిరేక వార్తలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేయగలిగారన్న విమర్శ మోదీ ఎదుర్కొంటున్నారు. మీడియాలో మోదీ భజన ఎక్కువైనట్టుగా కూడా పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తాయ్. జాతీయ న్యూస్ చానెల్ ఎన్డీటీవీపై నిషేదం చివరి వరకు వచ్చినా... చివరి నిమిషంలో ఆ ఆలోచనను కేంద్రం ఉపసంహరించుకొంది.
నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తాం... దేశాన్ని రక్షిస్తా... అవినీతి రహితంగా దేశాన్ని పాలిస్తానంటూ ఎన్నికల్లో జయభేరి మోగించిన ప్రధాని నరేంద్ర మోదీ నల్లధనం విషయంలో అనుకున్నది సాధించారా... దేశాన్ని అవినీతిరహితంగా మార్చగలిగారా... అవినీతిపరుల అంతం జరిగిందా? పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో ఏం మార్పు జరిగింది?
కాంగ్రెస్ పార్టీ పదేళ్ల అవినీతికి చరమగీతం పాడుతానంటూ మోదీ ఎన్నికల ప్రచారాల్లో హోరెత్తించారు. దేశం నుంచి తరలిపోయిన నల్లధనాన్ని వెనక్కి తెప్పించి దేశాన్ని సుసంపన్నం చేస్తానన్నారు. పనిలో పనిగా ఒక్కో భారతీయుడు ఎకౌంట్లో ఎంత వేయోచ్చు కూడా చెప్పారు. దోపిడీదారులు విదేశీ బ్యాంకుల్లో దాచిన డబ్బునంతటినీ వెనక్కు తెస్తే దేశ ప్రజలు ఒక్కొక్కరికి 15, 20 లక్షల రూపాయలు వరకు ఇవ్వొచ్చని మోదీ కుంటబద్ధలు కొట్టారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.బి.షా సారథ్యంలో సిట్‌ ఏర్పాటు చేసినప్పటికీ... అది అంతగా విజయవంతం కాలేదు. విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని వెల్లడించడానికి 2015లో నల్ల ధనం చట్టం చేయగా... కేవలం రూ. 4,164 కోట్ల ఆస్తులను మాత్రమే పలువురు ప్రకటించారు.  అంతగా స్పందన లభించకపోువడం... స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని గత ఏడాది కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కింద రూ. 55,000 కోట్ల ఆస్తులను వెల్లడయ్యాయి. అయితే నల్లధనం విషయంలో ఇప్పటి వరకు కేంద్రం పెద్దగా సాధించిందేమీ లేదని చెప్పొచ్చు. స్విట్జర్లాండ్ బ్యాంకులకు లేఖలు రాయడంతోపాటు... కొంత ముందడుగు పడినప్పటికీ... అవి పూర్తి స్థాయిలో జరగకపోవడం మోదీకి ఇబ్బందికరమైన అంశం.
రాజకీయ నాయకులు కోటాను కోట్ల రూపాయలను స్విస్ బ్యాంకు లాకర్లలో దాచేసుకుంటే... ఆ మొత్తం దేశానికి తిరిగి వస్తుందని అందరూ కళలుగన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని... పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలు దక్కుతాయని అందరూ భావించారు. అయితే మోదీ అంచనాలు నల్లధనం విషయంలో పెద్దగా విజయవంతం కాలేదు.
ఇక పెద్ద నోట్ల రద్దుతో సాహసోపేతమైన నిర్ణయమంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. అయితే గత ఏడాది నవంబర్ లో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటి వరకు దేశ ఆర్థిక వ్యవస్థ కోలేకులేదనిపిస్తోంది. రూ. 500, వెయ్యి నోట్ల రద్దు తర్వాత నగదు సరఫరా అంతగా చేయలేకపోవడం, డిజిటల్ బ్యాంకింగ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా  అది అంతగా ఫలించలేదు. అయితే తాజాగా కేంద్రం మాత్రం పెద్ద నోట్ల రద్దు తర్వాత 90 లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారంటూ చెబుతోంది. అయితే రోగం ఎక్కడ ఉందో తెలిసి కూడా సరైన మందు వేయలేదన్న అభిప్రాయం ఆర్థికరంగ నిపుణలు  వ్యక్తం చేశారు.
కేవలం పెద్ద నోట్ల రద్దు యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే మోదీ తీసుకున్నారన్న అభిప్రాయం పలు వర్గాల్లో వ్యక్తమైంది. బలమైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలను దెబ్బతీసేందుకే మోదీ అలా చేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని... తీవ్రవాదకలాపాలు తగ్గుతాయని... మోదీ సుస్పష్టంగా చెప్పారు. అయితే కాశ్మీర్ లో కొంత కాలం అలజడులు తగ్గినప్పటికీ అవి మళ్లీ యాధావిధిగా మారిపోయాయ్.  పైపెచ్చు బ్యాంకు అధికారులు అవినీతికూపంలో కూరుకుపోయేలా నోట్ల రద్దు ఉదంతం నడిచింది. వచ్చిన నోట్ల కట్టలన్నీ పెద్దల ఇళ్లకు నేరుగా వెళ్లిపోయిన ఘటనలు ఎన్నో చూశాం. అదే సయంలో సామాన్యుడు మాత్రం సమధలా మారిపోయాడు. సామాన్యుడు మాత్రం నగదు కోసం గంటలు గంటలు లైన్లో నిలుచోవాల్సి వచ్చింది.
బినామీ లావాదేవీల చట్టం, రాజకీయ విరాళాల్లో సంస్కరణలు, సూట్ కేసు కంపెనీలపై దాడులు, నగదు లావాదేవీలపై పరిమితులు వంటి చర్యల వల్ల మున్ముందు నల్లధనాన్ని అరికట్టడానికి వీలు కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలోని నగదుపై కేంద్రానికి క్లారిటీ వస్తోంది కానీ.. విదేశాల్లో దాచిన నల్లధనం విషయంలో మాత్రం ఏమాత్రం ముందడుగు పడటం లేదు.
ఆర్థికరంగంపై మోదీ ప్రభావం ఎలా ఉంది. ఉద్యోగ అవకాశాలు మోదీ చెప్పినట్టుగా జరిగాయా? ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ కేంద్రంగా నిలిచిందా? ప్రపంచ దేశాల్లో భారత్ ప్రభ వెలిగిందా? మోదీ చెబుతున్నట్టుగా  ఆల్ ఈజ్ వెల్లేనా?
అచ్చేదిన్ తెస్తామంటూ పాలన పగ్గాలు చేపట్టిన మోదీ ఆర్థికంగా కొంత ముందడుగేశారని చెప్పొచ్చు. దేశంలో కొన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నింటినప్పటికీ... వాటిని కొంత మేరకు తగ్గించడంలో విజయం సాధించారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలోనూ పర్వాలేదనిపించింది. ద్రవ్యలోటు 5.31 గా ఉంది 3.2 శాతానికి దిగివచ్చింది. ధరలు అమాంతంగా పెరిగినప్పుడు ఎగుమతులను కంట్రోల్ చేసి దేశీయంగా వస్తువులను అందుబాటులోకి తెచ్చారు.
ప్రణాళిక సంఘం స్థానే... నీతి అయోగ్ ను తీసుకురావడం ద్వారా కంట్రోల్ తన చేతిలో పెట్టుకున్నారు మోదీ. తద్వారా ఆయా రాష్ట్రాలన్నీ తన కనుసన్నల్లో పనిచేసే సంస్కృతిని తీసుకురావడంపై పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయ్. నిధులు ఇవ్వాలన్నా... నిధులు ఆపాలన్నా అంతా కేంద్రం చేతిలో ఉండేలా చేయడం ద్వారా... రాష్ట్రాల పాలనపై కేంద్రం ప్రభావం ఎక్కువవుతోందన్న విమర్శ ఉంది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు అంతకంతకూ తగ్గడం మోదీకి కలిసివచ్చింది. చమురుపై ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్ర ఖజానాలో భారీగా నిధులు వచ్చి పోగవుతున్నాయ్. బ్యారెల్ చమురు ధర 120 డాలర్లు ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్ రూ 70 ఉంటే... బ్యారెల్ 50 డాలర్లు ఉన్నప్పుడు కూడా పెట్రోల్, డీజిల్ ధర అదే విధంగా ఉంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు భావించినా... అది జరగలేదు. సబ్సిడీ వద్దంటూ చేసిన ప్రచారంతో కేంద్రానికి భారీగా నిధులు మిగిలిపోతున్నాయ్. అయితే అదే సమయంలో ధర తగ్గించి పేదలపై భారం తగ్గిద్దామన్న ఆలోచన మోదీకి అసలే లేకుండా పోయింది. సబ్సిడీల ఎత్తివేత కూడా అండర్ గ్రౌండ్ లో చేసేస్తున్నారు మోదీ.
ఇక ఆర్థికంగా భారతదేశం తాత్కాలిక అడ్డుంకులను అధిగమించి ముందడుగేస్తున్నట్టుగా కేంద్రం లెక్కలు చెబుతున్నాయ్. 2013-14లో విదేశీ పెట్టుబడులు 36 బిలియన్ డాలర్లు ఉండగా అవి నేడు 60 బిలియన్ డాలర్లుకు చేరాయ్. సెన్సెక్స్ 30 వేల మార్క్ ను దాటింది. అందరికీ బ్యాంకింగ్ రంగాన్ని అందుబాటులో తెచ్చారు. ఆన్ లైన్ ట్రాన్సక్షన్ ను ప్రోత్సహిస్తూ...  నగదు రహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు.  విద్యుత్ ఉత్పత్తిలో స్వావలంబన సాధించడమే గాక మిగులు విద్యుత్ దిశగా అడుగులు పడ్డాయ్.
స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు కావొస్తున్నా ఈనాటికి మన దేశంలో బ్యాంకు ఖాతాలు లేని వారు కోట్ల మంది ఉన్నారు. 2014 ముందు వరకు దేశంలో కేవలం 32 శాతం మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలుండేవి. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక 2014 ఆగస్టు నెలలో ప్రధాని మంత్రి జన్ ధన్ యోజన ద్వారా కేవలం 6 నెలల కాలంలో 21 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు కొత్తగా తెరవడంతో దేశంలో ఈ రోజు 70 శాతం మందికి పైగా బ్యాంక్ ఖాతాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో బ్యాంకులకు బడా కంపెనీలు చెల్లించాల్సిన మొండి బకాయిల విషయంలో మాత్రం ముందడుగుపడటం లేదు. విజయ్ మాల్యా లాంటి వ్యాపార వేత్త వేలాది కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిపోతుంటే అడ్డుకోవాల్సిన యంత్రాంగాలు విఫలమయ్యాయ్. లలిత్ మోదీని దేశంలోకి రప్పించడంలోనూ కూడా మోదీ సర్కారు విఫలమైంది. సాక్షాత్తూ కేంద్రం పెద్దలు లలిత్ మోదీని రక్షిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.  దేశంలో 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2014 జూన్‌నాటికి రూ. 2.34 లక్షల కోట్లుగా ఉన్న మొండి బకాయిలు.. 2016 డిసెంబర్‌ నాటికి రూ. 6.46 లక్షల కోట్లకు పెరిగాయి.
స్వచ్ఛభారత్ నినాదంతో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన మోదీ... ఆ తర్వాత ఆ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టారు. ఇలా చేయడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో స్వచ్ఛ సంకల్పం కలిగింది. గతంతో పోల్చుకుంటే వ్యక్తిగత మరుగుదొడ్లు, డెఫెక్షన్ ఫ్రీ ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయ్. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపడుతున్నట్టుగా కేంద్రం లెక్కలు చెబుతోంది. రెండు కోట్ల మందికి గృహాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా... కేవలం మూడున్నర లక్షల ఇళ్లే నిర్మించారు.  ఉద్యోగాలతో నిరుద్యోగాన్ని మాయం చేస్తామన్న మోదీ అంచనాలు విఫలమయ్యాయి. ఏటా కోటి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న ప్రభుత్వ అంచనాలు తప్పాయ్. మేకిన్ ఇండియా, స్టార్టప్ కంపెనీలు వెల్లువలా వస్తాయని భావించినా... అవి కాగితాలకే పరిమితమైపోయాయ్. 2019 నాటికి కొత్త ఉద్యోగాల కల్పన మోదీ ముందున్న అతిపెద్ద సవాల్. గోరక్షకులు, అసహనం మోదీ సర్కారు ఏలుబడిలో పెద్ద వివాదాస్పదమవుతున్నాయ్. ప్రపంచంలోనే బీఫ్ ఎక్సోపోర్ట్ లో నెంబర్ 1గా ఉన్న మనదేశంలో గోవధ పేరుతో బీజేపీ నేతలు, అతివాద హిందూ సంస్థలు చేసినా నానాయాగీ ప్రపంచవ్యాప్తంగా  భారత్ విమర్శలపాలైంది. ఢిల్లీ జేఎన్టీయూలో కన్నయ్యతసహా పలువురిపై దేశద్రోహం కేసుల విషయంలో కేంద్రం అభాసుపాలైంది. హైదరాబాద్ యూనివర్శిటీలో వీసీ వేధింపులతో రోహిత్ వేముల ఆత్మహత్య పెనుదుమారాన్నే రేపింది. దేశవ్యాప్తంగా కేంద్రం విమర్శలపాలైంది.

అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను వేగంగా చుట్టివచ్చిన ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టింంచారు. ప్రపంచదేశాల్లో భారత్ గొప్పతనాన్ని ఆవిష్కరించడం..... వారి నుంచి మనకేం కావాలో... మన నుంచి వారికేం కావాలో తెలుసుకోవడంలో మోదీ విజయం సాధించారు. ఇండియా ఫస్ట్ నినాదాన్ని విదేశాల్లో విన్పించారు. ఏ ప్రధాన మంత్రికి సాధ్యం కాని విధంగా ప్రపంచదేశాల్లో భారత్ అనుకూల, ప్రతికూల దేశాల్లోనూ భారత్ ను స్మరించుకునేలా చేశాడు. అయితే ఐటీపై అమెరికా నిబంధనలతో వస్తున్న సమస్యలను పరిష్కరించడంలో చోద్యం చూస్తున్నారు.
మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక కీలక దేశాలను చుట్టివచ్చారు. వెళ్లిన ప్రతీ చోట భారత్ ఫస్ట్ నినాదాన్ని చాటారు. తీవ్రవాదం వల్ల ప్రపంచంలో ఎక్కువగా నష్టపోయింది భారత దేశమని చాటుతూ... తీవ్రవాద అంతానికి ప్రపంచదేశాలు ఏకం కావాలనని అది ఒక్కరి సమస్యగా చూడరానిది ప్రపంచం బాధ్యతగా చూడాలని కుండబద్ధలు కొడుతున్నారు.
అమెరికాలోని మాడీసన్ స్క్వేర్ లో మోదీ చేసిన ప్రసంగం ఇప్పటికీ భారతీయుల చెవుల్లో మార్మోగుతోంది. గల్ఫ్ లో కీలక దేశమైన  యూఏఈ వెళ్లి అక్కడ భారత మాతకు జై అంటూ నినదించాడు.
మన దేశాన్ని ఆసియా దేశాల్లో పెద్దన్న పాత్ర పోషించేలా చైనాకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు మోదీ. లూక్ ఈస్ట్ నీతితో మన దేశ సరిహద్దుల పటిష్టతపై  దృష్టి  పెట్టారు.  నేపాల్ సహాయకచర్యల్లో భారత్ భేషంటూ ప్రపంచదేశాల కీర్తించడం విశేషం. సరిహద్దు దేశాలైన నేపాల్, శ్రీలంక, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ పక్క దేశాలైనా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్, ఫిజీ, మాల్దీవులతో సత్సంబంధాల కోసం ప్రయత్నించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ఘనంగా నిర్వహించేలా చేశారు.
తనదాకా వస్తే గానీ తీవ్రవాదం సంగతి తెలియదని మొన్న అమెరికాకు, నిన్న యూరప్ దేశాలకు ఇప్పుడు గల్ఫ్ దేశాలకు తేటతెల్లమవుతుంది. తీవ్రవానికి వ్యతిరకంగా ప్రపంచ దేశాలను ఏకం చేయడంలో విజయం సాధించింది భారత్. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం భారత్ తీవ్రవాదంతో ఇబ్బందులు ఎదుర్కోంటుందని సౌదీ పర్యటనలో ముస్లిం దేశాల సాక్షిగా వ్యాఖ్యానించారు. తద్వారా పాకిస్తాన్ తో అంటకాగడానికి ప్రపంచదేశాలేవీ కూడా సిద్ధంగా లేవన్న సందేశాన్ని పంపించారు.
అదే సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పాలనపగ్గాలు చేపట్టాక ఐటీ ఆధారిత ఉద్యోగాల విషయంలో దేశ వ్యాప్తంగా నీలినీడలు కమ్ముకుంటున్నాయ్. అమెరికాలో ఆధిపత్యం చలాయిస్తున్న భారత ఐటీ కంపెనీలు నిబంధనల పేరుతో భారతీయుల ఉద్యోగాలను లాగేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో మోదీ విఫలమయ్యారన్న అభిప్రాయం కలుగుతోంది.
పాకిస్తాన్ విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరి ఆ దేశాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేస్తోంది. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఆ దేశం... ఆ తీవ్రవాదం దెబ్బతోనే కూనరిల్లుతున్న విషయాన్ని ఇప్పటికైనా గమనించాలని మోదీ ఇన్ డైరెక్ట్ గా పలుసార్లు హెచ్చరించారు కూడా. జమ్మూకాశ్మీర్ లో తీవ్రవాదాన్ని రగిలించడం మానుకొని... సొంత ఇంటిని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. తాజాగా మాజీ నావీ అధికారి జాదవ్ ను కాపాడేందుకు కేంద్రం తీసుకున్న చొరవ కూడా ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేస్తోంది.
మోదీ కాశ్మీర్ కార్చిచ్చును ఆపేలా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారన్న అభిప్రాయం ఉంది. జమ్మూ-కాశ్మీర్ లో భాగస్వామిగా ఉన్న బీజేపీ... కాశ్మీర్ అల్లర్లను అడ్డుకోకపోవడం... రోజు రోజుకు హింసాత్మక సంఘటనలు పెరిగిపోతుండటం... సమస్యను జఠిలం చేస్తోంది. పెరుగుతున్న తీవ్రవాద కలపాలు... స్థానికులను ఆకర్షిస్తుంటే... ప్రభుత్వం ఆ చర్యలను తగ్గించేలా ఎలాంటి కార్యాచరణ చేయలేకపోవడం విమర్శలకు కారణమవుతోంది. వేర్పాటువాదులు... స్థానికులపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాశ్మీర్ ప్లాన్ రూపకల్పన ద్వారా  మోదీ మరో ముందడుగేయాలి.
మోదీ ఇప్పుడు ఒక విజయవారధి. తాను ఏం చేసినా సక్సెస్ అవుతానన్న ధీమా ఆయనలో వచ్చేసింది. ఏం చేసినా కరెక్టే... ఆలోచించే చేస్తాడు. దేశానికి మంచే జరుగుతుందన్న ఓ సెక్షన్ ఇప్పుడు మోదీ వెనుక నడుస్తోంది. విపక్షాలను ఏకాకుల్ని చేస్తూ... సింగిల్ గా దేశాన్ని పాలిస్తున్న మోదీ పట్టిందల్లా బంగరమేనా? వ్యతిరేకులను చీల్చిచెండడమే మోదీ నైజమా? తనకు అడ్డొస్తే ఎవరైనా అంతేనా? అద్వానీ విషయంలోనూ మోదీ తన పంతం నెగ్గించుకుంటున్నారా?
మోదీ దేశానికి ఇప్పుడు దిశానిర్దేశం చేస్తున్నాడు. రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలను చిత్తుచేశాడు. తన అనుకున్న లక్ష్యాలను చేరుకుంటున్నాడు. రాజకీయంగా ఒంటరిగా విపక్షాలను ఏకాకులను చేస్తున్నాడు. విపక్షాల అసమర్థత... తన సమర్థతగా మార్చేసుకుంటున్నారు. తన వైఫల్యాలను సైతం విజయాలుగా మార్చుకునేలా పరిస్థితులు మారుతున్నాయ్.
సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఒక పార్టీకి కేంద్రంలో పూర్తి స్థాయి మెజార్టీ రావడం కూడా మోదీ పూర్తి స్థాయిలో పనిచేయడానికి అవకాశం లభించినట్టయింది. తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే... మరింత శక్తిమంతమైన నాయకుడిగా మోదీ రూపాంతరం చెందారు. అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ తన మాటే శాసనం... తన మాటే ఫైనల్ అన్న అభిప్రాయాన్ని కలిగించడంలోనూ కృతకృత్యులయ్యారు.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విముక్తి భారత్ అంటూ అందుకున్న పల్లవి ఆ పార్టీని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయ్. పార్టీలో నేతలకు భవిష్యత్ పై ఆశలు లేకుండా చేస్తూ... ప్రాంతీయ పార్టీలను సైతం దారిలోకి తెచ్చుకుంటున్నాడు. అనుకూలంగా ఉంటే ఓలా... వ్యతిరేకంగా ఉంటే మరోలా వ్యవహరిస్తూ... కొత్త రాజకీయ సంస్కృతికి తెరదీస్తున్నాడు. మోదీ తీరుపై విపక్షాలు... ఎప్పుడూ మీదే అధికారముండదు కదా... అంటూ సరిపెట్టుకుపోవాల్సిన పరిస్థితిలోకి నెట్టేస్తున్నాడు.  అందరికీ కన్పించే మోదీ... అందరికీ కన్పించని మోదీ రెండు పార్శ్వాలు మోదీలో ఉన్నాయ్. తను బలపడటం... పార్టీ బలపడం రెండూ అంశాల ఓవైపు... తనకు అనుకూలంగా ఉంటే ఒకరకంగా... తనకు వ్యతిరేకంగా ఉంటే మరోలా చేయడం మోదీ వర్కింగ్ స్టైల్. పార్టీలో తన వ్యతిరేకులను కంట్రోల్ చేయడం... ఆర్ఎస్ఎస్ వద్ద తన పరపతిని పెంచుకోవడం రెండు విషయాల్లోనూ మోదీ ఒక్కో అడుగు ముందుకేస్తున్నాడు.
ముఖ్యంగా బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ విషయంలో మోదీ వ్యవహరిస్తున్న తీరు అటు పార్టీ సీనియర్లలోనూ, పార్టీ కార్యకర్తల్లోనూ అసంతృప్తికి కారణమవుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి అద్వానీ పేరును సిఫారసు చేస్తారని అందరూ భావించినా... మోదీ మాత్రం ఆ విషయాన్ని మరుగునపడేలా చేసేశారు. పైగా అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతిపై బాబ్రీ మస్జీద్ కూల్చివేత కత్తి వేలాడుతోంది. ఇదంతా మౌని మునిలా చూస్తూ ఊర్కొంటున్నాడన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. రాజకీయ నిరంకుశత్వం మోదీలో ఉన్నట్టుగా మరో నేతలో తన జీవితంలో చూడలేదని బీజేపీ అగ్రనేతలే వ్యాఖ్యానించడం కొసమెరుపు.
మోదీ అంటే ఒక నమ్మకం...  మోదీ అంటే ఒక భరోసా... మోదీ అంటే ఒక ధైర్యం... మోదీ అంటే ఒక గెలుపు... ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ... స్వపక్షంలో విపక్షం లేకుండా చేయడంలో మోదీని మించినవారు లేరు. ఎవరమేమనుకుంటే నాకేంటంటూ మోదీ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ పాలనపగ్గాలు చేపట్టడంపై విమర్శలు రేగినా... వాటిని అణిచివేశాడు. మూడేళ్ల పాలనలో అప్పటి వరకు ఉన్న వ్యవస్థల పనితీరును పూర్తి స్థాయిలో మార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కన్పిస్తూనే... వ్యవస్థలన్నీ తన మాటే వినాలే మార్చుకుంటున్నారన్న అభిప్రాయం ఎక్కువవుతోంది. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో మరొకరు అధికారంలోకి రావడం సాధ్యం కాదన్న రీతిలో మోదీ వటుడింతై అన్నట్టుగా ఎదిగిపోతున్నారు.వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంలో మోదీకి మించినవారు మరొకరుండరంటే అతిశయోక్తి కాదేమో... ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా వన్ మ్యాన్ షో..

No comments:

Post a Comment